Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
KARTHIKA PURANAM -- 12

వశిష్ఠమహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓరాజా! కార్తీకమాసమందు సోమవారమహాత్మ్యమును వినుము. సోమవారముకంటే శనిత్రయోదశి నూరురెట్లు ఫలముగలది. శనిత్రయోదశికంటె కార్తీక పూర్ణిమ వెయ్యిరెట్లు ఫలముగలది. పూర్ణిమకంటే శుద్ధ పాడ్యమి లక్షరెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమికంటే చివర ఏకాదశి కోటి గుణ ఫలప్రదము. అంతిమైకాదశికంటే కార్తీకద్వాదశి అనంతగుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమైకాదశియనగా కార్తీకబహుళ ఏకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన యెడల కార్తీకశుద్ధ ఏకాదశియేయగును. వింధ్యోత్తరదేశమందు అంతిమైకాదశియనగా కార్తీకశుద్ధైకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. ఇదిగాక ముందు కార్తీకశుద్ధైకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుద్ధైకాదశియే గ్రహించబడినది. మోహముచేతనైనా అంతిమైకాదశినాడు ఉపవాసముచేసి గీతవాద్య పురాణములచేత జాగరణమాచరించువాడు సమస్త పాపవిముక్తుడై విష్ణులోకమందు నివసించును. ఏకాదశినాడు ఉపవాసమాచరించి క్ద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడా పారణచేయువాడు సాయుజ్యముక్తిపొందును. ద్వాదశినాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధిబొందును. సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును. వేయి గ్రహణములును, పదివేల వ్యతీపాతయోగములును, లక్ష అమావాస్యలును కలిపి ద్వాదశీ వ్రతఫలానికి పదహారవ వంతుకు కూడా చాలవు. పుణ్యములనిచ్చెడు తిథులనేకములున్నవి గాని ద్వాదశి హరిప్రియముగాన వాటికన్నిటికంటె అధికఫలప్రదము. క్షీరాబ్దిద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశినాడు అనగా ఏకాదశినాడు రాత్రి యామముండగా హరి పాల సముద్రమునుండి నిద్ర లేచును గాన ఆద్వాదశి హరిబోధినియనబడును. ఆద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకయినను అన్నదాన మాచరించువాడు యిచ్చట భోగములనుబొంది అంతకాలమందు హరిసన్నిధి పొందును. కార్తీకమాసమందు ద్వాదశినాడు పెరుగు అన్నమును దానముచేసిన యెడల సమస్త ధర్మములకంటే అధిక ఫలమునుబొందును. స్త్రీగాని, పురుషుడుగాని, కార్తీక శుక్ల ద్వాదశినాడు పాలిచ్చెడియావునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతోగూడ గోదానమాచరించిన యెడల ఆగోవుకు యెన్నివేల వెంట్రుకలుండునో అన్నివేల యేండ్లు స్వర్గనివాసు కలుగును. కార్తీకమాసమందు ద్వాదశినాడు భక్తితో వస్త్రదానమాచరించు వాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసికొని వైకుంఠలోకమునకుబోవును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ద్వాదశియందుగాని, పూర్ణిమయందుగాని, పాడ్యమియందుగాని, కంచుపాత్రలో ఆవునెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మలలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశినాడు ఫలమును, యజ్ఞోపవీతమును, తాంబూలమును, దక్షిణను, యిచ్చువాడు ఈలోకమందు అనేక భోగములను బొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో గూడా చికాలము సుఖించును. కార్తీక ద్వాదశినాడు బంగారపు తులసీవృక్షును, సాలగ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలమును జెప్పెదను వినుము. కార్తీకద్వాదశినాడు పూర్వోక్తానమును జేసినవాడు ాలుగు సముద్రముల మధ్యనున్న భూమినంతయి దానమిచ్చువాడు పొందిన ఫలమును బొందును. ఈవిషయమందు ఒక కథగలదు చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతములు నశించును. గోదవరి తీరమందు దురాచారవంతుడైన యొక కోమటిగలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరుగడు. ానైనను అనుభవించుటయును లేదు. వాడు ఎవ్వనికిని ఉపకారమాచరించలేదు. నిత్యము పరనిందచేయు వాడు, పరద్రవ్యములందాసక్తి గలిగియుండువాడు. ఆకోమటియొక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ ఋణమును తిరిగి పుచ్చుకొనుటకొరకు ఆయన యూరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలిసికొని అచ్చటికి వెళ్ళి బ్రాహ్మణుడా! నాసొమ్ము నాకిమ్ము అనియడిగెను. బ్రాహ్మణుడా మాటవిని ఓయీ! యీనెలాఖరుకు నీ సొమ్మును నీకు యేదోయొక విధముగా యిచ్చెద్దను. కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసికొని పొమ్మనెను. ఋణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వనివాడు నరకమందు యాతనలనొంది తిరిగి ఋణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును యివ్వవలసియుండును. బ్రాహ్మణుడిట్లు చెప్పినమాటను విని వైశ్యుడు కోపముచేత కళ్ళెర్రజేసి ఓరీ మూఢా! బ్రాహ్మణాధమా! నాధనము నాకిప్పుడేయిమ్ము లేనియెడల యీకత్తితో నిన్ను నరికెదనని దుర్మార్గ బుద్ధితో ఆవేదాంతవేత్తయైన బ్రాహ్మణుని జుట్టుపట్టుకొని లాగి క్రిందపడద్రోసి పాపబుద్ధిగలవాడగుటచేత తన కాలితో వానిని తన్ని కత్తితో కొట్టెను. ఆకత్తిదెబ్బచేత ఆ బ్రాహ్మణుడు సింహముదెబ్బచేత లేడివలె మృతినొందెను. తరువాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చటనుండి పరిగెత్తి యింటికిపోయి క్బ్రాహ్మణుని చంపితినను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతినొందెను. అంత కరాళముఖులును, అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగలవారును, భయంకరులును, నగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆవైశ్యుని యమపాశములచేత బంధించి యమలోకమునకు గొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమను నరకమందు యమాజ్ఞచొప్పున బాధించుచుండిరి. రౌరవము రురువనగా మృగవిశేషము. దాని సం
బంధమైనది రౌరవము. అనగా రురు మృగములచేత వాటి కొమ్ములతో బాధింపించెడి నరము రౌరవనరకమనబడును. ఆవైశ్యుని పుత్రుడు ధర్మవీరుడనువాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనముచేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను జేయింుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు అన్నిజాతుల వారికి ఆకలిగలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను జేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆధర్మవీరుడు హరిని బూజించుసమయమున నారద మహాముని సమస్తలోకములందు తిరుగుచు ఆనాడు యమలోకమునుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వనిచేయుచు రోమాంచితుడై "గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణో, అనంత. వైకుంఠ, శ్రీనివాస, శ్రీ వత్స భూష విశ్వంభర, సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే" ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరు జూచి వైశ్యుడు ఆనంద సాగరమగ్నుడై నేత్రములవెంట ఆనంద భాష్పములను వదలుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామమాచరించెను. నారదుు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొనెను.
తరువాత ఆవైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలినిబట్టినవాడై అర్ఘ్యాదులచేత పూజించి హేనారదా మీరు మాగృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు యేమిపుణ్యు చేసితినో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నా పూర్వ పుణ్యమిప్పుడు ఫలించినది. మునీంద్ా! మీకు దాసుడను ఏమిసేవచేయవలెనో చెప్పుము చేసెదను. వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో గూడిన ముఖముగలవాడై ధర్మవీరునితో నిట్లనియె. నారదుడిట్లు పల్కెను. ధర్మవీరా! నామాటను జాగ్రత్తగా వినుము. కార్తీకద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది గను ఆరోజున చేసిన స్నానదానాదికము అనంతఫలప్రదమగును. సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసమందు ద్వాదశినాడు ధనికుడుగాని, దరిద్రుడుగాని, యతిగాని, వానప్రస్థుడుగాని, బ్రాహ్మణుడుగాని, క్షత్రియుడు గాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, స్త్రీగాని, సాలగ్రామదానమాచరించువారికి జన్మ జన్మాంతరకృత పాపములు నశించును. ధర్మవీరా! వినుము. నీతండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలనొందుచున్నాడు. అతని పాపవిశుద్ధికొరకు కార్తీకద్వాదశినాడు శీఘ్రముగా సాలగ్రామ శిలదానమును జేయుము. నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియె. మునీంద్రా! గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలయిన మహాదానములచేత కాని ముక్తి శిలాదానము చేత యెట్లు గలుగును? శిలాదానము వృధాగా చేయుట యెందుకు? అది భోజ్యముగాదు. భక్షణముగాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారదమహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడ మూఢుడై సాలగ్రామ దానమును జేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్థానమయ్యెను. తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతినొంది మహాత్ములమాట వినని దోషముచేతను, సాలగ్రామ దానము చేయని దోషముచేతను నరకమందు బాధలనొంది తరువాత మూడుసార్లు వ్యాఘ్రమై జన్మించి తరుాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము అయిదు మారులు వృషభమై యుండి తరువాత పదిమార్లు స్త్రీగా జన్మించి గతభర్తయై వైధవ్యమును బొందియుండెను. ఇట్లు పదిజన్మలు గడచిన తరువాత పదకొండవ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యౌవనమురాగానే తండ్రి తగినవరునికిచ్చి వివాహము చేసెను. కానీ పూర్వకర్మవలన ఆవరుడపుడే మృతుడయ్యెను. దానిని, మృతినొందిన ఆఅల్లుని బందువులందరు వచ్చి చూచి అట్టి బాల్యవైధవ్యమును చాలా దుఃఖించిరి. యాచకుడు దివ్యదృష్టితో జూచినవాడై ఆచిన్నదాని బాల్యవైధవ్యమునకు కారణమును దెలిసికొని బంధువులందరికిని కుమార్తెయొక్క పూర్వపుణ్యమును, పూర్వపాపమును జెప్పెను. ఇట్లు చెప్పి కూతురుయొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీకసోమవారమందు వేదాంతవేత్తయైన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆసాలగ్రామ శిలా దానమహిమ చేత కూతురభర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరు సుఖముగా చిరకాలమునుండి స్వర్గమునకు బోయి అందు బహుకాలమానందముతో యుండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యముచేత వానికి జ్ఞానోదయమయ్యెను. ప్రతి సంవత్సరమందు కార్తీకసోమవారమున సాలగ్రామశిలాదానమాచరించి ఆపుణ్యముతో మోక్షసామ్రాజ్యపదవిని పొందెను. రౌరవనరకమందున్ వాని తండ్రియు ఆసాలగ్రామ దాన మహిమ చేతముక్తుడాయెను. కాబట్టి జనకమహారాజా! కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందియములేదు. పాపకర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశ్యుపవాస ద్వాదశీ సాలగ్రామదానాదులచేత పోగొట్టుకొన గల్గుదురు. కార్తీకమాసమందు సాలగ్రామదానమువలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తములేదు. ఇందుకు సందియము లేదు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వాదశోధ్యాయః
Kartika Puranam - 14

కార్తిక పురాణము -పదునాల్గవ అధ్యాయము

కార్తీక పూర్ణిమాదినమందు వృషోత్సర్గమును(ఆబోతు, అచ్చుపోయుట) చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీకవ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది. కార్తీక పూర్ణిమనాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును జేయువానికి కోటిమారులు గయాశ్రాద్ధమును జేసిన ఫలముగలుగును. రాజా! స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తీక పూర్ణిమనాడు నల్లని గిత్తను, గిత్తదూడను లేక ఆబోతును విడుచునా, అట్లయిన మనము తృప్తిబొందుదుమని కోరుచుందురు. ధనవంతుడుగాని, దరిద్రుడుగాని కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయనివాడు యమలోకమందు అంథతమిస్రమను నరకమును బొందును. కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయక గయాశ్రాద్ధ మాచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, హాలయము పెట్టినను పితరులకు తృప్తిలేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయుట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి. కాబట్టి కార్తీకపూర్ణిమనాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పనియేమున్నది? కార్తీకమాసమందు అన్ని పుణ్యములకంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవఋణ మనుష్యఋణ పితృ ఋణములనుండి విముక్తుడగును. ఈరోజు దక్షిణతో గూడ ధాత్రీఫలమును(ఉసిరి) దానమిచ్చువాడు సార్వభౌముడగును. అనగా భూమికి ప్రభువగును. కార్తీకపూర్ణిమనాడు దీపదానమాచరించువాడు విగతపాపుడై పరమపదము నొందును. దీపదానమాచరించువాని మనోవాక్కాయ కృతపాపములన్నియు నశించును. ఈరోజు ఈశ్వర లింగదానమాచరించువాడు ఈజన్మమందు అనేక భోగములననుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అగును. ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తీకమాసమందు లింగానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు. (ఈశ్వరలింగము - బాణము). కార్తీకవ్రతము అనంత ఫలప్రదము. సామాన్యముగ దొరకనిది. కనుక కార్తీకమాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృశేషమును, తినగూడని వస్తువులను భక్షించు, శ్రాద్ధాన్నమును సేవించుట అనగా భోక్తగానుండుట, తిలదానము గ్రహించుట ఈఅయిదును విడువవలెను. కార్తీకమాసమందు సంఘాన్నమును, శూద్రాన్నమును, దేవార్చకులయన్నమును, అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును విథవాన్నమును భుజించరాదు. కార్తీకమాసమున అమావాస్యయందును, పూర్ణిమయందును, పితృదినమందును, ఆదివారమందును, సూర్ చంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు. కార్తీక ఏకాదశినాడు రాత్రింబగళ్ళును, వ్యతీపాత వైధృతి మొదలైన నిషిద్ధ దినములందును జ్రాత్రి భుజించరాదు. అప్పుడు చాయానక్తమును జేయవలెను గాని రాత్రి భోజనము చేయగూడదు. చాయానక్తమే రాత్రి భోజనఫలమిచ్చును. కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీకవ్రతము చేయువాడు చాయా నక్తమునే గ్రహించవలెను. చాయానక్తమనగా తన శరీరము కొలతము రెట్టింపునీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడు యతి విధవలకు చాయనక్తము విహితము. సమస్త పుణ్యములను యిచ్చు కార్తీకమాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములగును. ఆపాపవిస్తారము నేనెట్లు చెప్పగలను. చెప్పుటకు కూడా అశక్తుడను. కాబట్టి విచారించి కార్తీకవ్రతమును ఆచరించవలెను. కార్తీకమామందు ౧. తలంటుకొనుట ౨. పగలునిద్రయు, ౩. కంచుపాత్రలో భోజనము, ౪. మఠాన్న భోజనము, ౫. గృహమందు స్నానము, ౬. నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, ౭. వేదశాస్త్ర నింద యీ ఏడునూ జరుపగూడదు. తలంటుకొనుట-తైలాభ్యంగము.
ఈమాసమందు శరీర సామర్ధ్యముండియు, గృహమందు ఉష్ణోదక స్నానమాచరించినయెడల ఆస్నానము కల్లుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తులయందు రవియుండగా కార్తీకమాసమందు నదీస్నానము ఖ్యము. సర్వశ్రేష్ఠము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీస్నానమే చేయవలెను. అట్లు నదియుండనిచో తటాకమందుగాని, కాలువలయందుగాని, బావులవద్దగాని స్నానము చేయవలెను. తటాక కూపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలెను. ఇది గంగయందును, గోదావరియందును, మహానదులయందును అవసరము. (లేక) గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాకస్నానము కర్తవ్యము. గంగకు నమస్కరించవలెను. కార్తీకమాసము ప్రాతస్నానమాచరించి వాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను. పగలు చేద్యదగిన వ్యాపారములన్నియు చేసికొని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోను, ఫలోదకములతోను, కుశోదకముతోను మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోను పూజించవలెను. తరువాత శంకరుని ఆవాహనము చేయవలెను. శంకరాయ ఆవాహనము సమర్పయామి తరువాత ౨.వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి, ౩. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి, ౪. లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి, ౫. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి ౬. గంగాధరాయ స్నానం సమర్పయామి. ౭.ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి ౮. జగన్నాధాయ ఉపవీతం సమర్పయామి ౯. క
పాలధరిణే గంధం సమర్పయామి. ౧౦. ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి. ౧౧. పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి. ౧౨. తేజోరూపాయ దీపం సమర్పయామి ౧౩. లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి. ౧౪. లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి ౧౫. భవాయ ప్రదక్షిణం సమర్పయామి. ౧౬. కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను. పైనజెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు
శ్లో!! పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంఘ్రి పంకజః!
అర్ఘ్యం గృహాణ దైత్యారేదత్తంచేదముమాపతే!!
అను మంత్రముతో అర్ఘ్యము నివ్వవలెను. ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును. సంశయము లేదు. రాజా! తనశక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈప్రకారము కార్తీకమాసమంతయు బ్రాహ్మణులతో గూడి నక్తవ్రతమును జేయువాడు వేయి సోమయాగమును, నూరు వాజపేయయాగములు, వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలమును బొందును. కార్తీకమాసమునందీ ప్రకారముగా మాస నక్తవ్రతమాచరించు వాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్తవ్రతము వలన పుణ్యమధికమగును. సమస్త పాపములు నశించును. ఇందుకు సందేహము లేదు. చతుర్దశియందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును బెట్టిన యెడల పితరులందరు తృప్తినొందుదురు. కార్తీకమాసమున శుక్ల చతుర్దశినాడు ఫలదానమాచరించువాని సంతతికి విచ్ఛేము గలుగదు. సందేహము లేదు. చతుర్దశినాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించు వాడు కైలాసమునకు ప్రభువగును. సమస్తపాపములను బోగొట్టునదియు, సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయిన కార్తీకవ్రతమును జేయువాడు విగతపాపుడై మోక్షమొందును. పవిత్రకరమైన యీ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తమును జేసుకొన్న వారగుదురు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే చతుర్దశాధ్యాయస్సమాప్తః
శివపురాణం - 14 వ భాగం

విశ్వేశ్వర లింగము – వారణాసి – భాగం – 1:
వారణాసి క్షేత్రంలో వెలసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనాశ్లోకం చెప్తూ ఉంటారు.
సానందమానందవనే వసంతం, ఆనందకరం హతపాప బృందం
వారాణసీ నాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే!!

ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తెరిగి, ఈశ్వరా, నీవే నన్ను నీవాడుగా స్వీకరించు’ అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే’ – ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేస్తున్నాను’ అని ప్రార్థనా శ్లోకమును ప్రారంభం చేస్తారు. సనాతన ధర్మమున జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు. అసలు కాశి నేను రాను అన్నవాడు కాని, వెళ్ళనన్నవాడు కానీ ఉండడు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనినాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయలేడు. మొట్టమొదట ఈలోకమునకు ఉపాసనా క్రమమును నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్ట మొదట కనపడింది. వీరు సృష్టి చేయడానికి వచ్చారు. దీనినే శాస్త్రం ‘నారాయణ, నారాయణి’ అని మాట్లాడింది. ఇపుడు వాళ్ళిద్దరూ చూసి ‘నీ సంకల్పం మాకు తెలిసింది. మేము ఏమి చెయ్యాలి? అని అడిగారు.అపుడు ఆయన తపించండి’ అని చెప్పాడు. నిర్గుణం నుండి సగుణం అయిన తర్వాత ఆయన నోటి వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు అనేది. అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగారు. అప్పుడు ప్రపంచం అంతా నీటితో నిండిపోయి ఉంది.. వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణమును సృష్టించాడు. అదే వారణాసి. అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. చావడం పుట్టడం ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేశాడు. ఇలా బతికేటట్లు చేయడానికి కాశి ఇప్పుడు మోక్షపురి అయింది. కాశి భోగపురి కాదు. మీరు చేసిన పాపరాశి దగ్ధం అయిపోవాలి అంటే వాడు శరీరంతో కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు.

ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాడు. ఆ పట్టణంలో అడుగు పెట్టినంత మాత్రం చేత పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీ పట్టణము నందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అందుకే చచ్చిపోతే కాశీ వెళ్లి చచ్చిపోవాలన్నారు. కాశీ పట్టణానిది విచిత్రమైన స్థితి. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది. విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికి వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. అప్పుడు ఆ వ్యక్తీ మోక్షమును పొందాలి. ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అది జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అందుకనే అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణం అయింది. ఇప్పుడు అయిదు క్రోసుల కాశీపట్టణం సిద్ధం చేసి ఇక్కడ తపించండి అన్నాడు. శ్రీహరి కూర్చుని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవహించి వెడుతున్న నీళ్ళ వంక చూసి ఆశ్చర్య పోతున్నాడు. శ్రీమహావిష్ణువు శరీరమునుండి పుట్టిన తపో వ్యగ్రత చేత కలిగిన జలధార ఆయన కూర్చున్న కాశీపట్టణమును ముంచెత్తేస్తోంది. ఇప్పుడు శంకరుడు చూసి తన త్రిశూలం చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు ఆ పట్టణమునాకు త్రిశూల స్పర్శ కలిగింది. నీళ్ళలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలం ఒకటి జారి ఆ నీళ్ళలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే ‘మణికర్ణికా తీర్థం’ అయింది.

అప్పుడు శివుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ‘ ఇప్పటి వరకు ఈ పట్టణమును మాత్రమే సృష్టించాను. లయం జరిగినప్పుడు ప్రళయజలములందు ఈలోకం అంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశి నా త్రిశూలమునకు పైన నిలబడింది కాబట్టి ఈ పట్టణం మునగదు. ఈ కాశీపట్టణం అలాగే ఉండిపోతుంది’ అన్నాడు. కాబట్టి కాశీకి లయంలేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళాడు. ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి బ్రహ్మ వచ్చారు. వేదమును ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభం అయిన భూమి వారణాసి. ‘వారణ’ ‘అసి’ అని రెండు నదుల సంగమ క్షేత్రం వారణాసి. శంకరుని జటాజూటం మీద పడి అక్కడినుంచి క్రిందకి ప్రవహించి వచ్చిన గంగానది ఒరిపిడితో ప్రవహించిన భూమి వారణాసి.

అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేశారు ‘ఈశ్వరా, ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో మొదలయింది ఆ స్వరూపమును శ్రీ మహావిష్ణువే చూశారు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు కనుక నీవు విశ్వేశ్వర నామంతోను, విశ్వమునకు నాథుడవు గనుక విశ్వనాథుడను నామంతోను పిలవబడతావు’ అని చెప్పింది. సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసినది ఉపాసన. అందుచేత అది స
్వయంభూలింగం అయింది. ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఇపుడు ఈ సృష్టి నిలబడదానికి ఆహారం అవసరము. ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది. తన భర్త విశ్వభర్తయై అక్కడ కూర్చుంటే అన్నపూర్ణయై తాను అంతరికీ అన్నం పెడతానని మునికాన్తలు అందరూ సంతోషపడేటట్లుగా ఆ శివశక్తి ఏ సృష్టికి హేతువయినదో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది.

భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః’ అన్నారు వాల్మీకి రామాయణంలో. శంకరుని శరీరమును తాకి క్రింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలు పెట్టి వారణాసీ క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయింది. మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవ స్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము. ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం, దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానమునకు వెళ్ళడం. మనం అందరూ అలానే తిరుగుతున్నాము. మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది. కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాం. పరమశివుడు మహాజ్ఞాని. ఆయన అనురాగమును నలుగురు చూరగొన్నారు – గౌరీదేవి, గంగాదేవి, కాశీపట్టణం, దాక్షారామం. కాశీ మోక్షపురి పెద్దలయిన వారు ముందు నడవడిని చూపిస్తే వెనకనున్న వాళ్లకి అలవాటు అవుతుంది. అందుకని వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక ఏడురోజుల పాటు ఆయనకీ అన్నం దొరకకుండా చేశాడు. వ్యాసుడికి అక్కసు పుట్టింది. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా! వ్యాసుడు శాపజలమును పటుకోగానే గభాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి 50 సం!!ల స్త్రీ బయటకు వచ్చి “నీ మనశ్శుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. కాశీని శపిద్డామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్లి స్నానం చేసి మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా. అన్నం పెడతాను’ అన్నది. వ్యాసుడు వెళ్లి గంగాస్నానం చేసి సంధ్యావందనం, అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు. ఈవేళ కూడా మనకు భోజనం లేదు. అని అనుకుని ఆపోశన నీళ్ళు చేత్తో పట్టుకునే సరికి పొగలు కక్కుతున్న అన్నం, కూరలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అన్నిటితో నెయ్యి అభిఘారం చెయ్యబడిన విస్తరి కనపడింది. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోశనం పట్టేశారు. అమ్మవారు వచ్చి ‘మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చోనమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడావిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలి పొమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్లిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అపుడు శంకరుని తీసుకు వచ్చింది. అపుడు వ్యాసుడు అమ్మవారి వంక, అయ్యవారి వంక చూశాడు. అపుడు శంకరుడు ‘వ్యాసా, నీవు ప్రాజ్ఞుడవని, ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నాచేత నిర్మింపబడి కొన్ని కోట్లమందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసీ పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో’ అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్పుకున్నాడు.

వెనక్కి తిరిగి బాధలో అయ్యో కాశీ విడిచి పెట్టి వెళ్లిపోవడమా? అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అపుడు వెనక నుంచి అమ్మవారు ‘వ్యాసా, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి. నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి. భోగము, మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడనుండి దక్షారామం వెళ్ళిపో’ అంది. ఇదీ అన్నపూర్ణాతత్త్వం అంటే. అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం.
Kartika Puranam - 16

కార్తిక పురాణం – 16వ అధ్యాయం

వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు బ్రీతికరమైన ఈకార్తిక వ్రతమును జేయనివాడు కల్పాంతము వరకు నరకమొందును. కార్తికమాసము నెలరోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీకమాసమందు నెలరోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకొనును. వైకుంఠమునకు బోవును. కార్తికమాసమందు పూర్ణిమనాడు సంతానమును గోరి సూర్యునుద్దేశించి స్నానము దానము చేయవలెను. అనగా అట్లు చేసినయెడల సంతానము గలుగునని భావము. కార్తికమాసమందు హరిసన్నిధిలో టెంకాయదానమును దక్షిణతాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు. రోగము ఉండదు. దుర్మరణము ఉండదు. కార్తికమాసమందు పూర్ణిమనాడు హరి ఎదుట స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతియగును. కార్తికమాసమందు హరిసన్నిధిలో స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతి యగును. కార్తికమాసమందు హరిసన్నిధిలోకి స్తంభదీపము అర్పణచేసిన వానికి గలిగెడి పుణ్యమును జెప్పుటకు నాతరముగాదు. కార్తికమాసమందు పూర్ణిమరోజున స్తంభదీపమును జూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్లవలె నశించును. కార్తికమందు స్తంభమును సమర్పించినవాడు నరకమునుండు విడుదలగాడు. స్తంభదీపమును శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను.శిలతోగాని, కర్రతో గాని స్తంభమును జేయించి దేవాలయము ఎదుట పాతిదానిపైన దీపమును బెట్టువాడు హరికి ప్రియుడగును. ఈస్తంభవిషయమై పూర్వకథ గలదు. చెప్పెదను వినుము. మతంగమహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి గలదు. అందొక విష్ణ్వాలయము గలదు. ఆయాలయముచుట్టును వనముండెను. కార్తీకవ్రత పరాయణులై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువును షోడశోపచారములతోను మాసమంతయును బూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి. వ్రతములు చేసిరి. అందులో ఒక ముని యిట్లు పలికెను. మునీశ్వరులారా వినుడు. కార్తికమాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసియగును. కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును బెట్టుదము. ఈదినము కార్తికపూర్ణిమ అయి ఉన్నది. ఈదినము సాయంకాలము స్తంభదీప దానము హరికత్యంత ప్రియము. స్తంభమును జేయించి కార్తికమాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దానియందు దీపమును బెట్టువారి పాపములు నశించి వైకుంఠలోకమును పొందెదరు. వారందరు ఆమాటవిని స్తంభదీపమును సమర్పించుట యందు ప్రయత్నము జేసిరి. ఓరాజా! ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును జూచిరి. కార్తికవ్రత సముత్సాహులైన వారందరు కలసి ఆస్థాణువునందు శాలివ్రీహితిలసమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పికొనుచుండిరి. ఆసమయమున దేవాలయము ఎదుట చట చట అనే శత్బములు గలిగి స్తంభదీపము నశించి అందరు చూచుచుండగనే ఆస్థాణువంతయు పగిలి భూమియందు పడెను. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలెను. అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయమునుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమొంది అయ్యో అయ్యో యని ధ్వనిచేయుచుయొక పురుషునిచూసి ఇట్లనిరి. ఓయీ! నీవెవ్వడవు? ఏ దోషముచేత మొద్దుగా నున్నావు? ఆవిషయమునంతయు త్వరగా చెప్పుము. ఓ బ్రాహ్మణోత్తములారా! నేను పూర్వమందు బ్రాహ్మణుడను. రాజ్యమును పాలించువాడను, ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు గలిగియు దయాశూన్యుడనై దుష్ట వర్తనగల వాడనైతిని. నేను వేదశాస్త్రములను జదువలేదు. హరిచరిత్రను వినలేదు. తీర్థయాత్రకు పోలేదు. స్వల్పమైన దానము చేయలేదు. దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమునందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయ కాములు అగు బ్రాహ్మణులను నాముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండువాడును, వారికెన్నడును ఎదుర్కొని నమస్కారములు చేయలేదు. వారి ఇష్టార్థములను ఇవ్వనూలేదు. సర్వకాలమందు వారెకెన్నడును ఏదానమును యివ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక తప్పనియెడల ధనములేకుండ ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి యుండలేదు. శాస్త్రశ్రవణ సత్స్వభావసంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించు వారు. అప్పుడు సరే యిచ్చెదనని చెప్పుటయే గాని యిచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును బుచ్చుకొని స్వకార్యములను జేసికొనువాడను. మరల వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండెడివాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆదుష్కృత కర్మచేత చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించితిని. తరువాత భూమికి వచ్చి ఏబది రెండువేల మారులు కుక్కగా జన్మించితిని. అనంతరము పదివేల మారులు కాకిగా బుట్టితిని. ఆవల పదివేల మారులు తొండగా జన్మించితిని. పిమ్మట పదివేల మారులు పురుగుగా నుండి మలాశినైయుంటిని. ఆతరువాత కోటి మారులు వృక్షముగా నుంటిని. చివరకు కోటి మారులు స్థాణువుగా కాలము గడుపుచుంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు గాన సర్వభూతదయావంతులగు మీరు చెప్పుదురు గాక. మీద
ర్శనము వలన నాకు జాతిస్మృతి గలిగినది. ఓ మునీశ్వరులారా నా పూర్వపాపమిట్టిదని పలికి వాడూరకుండెను. మునీశ్వరులిట్లు విని వారిలో వారు యిట్లు చెప్పుకొనసాగిరి. కార్తికమాసఫలము యథార్థమయినది. ప్రత్యక్ష మోక్షమిచ్చునది. రాతికి కొయ్యకు గూడ మోక్షమిచ్చినది. అందును ఈపూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయును.ఆ పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తిక పూర్ణిమనాడు పరులచే ఉంచబడిన దీపమువలన ఎండిన మొద్దు ముక్తినొందెను. మొద్దయినను కార్తికమాసమందు దేవసన్నిధిలో దీపమును పెట్టినయెడల పాపమునశించి దయాళువయిన దామోదరుని చేత మోక్షమొందించబడినది. ఇట్లు వాదమును జేయి వారితో ఉద్భూతపురుషుడు తిరిగి యిట్లనియె. జ్ఞానవేత్తలయిన మునీశ్వరులారా! దేనిచేత మోక్షము కలుగును? దేనిచేత బద్ధుడగును? దేనిచేత ముక్తుడగును? దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు గలుగును? మోక్షప్రాపకమైన జ్ఞానమెట్లుగలుగును? ఈ సర్వమును నాకు జెప్పుడు. వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీరసమునిని వానికి సమాధానము జెప్పుమని నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షోడశాధ్యాయస్సమాప్తః
SIVA PURANAM – 16

వైద్యనాథ లింగము

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదావసంతం గిరిజా సమేతం!
సురాసురాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి!!
‘ఓ వైద్యనాథుడా, నీకు మేము నమస్కరించుచున్నాము’ అంటారు. మనవాళ్ళు ఏది చేసినా దాని చిట్టచివరి ప్రయోజనం పరబ్రహ్మమును చేరటమే. అభిషేకంలో శివునికి ఒక నామం ఉంది. ‘ప్రథమో దైవ్యో భిషక్’. ఈశ్వరుడు ఈ లోకమునకు మొట్టమొదటి వైద్యుడు. వైద్యుడు సాధారణంగా నాది నాది అని చెప్పిన ఈ శరీరంలో మీకే తెలియకుండా ప్రవేశించిన రుగ్మతను తొలగిస్తాడు. మనకి భవరోగము అని ఒక రోగం ఉంటుంది. అంటే ఎప్పుడూ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడం. ఈ భవ రోగమునకు ప్రధాన కారణం అహంకారం. ఇటువంటి భవరోగములో పది కొట్టుకునే వాడిని పైకెత్తి తన పాదముల దగ్గరకి చేర్చుకుంటాడు. కాబట్టి కూడా ఆయన వైద్యనాథుడు. వైద్యులకు నాథుడయినవాడు లేదా వైద్యులయందు పెద్ద వైద్యుడు – రెండు కారణముల చేత ఆయనను వైద్యనాథ లింగము అని పిలుస్తారు.
ఒకానొక సమయంలో లంకా పట్టణమును రావణాసురుడు పరిపాలిస్తూ ఉండేవాడు. లంకా పట్టణం ఎప్పుడూ దక్షిణ దిక్కునే ఉంటుంది. ఊరికి దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది. జీవన యాత్రలో చిట్టచివరి ప్రయాణం అక్కడకు వెళ్ళడంతో పూర్తయిపోతుంది. రావణాసురుడు అజ్ఞాని కాదు. వేదమును చదువుకున్న వాడు, త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు, లింగార్చన చేసేవాడు, ఘన జట చెప్పేవాడు. కానీ ఈ చదువు ఒక స్థాయి యందు నిజమయిన చదువు కాదు. అంత గొప్పవాడయిన రావణుడు ఒకసారి కైలాసమునకు వెళ్ళాడు. శరీరము నేను అనే అహంకారంతో ఉన్నవాడికి కైలాసాచలాధీశుని దర్శనం దొరకడం కష్టం. కానీ రావణుడు ఈశ్వరుని పట్టుకోవడానికి చాలా బింకంతో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. అనగా రజోగుణ ప్రకృతితో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. ఇటువంటి పట్టుదలతో కూడిన తపస్సు చాలా అనర్థహేతువుగా, మనిషిని పాడు చేసేదిగా ఉంటుంది. ఈ తపస్సు సాత్త్వికంగా ఉండదు. అది ఈశ్వరుడిని కదపలేక పోయింది. పరమేశ్వరుడు రాలేదు. రావణుడు చేసే తపస్సులో దోషం ఉంది. ఈశ్వరుడి మీద అలక వహించాడు రావణుడు. అందుకని తొమ్మిది తలలు కోసేసుకున్నాడు. వాటిని అగ్నిహోత్రమునందు వ్రేల్చాడు. రావణుడు చేసే తపస్సు యందు వినయము లేదు. రావణుడు తన పదవ తలను కూడా నరుక్కుందుకు సిద్ధపడ్డాడు. సరిగ్గా ఆసమయంలో శంకరుడు వచ్చాడు. ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడే సరికి రావణుని పది తలలు మరల మొలిచాయి. అపుడు శంకరుడు రావణునితో “రావణా, నీకు ఏమి కావాలి?” అని అడిగాడు. రావణుడు అపుడు తనకు విపరీతమయిన బలం కావాలి అన్నాడు. రెండవ కోరికగా శంకరుడిని వచ్చి లంకలో కూర్చోమన్నాడు. అపుడు శివుడు ‘నేను లింగమునందు ఉంటాను. నీవు దీనిని తెలివితో నీ పట్టణమునకు తీసుకువెళ్ళు’ అన్నాడు. రావణుడి ఒంటికి బలం ఉందికాని మనస్సుకి తెలివిలేదు. ఉత్తర క్షణం రావణుడి ఒంటికి బలం వచ్చింది. కానీ అతని ప్రవృత్తిలో మార్పు రాలేదు.
రావణుడు ఆ శివలింగమును పట్టుకుని లంకకు బయలుదేరాడు. పరమాత్మ వానికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. పిండాండ బ్రహ్మాండ అనుసంధానం అని ఒకటి ఉంది. ఈ శరీరమునకు ఆకలి వేస్తుంది. బ్రహ్మాండంలో లభించే ఏదో ఒక ఆహారపదార్ధం తీసుకు వెళ్లి ఈ పిండాండంలో పడెయ్యాలి. మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషమును బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండమునకు దాహం వేస్తే బ్రహ్మాండమే ఇవ్వాలి. దాహార్తిని తీర్చడమే కాకుండా ఇందులో ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉంది. ఇందులోని మలినములను పట్టుకుని ఆ నీళ్ళు బయటికి రావాలి. నీళ్ళను మరల బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి. ఇది ఈశ్వరుడు. దాహం వేయించిన వాడు ఈశ్వరుడు, నీటిని ఇచ్చిన వాడు ఈశ్వరుడు, ఈ నీటిని మరల మూత్రముగా మార్చిన వాడు ఈశ్వరుడు, బయటకు పంపిన వాడు ఈశ్వరుడు. అందువల్ల ఈశ్వరానుగ్రహం లుప్తం అయితే అవతలి వాడు పాడైపోవడానికి ఒక్క కారణం చాలు. మూత్ర విసర్జన చేయవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసేసింది. శివలింగాన్ని చేతితో పట్టుకుని మూత్ర విసర్జన చేయలేడు కదా! ఎవడో ఒకటు శివలింగమును పట్టుకుంటే బాగుండుని అని అనుకుని అటూ ఇటూ చూశాడు. ఆ శివలింగం శివుడన్న భావన రావణునికి లేదు. తేలికగా చూశాడు. అక్కడి సమీపంలో గల పశువులు కాసుకునే ఒక గొల్ల పిల్లవాడిని పిలిచి నేను మూత్ర విసర్జనకు వెళ్ళి వస్తాను ఈ శివలింగమును ఒకసారి పట్టుకుని ఉండవలసినది అని అడిగాడు. పిల్లాడి చేతిలో శివలింగమును పెట్టి మూత్ర విసర్జనకు వెళ్ళాడు. అది శివుడు. రావణాసురుడికి ఎలా బుద్ధి చెప్పాలా అని చూస్తోంది. ఆ శివలింగం చాలా బరువయిపోయింది. వాడు మోయలేక కింద పెట్టేశాడు. శివుడు రావణునితో ఇది నీ పురి చేర్చు. మధ్యలో దీనిని ఎక్కడయినా క్రింద పెట్టావో అక్కడ ఉండిపోతాను’ అని ముందరే చెప్పాడు. ఇప్పుడు ఆ గొల్ల పిల్లవాడు శివలింగమును చితాభూమి మీద పెట్టేశాడు. దీనిని చూసి రావణుడు పరుగుపరుగున వచ్చాడు. అతను వెంటనే ‘ఈశ్వరా, తీసుకు వెళ్ళమన్నావు, కానీ ఆ తెలివి నాయందు నిలబడక పోవడానికి కారణం కూడా నీవే. కాబట్టి ఇప్పుడ నా బుద్ధి మార్చవలసింది అని ప్రార్థన చేయలేదు. ఇదెంత దీనిని నేను ఎత్తుకు పోతాను అని కదపడానికి ప్రయత్నించాడు. అది కదలలేదు. ఆ శివలింగమును అక్కడే
వదిలేసి లంకకు వెళ్ళిపోయాడు. వానికి ఒంట్లో బలం బాగా ఉంది.
దేవతలందరూ వచ్చి రావణుడు అక్కడ వదిలి వెళ్ళిన ఆ శివలింగమునకు పూజలు చేయడం ప్రారంభించారు. రావణుడి బలం వలన చాలా ప్రమాదం రాగలదని దేవతలు భావించి దేవతలు నారదుని వద్దకు వెళ్లి రావణుడు సంపాదించిన బలం వానినే పాడుచేసేటట్లుగా చేయవలసినది అని కోరారు. నారదుడు వెళ్ళి ‘రావణా, నీవు కైలాసమునకు వెళ్ళి గొప్ప తపస్సు చేసి శంకరుడిని ప్రత్యక్షం చేసుకున్నావని ఎవరో చెప్పగా తెలిసింది. ఏమి చేశావో చెప్పవలసినది’ అని అడిగాడు. రావణుడు జరిగిన విషయం చెప్పాడు. అపుడు నారదుడు నీకు శివలింగమును ఇచ్చినట్లే ఇచ్చి దానిని నీకు కాకుండా చేసినవాడు కూడా శివుడే అయి ఉండవచ్చు కదా. దీనిని నిర్ధారించుకుందుకు నీవు ఒకసారి కైలాసమునకు వెళ్ళి నీ బలంతో కైలాసాన్ని కదిపి చూడు అప్పుడు నీకు యథార్థం తెలుస్తుంది. శంకరుడే కదిలిపోతే నీకు బలం బాగా ఉన్నట్లు. అప్పుడు ఇతరులమీదికి వెళ్ళు’ అన్నాడు. వెంటనే రావణుడికి అనుమానం వచ్చింది. ఇదేదో బాగుంది అని వెంటనే పుష్పకవిమానం ఎక్కి కైలాసపర్వతం దగ్గరకు వెళ్ళి కైలాస పర్వతమును కదపడం మొదలుపెట్టాడు. అలా కదిపేసరికి పార్వతీ పరమేశ్వరుల సింహాసనం కదులుతోంది. శంకరునికి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు. ఆయన మౌనంగా ఉంటాడేమోనని ఆ తల్లి కొంచెం చమత్కారంగా ‘మాట్లాడింది. అమ్మవారు శక్తి స్వరూపిణి. లోకమునకు అనారోగ్యం వస్తే బతికిస్తుంది. ఇప్పుడు లోకమును బతికించాలి. లోక కంటకుడిని చంపాలి. వాడు చావడానికి కారణం శివ ముఖతః రావాలి. అలా వచ్చేటట్లు ఆవిడ శివుణ్ణి మాట్లాడింది. ఆవిడ శివుణ్ణి రుద్రుడిని చేస్తుంది. రుద్రుడిని శివుడు చేస్తుంది. ఇప్పుడు లోకక్షేమం కోసం శివున్ని రుద్రుని చేస్తోంది.
అబ్బా మీరు ఎంత గొప్ప శిష్యుడిని సంపాదించుకున్నా రండీ! మీరు వరాలు ఇచ్చిన రావణుడే వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడు. ఎవరికైతే మీరు వరాలు ఇచ్చారో వాడికి ఇప్పుడు మీమీదకోపం వచ్చింది. వాడి బలానికి ఇప్పుడు మీరు నేనూ ఊగిపోతున్నాము. పాపం మీరుమాత్రం ఏం చేస్తారు లెండి?” అంది. ఆమె మాటలు వినేసరికి శివుడు రుద్రుడయ్యాడు. ఎవరు రావణుడికి బలం ఇచ్చారో ఆయనే శాపమును ఇచ్చాడు. ‘రావణా, ఇక కొద్దికాలంలో నీ మదం అణగిపోతుంది, ఇక్కడనుండి పో’ అన్నాడు. కైలాస పర్వతమును ఊపుతున్న రావణునికి ఈమాట వినపడింది. ఈశ్వరుని మాట నిజం అయింది. రావణుని పట్టుకున్న వాళ్ళందరూ నశించిపోయారు. రాముని ఆశ్రయించిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఈ శివ వాక్యమును ఆధారం చేసుకునే తరువాత రావణునికి శాపములన్నీ వచ్చేశాయి. చివరకు రావణుని బలం తన వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది. రాముడు ఒక్కొక్క తల చొప్పున పది తలలు పడగొట్టేస్తుంటే ఆఖరున మండోదరి వచ్చి శివుడు ఏది చెప్పాడో అదే చెప్పింది. నీ ఒంటి పొగరు నిన్ను చంపింది. రాముడు నిన్ను చంపలేదు. ఏ మదం నీలో ప్రవేశించిందో అది నిన్ను చంపేసింది అని ఆవిడ చెప్పింది.
ఇది ఆనాడు చితాభూమియందు వెలసిన వైద్యనాథుడన్న జ్యోతిర్లింగం ఏది ఉన్నదో ఆ జ్యోతిర్లింగం. ఆనాటి నుండి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ ఒక అనుగ్రహమును ఇస్తోంది. ఇదే వైద్యనాథుడంటే! భవము – అంటే సంసారమునండు కొట్టుమిట్టాడుతూ, కామక్రోధముల యందు తెరిపి లేకుండా తిరుగుతూ అహంకార మమకారములలో పడి సొక్కిపోకుండా సాత్త్వికోపాసనతో కూడిన ఈశ్వర భక్తిని క్రుపచేసి భవసాగరమునుండి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఇలా ఉద్ధరిస్తే ఒకడికి ఈశ్వరుడిని చేరడానికి కోటి జన్మలు పట్టవచ్చు. ఒక్క జన్మలో, ఒక్క గంటలో ఈశ్వరుని చేరిపోయిన మహాభక్తులు ఉన్నారు. కాబట్టి ఆ వైద్యనాథుని అలా దర్శించిన వారికి అటువంటి మహానుభావుడికి నమస్కరించిన వాడికి ఆయన అనుగ్రహం కలిగితే అతి తక్కువ కాలంలో ఉపాసన దిద్దబడుతుంది. అతి తక్కువ కాలంలో సత్త్వగుణం ఆవిర్భవిస్తుంది. ఆయన అనుగ్రహం లేకుండా ఆయనను రాజస తామసిక పూజలతో లొంగదీసుకోవాలన్న భావన మంచిది కాదు.
Kartika Puranam - 17

కార్తిక పురాణము - పదిహేడవ అధ్యాయము
అంగీరసుడిట్లనెను. ఓయీ! కర్మబంధముక్తులు, కార్య కారణములు. స్థూల, సూక్షమములు, ఈజంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన యీవిషయము పూర్వమందు కైలాసపర్తమున పార్వతికి శంకరుడుజెప్పెను. దానిని ఇప్పుడు నీకు నేను జెప్పెదను. ఇతర చింతనుమాని వినుము. నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెడను వినుము. జీవుడనగా వేరెవ్వడును లేడు. నీవే జీవుడవు. నేను యెవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను. ఇందుకు సందేహము లేదు. దేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. ఉద్భూతపురుషుడిట్లడిగెను. మునీశ్వరా! మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు గలుగలేదు. కనుక అహంబ్రహ్మేతి(నేను బ్రహ్మనను) వాక్యార్థమును ఎట్లు తెలిసికొనగలను. ఈవాక్యార్థ బోధకు హేతువయిన పదార్థజ్ఞానము నాకు తెలియలేదు. కాబట్టి విమర్శగా చెప్పగోరెదను.ఆత్మ అంతఃకరణమునకు, తద్వ్యాపారములకు సాక్షియు, చైతన్య రూపియు, ఆనందరూపియు, సత్య స్వరూపమునై ఉన్నది. ఇట్టి ఆత్నము నీవెందుకు తెలుసుకొనుట లేదు. సచ్చిదానంద స్వరూపుడును, బుద్ధికి సాక్షియునయిన వస్తువునే ఆత్మగా తెలిసికొనుము. ఈదేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. దేహము ఘటమువలే రూపము గల్గిన పిండము గనుక ఇది ఆత్మగాదు. ఇదిగాక ఈదేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలనబుట్టినది. గనుక దేహము వికారము కలది ఆత్మగాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలిసికొనుము. అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు, ఆత్మవస్తువులు కావు. దేహేంద్రియాదులన్నియు ఎవరి సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని=ఆత్మయని తెలిసికొనుమని భావము. లోపలికి మలచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుముకు అయస్కాంతమణి వలె తాను వికారిగాక బుద్ధ్యాదులను చలింపజేయునది ఏది కలదో అది నేను=ఆబ్రహ్మనని తెలిసికొనుము.
ఎవనియొక్క సాన్నిధ్యమాత్రముచేత జడముైన-కదలికలేని దేహేంద్రియమనః ప్రాణములు జన్మలేని ఆత్మవలె కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆబ్రహ్మను నేను అని తెలిసికొనుము. ఎవ్వడు వికారిగాక సాక్షియై స్వప్నమును, జాగరమును, సుషుప్తిని, వాటియొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలిసికొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలిసికొనుము. ఘటమును ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటముకంటే భిన్నమో అట్లుగానే దేహాదులను బ్రకాశింపజేయు బోధరూపుడైన నేను జాత్మ అని తెలిసికొనుము. ఎవ్వడు సర్వప్రియుడై నీయొక్క పుత్రమిత్ర ప్రియప్రియాది భావములను ద్రష్టగా జూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలిసికొనుము. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని యెరుగుము. సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికారియగుట ఆత్మకే గలవు. దేహేంద్రియ మనః ప్రాణాహంకారములకంటే వేరయిన వాడును ౧. పుట్టుటా=జనిమత్వ, ౨. ఉండుట=అస్తిత్వం, ౩. వృద్ధిగతత్వ=పెరుగుట, ౪. పరిణామత్వ=పరిణామము చెందుట, ౫. కృశించుట, ౬. నశించుట ఈ యారు వికారములు లేనివాడు. వికారములు ఈఆరు భావాలు లేనిది బ్రహ్మ. త్వం పదార్థముు ఇట్లునిశ్చయించుకొని వ్యాపించు స్వభావము చేత సాక్షాద్విధిముఖముగాను తచ్ఛబ్దార్థమునుజ్ దెలిసికొనవలయును.
శ్లో. అతద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విధిముఖేనచ!
వేదాంతానాం ప్రవృత్తిస్స్యాత్ ద్విరాచార్య సుభాషితమ్!!
తచ్ఛబ్దమునకు బ్రహ్మ అర్థము. ఆతచ్ఛబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్ధము. వ్యావృత్తియనగా ఇదిగాది ఇదిగాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదిది బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలిది బ్రహ్మయని భావము. సాక్షాద్విధిముఖమనా సత్యం జ్ఞానమనంతంబ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్యజ్ఞానానంద స్వరూపుడని తెలిసికొనవలును అని భావము. ఆత్మ సంసారలక్షణ విశిష్టముగాదనియు, సత్య స్వరూపనియు, దృష్టిగోచరముగాదనియు, తమస్సుకు పైదనియు అనుపమానందరూపమనియు, సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు, పరిపూర్ణమనియు చెప్పబడును. ఆతద్వ్యావృత్తి రూపముగాను, సాక్షాద్విధిముఖముగాను తెలిసికొనదగిన ఆత్మస్వరూపము ఇదియేనై అర్ధము. వేదములచేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు, సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో వాకే నేనని తెలిసికొనును. మృత్తికాది దృష్టాంతముల చేత ఏక వస్తుజ్ఞానము చేత సర్వవిజ్ఞానము దేనిచే కలుగునని శ్రుతులందు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలిసికొనుము. నేననునదియు బ్రహ్మయనునదియు ఒకే అర్థము కలిగినవి.
వేదములందు ఎవ్వనికి "తదనుప్రవిశ్య" ఇత్యాది వాక్యములచేత జీవాత్మరూపముచేత ప్రాణులందు ప్రవేశమున్ను, ఆజీవులను గురించి నియంతృత్వమున్ను జెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. వేదములందు ఎవ్వనికి కర్మఫలప్రదత్వము, జీవకారణకర్తృత్వము జెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. ఈప్రకారముగా "తత్, త్వం" అను పదములు రెండును నిశ్చయించబడివి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు, అనగా నీవె బ్రహ్మవని భావము చెప్పబడినది. ముందు వాక్యార్థమును జెప్పెదను. వాక్యార్థమనగా తత్త్వం పదములకు ఐక్యము=ఏకత్వము చెప్పబడును. ప్రత్యగాత్మయే అద్వయానందరూప పరమాత్మ. పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈప్రకారముగా అన్యోన్యతాదాత్మ్యము ఎ
ప్పుడు అనుభవమున గలుగునో అప్పుడే త్వం పదమునకు అర్ధము తెలియును. బ్రహ్మగాదను భ్రాంతి నశించును. తాదాత్మ్యమనగా అదియే ఇదియని అర్థము అనగా ఐక్యము. తత్త్వమసి అనా తత్, త్వమ్, అసి, ఈవాక్యార్థమునకు తాదాత్మ్యము చెప్పవలెను. అప్పుడు వాచ్యార్థములయిన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ విశిష్టులయి జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములై జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించినయెడల తాదాత్మ్యము సిద్ధించును. ముఖ్యార్థముకు బాధగలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను. ఈలక్షణావృత్తి మూడు విధములు. అందులో యిచ్చటభాగలక్షణను గ్రహించవలెను. అనగా కొంత పదము విడిచి కొంతపదము స్వీకరించుట భాగలక్షణయనబడును. తత్త్వమసియందు సర్వజ్ఞత్వకించిజ్ఞత్వములను వదలి కేవల జ్ఞానాత్మత్వ మాత్రమునే గ్రహించినయెడల అభేదము సంభవించును. తత్=అది, త్వం-నీవు, అసి=అయితివి. అనగా నీవే బ్రహ్మవైతివని భావము. సో యందే వదత్త ఇత్యాది స్థలమందును యిట్లే బోధచేయబడును. తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివైచిన దేవదత్తుడొక్కడే భాసింును. అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదలి కేవల జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాసించును. నేను బ్రహ్మనను వాక్యార్థ బోధ స్థిరపడువరకు శమదమాది సాధనములు చేయుచు శ్రవణమనననిదిధ్యాసలను ఆచరించవలెను. ఎప్పుడు శ్రుతిచేతను, గురుకటాక్షముచేతను తాదాత్మ్యబోధ స్థిరపడునో అప్పుడు సంసారమూలము నశించును. కొంతకాలము మాత్రము ప్రారబ్ధకర్మ అనుభవింపుచుండి ప్రారబ్ధక్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదమొంది నిరతిశయానందముతో ఉండును. కాబట్టి ముందు చిత్త శుద్ధికై కర్మను జేయవలెను. ఆకర్మవిధినంతయు గురువువలన దెలిసికొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగతపాపుడై తరువాత ఆపుణ్యముచేత మంచిజన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞానియై కర్మబంధమును తెంచుకొని మోక్షమొందుదువు. ఇందుకు సందేము లేదు.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే సప్తదశాధ్యాయస్సమాప్తః
SIVA PURANAM – 17

రామేశ్వర లింగము

రామేశ్వర లింగము చాలా గొప్ప లింగము. మహాబలసంపన్నుడయిన రావణాసురుని సంహారం అంత తేలికయినది కాదు. దీనికి పరమ మంగళప్రదుడయిన శంకరుని అనుగ్రహం కావాలి. ‘ఈశ్వరా’ లంకా పట్టణమునందు ప్రవేశించి రావణుడే పది తలలతో నాకంటపడినా ధర్మము తప్పనంత సంయమనంతో కూడిన బుద్ధి నాయందు ప్రచోదనమయి యుద్ధం జరుగుగాక’ అని శ్రీరాముడు శంకరుని ప్రార్థించాడు. రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు. శ్రీరాముడు శంభు లింగమును ఆరాధన చేశాడు. ఒక శివలింగమును పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట. అనగా రామచంద్ర మూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లుగా ప్రవర్తించాడు. తనకు ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు.

స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సలా
పాహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం!!

ఈశ్వరా, నేను నీ భక్తుడిని, దీనుడిని. ఎప్పుడయినా నానుండి కోపం బయటకు రావచ్చు. బాహ్యమునందు గొప్ప బలపరాక్రమములు గల రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. మీరు శివుడు, మంగళప్రదులు. నన్ను ఆశీర్వదించాలి. జయమును ఇవ్వాలి. కాబట్టి శంకరా నన్ను అనుగ్రహించండి అన్నాడు. అనేసరికి శంకరుడు ప్రత్యక్షం అయి శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు. శ్రీరాముడు నీవు ఇక్కడనే వసించు. ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగము అనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది. అన్నాడు. శివుడే ఇప్పుడు శ్రీరాముడిగా వెళుతున్నాడు. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ – లంకకు వెడుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ‘నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు. ఇప్పుడాయన రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. రావణుని సంహరించి తిరిగి పుష్పకవిమానంలో రామచంద్ర మూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెడుతూ కిందికి చూపించారు. ‘సీతా, ఇదిగో సేతువు. అదిగో అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడు’ అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలోని శ్లోకములలో ఈపాదం ఉంది. ఆయన శివపూజ చేశాడు అనడంలో ఏమీ సందేహం లేదు.
ఇక్కడ మనకి ఒక సందేహం కలగవచ్చు. సముద్రం దాటేముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము. కానీ ఈవేళ రామేశ్వరం దీవియందున్న శివలింగమును రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాం. రెండూ ఒకటేనా? అలా అయితే స్థలపురాణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్ర మూర్తి ప్రతిష్ఠ చేయడం కోసం హనుమను కాశీ పట్టణం పంపించి విశ్వనాథ లింగము నొకదానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగముతయారుచేసిందని, దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో చెప్తుంటారు. పైగా అక్కడ సరస్వతీ బావి, సావిత్రీ బావి, గాయత్రీ బావి మున్నగు బావులు ఉన్నాయి. ఈ రెండు శివలింగములు ఒకటేనా? ఈవిషయమును మహానుభావుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు ‘రామాయణమునందు ధర్మ సూక్ష్మములు’ అనే గ్రంథంలో పరిష్కారం చేశారు. ఆయన ఒకమాట చెప్పారు. కూర్మపురాణంలోంచి ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ
‘యావస్సేతుశ్చతావశ్చ కాస్యాంయత్రతిరోహితః’ ‘నేను తిరోహితుడనై ఉంటాను. అందరికీ నేను కనపడను, కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు. కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించాడు అని మీరు ఒక నమస్కారం చేసి ద్వీపంలోకి వెడితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగుచేయబడిన మట్టితో ఏర్పడిన శివలింగ దర్శనం అవుతుంది. వ్యాసుడు స్కాందపురాణంలో నాగర ఖండమునందు ఈ శివలింగం ప్రతిష్ఠితం చేయబడడం యథార్థమే అని చెప్పి ఉన్నాడు. కాబట్టి అది రామేశ్వర లింగమే. హనుమ కూడా శివుని అవతారమే అని శివపురాణం చెప్తుంది. హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు. హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి. తన సంకల్ప ముహుర్తమై హనుమ ప్రతిష్ఠించాలీ. అందుకని ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను ప్రోగుచేస్తే అది శివలింగం అయింది. ఇపుడు దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశాడు. దానిని రామనాథ లింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకు వచ్చిన లింగము. అది కాశీనుండి తేబడింది కాబాట్టి దానిని విశ్వనాథ లింగము అని పిలుస్తారు. ఆ బావులలో ఉండే నీటియందు ఓషధీశక్తులు ఉంటాయి. ఆ బావుల నీటితో స్నానం చేయాలి.
రామేశ్వరంలో మనం సముద్రస్నానం చేస్తాము. రామేశ్వర దర్శనం అద్భుతమయిన దర్శనం. అక్కడ రైల్వేస్టేషన్లో ఒక గొప్పతనం ఉంది. కొత్త ప్లాట్ ఫారం కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు మరోచోట పెట్టకుండా రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావిచెట్టు క్రింద పెట్టారు. మీరు రైల్వేస
్టేషనులోనే దక్షినామూర్తిని దర్శనం చేసుకోవచ్చు.
అక్కడే శంకరాచార్యుల వారు తీసుకు వచ్చిన శివలింగములలో ఒక శివలింగం ఉంది. అది స్ఫటికలింగం. దానిని సూర్యోదయం కాకుండా దర్శనం చెయ్యాలి. ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్ఫటికలింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉంది. కానీ అక్కడ విన్యాసములేవీ కనపడవు. దాని వెనకాల ఒక లైటు వెలుగుతూ ఉంటుంది. కానీ రామేశ్వరంలోని స్ఫటికలింగం అలా కాదు. తెల్లవారుజామున ఆ శివలింగమునకు అర్చకులు పూజచేస్తారు. అలా మంత్రములు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్రని పువ్వు తెచ్చి ఆ స్ఫటిక లింగం ముందర పెడితే మొత్తం ఆ శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ పువ్వును తీసేస్తే మరల మీకు తెల్లటి లింగం కనపడుతుంది. అదీ స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం. అనగా నిర్గుణమయిన పరబ్రహ్మము శుద్ధసత్వంతో ఉంటాడు. ఆయనయందు లోకము ప్రకాశిస్తూ ఉంటుంది.
ఎవరయినా ఈ రామేశ్వర లింగం దగ్గరకు వెళ్లి కాశీ పట్టణంలో ఉన్న గంగను తీసుకు వెళ్ళి ఆ రామేశ్వర లింగమును గంగధారలతో అభిషేకిస్తే అలా అభిషేకం చేసినవాడు కైలాసమును చేరుకుంటున్నాడు. గంగ అనగా జ్ఞానము. కాశీ గంగతో అభిషేకం చేయడం వలన ఉన్నది ఒక్కటే పదార్ధం అన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనం. అది చేసిన వాడు సంసార సముద్రమును దాటి ఈశ్వరుని పొందుతున్నాడు. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమయిన క్షేత్రము రామేశ్వర క్షేత్రము.
ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్లకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది. కానీ రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపమును ఖాతాలో వేస్తారు. కాబట్టి రామేశ్వరం వెడదాం అనుకున్నాను అని అనకూడదు. ‘ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకు వెళ్లాలని ప్రార్థిస్తున్నాను’ అని అనాలి. ఆ బాధ్యతను ఆయన మీద పెట్టెయ్యాలి. అపుడు ఆయనే మిమ్మల్ని రామేశ్వరం తీసుకువెడతాడు.
Kartika Puranam - 18

కార్తిక పురాణము - పద్దెనిమిదవ అధ్యాయము
ఉద్భూతపురుషుడిట్లనెను. మునీశ్వరా! నేననుగ్రహించబడితిని. నీదర్శనముయొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని. ఓమునివర్యా! నాకు నీవే తండ్రివి. నీవే సోదరుడవు. నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాగ గతి ఎవ్వరయిరి. పాపవంతుడైన నేనెక్కడ. ఇట్టి సద్గతి యెక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ. పుణ్యమైన కార్తీకమాసమెక్కడ? ఈమునీశ్వరులెక్కడ, ఈ విష్ణుసన్నిధి ఎక్కడ. ప్రారబ్ధ సుకృతమున్నయెడల తప్పక ఇట్లు ఫలించునుగదా? నాకెద్దియో పూర్వపుణ్యమున్నది. దానిచే ఇట్లింతయు లభించెను. అయ్యా! నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము. మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు? ఆకర్మలకు ఫలమెట్లు గలుగును? వాటి ఉపదేశమెట్లు, చేయుటకు ముఖ్యకాలమెద్ది? కర్మలెవ్వి? ఏమి కోరి చేయవలెను? ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము. నీవాక్కును వజ్రాయుధముచేత నాపాప పర్వతములు కూలినవి. అంగీరసుడు పల్కెను. ఓయీ! నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెదవినుము. అనిత్యమైన ఈదేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖదుఃఖాది ద్వందములు లేవు. అవి దేహాది ధర్మములైనవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మనుజేయవలెను. దానితో చిత్తశుద్ధిగలిగి తద్ద్వారా జ్ఞానమునుబొంది దానిచేత ఆత్మను యథార్ధముగా తెలిసికొనవలెను. దేహధారియయినవాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలనుభక్తితో విధిగా చేయవలెను. అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయును. వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏకర్మ చెప్పబడినదో విచారించి తెలిసికొని తరువాత చేయవలెను. స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండువలె నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతఃస్నానము వేదోక్తమైయున్నది. నిరంతరము ప్రాతఃస్నానమాచరించలేనివాడు తులా సంక్రాంతి యందుకార్తీకమాసమందును, మకరమాసమందును, (మేష) వైశాఖమందును స్నానము చేయవలెను. ఈమూడు మాసములందును ప్రాతఃకాలమందు స్నానము చేయు వాడు వైకుంఠమునకు బోవును మరియు వానికి ఉత్తమగతి గలుగును. చాతుర్మాస్యాది ;పుణ్యకాలములందును, చంద్రసూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహణకాలమందే స్నానము ముఖ్యము. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది. ౧. స్నానము ౨. సంధ్యాజపము ౩. హోమము ౪. సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానమాచరించనివాడు రౌరవనరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తికమాసము ఈకార్తికము ధర్మార్థకామ మోక్షములనిచ్చును. ఈకార్తికముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన శాస్త్రములేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు. భార్యతో సమానమైన సుఖము లేదు. ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు. నేత్రముతో సమానమైన జ్యోతిస్సులేదు. కేశవునితో సమానమైన దేవుడు లేడు. కార్తికమాసముతో సమానమయిన మాసము లేదు. కర్మ స్వరూపమును దెలిసికొని కార్తికమాసమందు ధర్మములను జేయువాడు కోటి యజ్ఞలమును బొంది వైకుంఠమందుండును.
ఉద్భూతపురుషుడడిగెను. అయ్యా! చాతుర్మాస్య వ్రతని పూర్వము చెప్పియున్నారు. అది పూర్వము ఎవనిచేత చేయబడినది? ఆవ్రతవిధి ఎట్లు? ఆవ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందెడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏలోకమునకు పోవును? ఈ విషయమంతయి సవిస్తారముగా చెప్పుము. అంగీరసుడిట్లు పల్కెను. ఓయీ! నీవు ఈమనుష్యులకు బంధువవు నీ ప్రశ్నలన్నియు లోకోపకారార్థములుగా ఉన్నవి. సమాధానమును జెప్పెదను. సావధానుడవై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో గూడా ఆషాఢ శుక్ల దశమిదినంబున పాలసముద్రమందు నిద్రయను వంకతో శయనించును. తిరిగి కార్తికశుక్ల ద్వాదశిరోజున లేచును. ఇది చాతుర్మాస్యము. అనగా నాలుగు మాసములు చేయువ్రతము. ఈనాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చునవి. అనగా హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును. విష్ణువునకు నిద్ర సుఖమిచ్చునది గనుక యిది పుణ్యకాలము.ఈపుణ్యకాలమందు హరి ధ్యానించువాడు విష్ణులోకమును బొందును. ఈనాలుగు మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములగును. దీనికి కారణమును జెప్పెదను వినుము. ఈవిషయమందు నారదునకు హరిచెప్పినదొక కథయున్నది. పూర్వము కృతయుగమందు వైకుంఠోకంబున హరి లక్ష్మితో గూడ సింహాసనమందు కూర్చుండి సుర కిన్నర ఖేచరోరగగణములచేతను, స్వగణభృత్యుల చేతను సేవింపబడుచుండెను. హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును గూర్చివచ్చెను. నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు గలిగి పద్మపురేకుల వంటి నేత్రములఓ ప్రకాశించెడి విష్ణుమూర్తిని జూచెను. చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదులకు మ్రొక్కెను. హరియు నారదుని జూచి నవ్వుచు తెలియని వానివలె ఇట్లనెను.
ఓ నారదా! నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా? ఋషుల ధర్మములు బాగుగానున్నవా? ఉపద్రవములు లేకున్నవా? మనుష్యులు వారి వారి ధ
ర్ములందున్నారా? ఈవిషయమంతయు ఈసభలో జెప్పుము. నారదుడు ఆమాటను విని ఆనందించి నవ్వుచు హరితోనిట్లనియె. ఓ స్వామీ! నేను భూమినంతయు తిరిగిచూచితిని. వేదత్రయమందు జెప్పబడిన కర్మమార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి. తమ తమ కర్మలను యావత్తు విడిచి యుండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు దెలియకున్నది. కొందరు తినగూడని వస్తువులను తినుచున్నారు. కొందరు వ్రతములను విడిచినారు. కొందరు ఆచారవంతులుగానున్నారు. కొందరు అహంకార వర్జితులుగా నున్నారు. కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు. కొందరు నిందజేయువారుగా నున్నారు. కాబట్టి ఓ దేవా! ఏదయినా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము. నారదుని మాట విని భక్తవత్సలుడు, సమస్త లోక పాలకుడును అయిన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధబ్రాహ్మణ రూపధారియై వేల సంఖ్యగల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా నాటకధారియై పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వతములందును, అరణ్యములందును, ఆశ్రమములందును, సమస్త భూమియందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని జూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను జేసిరి. కొందరు నవ్విరి. కొందరు నమస్కారము చేయరైరి. కొందరు అభిమానవంతులైరి. కొందరు గర్వముతో ఉండిరి. కొందరు కామాంధులై యుండిరి. కొందరాయా క్రియాకలాపములను మానిరి. కొందరు ఏకవ్రతపరాయణులైయుండిరి. కొందరు నిషిద్ధ దినములందు అన్నమును దినువారుగా నుండిరి. కొందరు ఏకాదశ్యు[అవాసమాచరించని వారుగా నుండిరి. కొందరు తినగూడని వస్తువులను దినుచుండిరి. కొందరాచారవంతులుగానుండిరి. కొందరాత్మచింతజేయుచుండిరి.
బ్రాహ్మణ రూపధారియైన భగవంతుడు అట్టివారిని జూచి మంచి మార్గమునకు దెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిశారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను. వచ్చి బ్రాహ్మణరూపమును వదలి పూర్వమువలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోను, స్వభక్తులతోను గూడి ప్రకాశించుచుండెను. అచ్చటనుండు జ్ఞానసిద్ధులు మొదలయిన మునులు వైకుంఠమునుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టివాడును అవిసెపువ్వుతో సమానమైన కాంతి గలవాడును, మెరుపువంటి వస్త్రము గలవాడును, కోటి సూర్య ప్రభాభాసమానుడును, మకరకుండల విరాజితుడును, అనేక రత్నగ్రధిత కిరీట ప్రకాశమానుడును, అనేక సూర్య కాంతింతుడును, మనోవాచామగోచరుడును, దేవతాపతియును, స్వయంభువును, ప్రసన్నుడును, అధిపతియును, ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని జూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్యసుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి. వచ్చి హరి పాదములము నమస్కారము చేసి వారిముందర నిలిచి అంజలిబద్ధులై హరిని వక్ష్యమాణరీతిగా స్తుతించిరి.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే అష్టాదశాధ్యాయస్సమాప్తః
SIVA PURANAM – 18

నాగేశ్వర జ్యోతిర్లింగము

యామ్యే సదంగే నగరేతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై
సద్భక్తి ముక్తిప్రదమీశమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే!!
సద్భక్తిని, ముక్తిని రెండింటిని ఈయగాలిగిన నాగనాథునికి నమస్కరించుచున్నాను. ఇక్కడ నాగ నాథుడు అంటే విశేషమయిన పూజనీయుడు అని అర్థం. అటువంటి నాగనాథునికి నేను శరణాగతి చేయుచున్నాను. ఈ నాగనాథ లింగము ఎందులకు వచ్చింది? దీని ఆవిర్భావమునకు వెనకాతల ఉండే కారణం ఏమిటి? ఇక్కడ మనం ఒక విషయమును పరిశీలనం చేయాలి. శివారాధన రాక్షసులు చేస్తారు, ప్రమథగణములు చేస్తారు, మహాభక్తులు చేస్తారు, భూతప్రేతాది గణములు చేస్తాయి. శివారాధనమును జ్ఞానమును ఐశ్వర్యమును అపేక్షించేటటువంటి వారు చేస్తారు. ఆపద పోవాలనుకుంటున్న వాళ్ళు శివాభిషేకం చేస్తారు.
దారుకుడు, దారుకి వీరిద్దరూ రాక్షస దంపతులు. వారికి బోలెడంత సంతానం ఉంది. వాళ్ళు ఒకనాడు ఒక సముద్రతీరమునకు చేరారు. వీరు చాలామందిని హింసించారు. ఒకానొకప్పుడు అందరి ప్రజలని బాధపెడుతూ భగవద్భక్తుల జోలికి కూడా వెళ్ళారు. అపుడు ఆ భక్తులు ఔర్వుడు అనే మహర్షి పాదములు పట్టుకుని ఆయనను శరణాగతి చేశారు. ఔర్వుడు గొప్ప తపశ్శక్తి కలవాడు. ‘వాళ్ళు వాళ్ళ ఉద్ధతిని మార్చుకుని మంచిగా జీవితం గడిపినట్లయితే ఫరవాలేదు. వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని మార్చుకోలేము అనుకున్నప్పుడు వాళ్ళు భూమండలం మీద ఎక్కడా ఉండకూడదు. భూమండలం మీద ఎక్కడయినా రాక్షస ప్రవృత్తి కలిగినవాడు ఉన్నట్లయితే వారు ఉత్తరక్షణం మరణిస్తాడు. ఇదే నా శాపం’ అని ఔర్వుడు అభయం ఇచ్చాడు. తపశ్శక్తి కలిగిన వాడి వాక్కు బ్రహ్మాస్త్రం అయి కూర్చుంటుంది. ఈవార్త రాక్షసులకు తెలిసింది వాళ్లకి తాము బ్రతకడం ఎలా అనే బెంగపట్టుకుంది. అపుడు దారుకి ‘నేను పార్వతీదేవి గురించి ఎప్పుడో ఒకసారి తపస్సు చేశాడు. అపుడు శాంభవి నాకు ప్రక్షమయి ఒక గొప్ప వరం ఇచ్చింది. దాని వలన నేను నా వారిని ఎక్కడయినా పెట్టి బ్రతికించగలను. ఔర్వుడు మనలను భూమి మీద కదా ఉండవద్దని శాపం ఇచ్చాడు. అందుకని మనందరం సముద్రం మీద ఉందాము. ఆవిడ ఇచ్చిన తపశ్శక్తితో మిమ్మల్నందరిని నేను రక్షిస్తాను. పదండి’ అంది. దారుకి సూచనను అనుసరించి రాక్షసులందరూ సముద్రం మీద పడ్డారు. ఆ సముద్రంలో వాళ్ళు సముద్రం మీద ఓడలలో ప్రయాణించే వారిని పట్టుకుని వారిని చెరపట్టి హింసించి బాధిస్తూ ఆనందిస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు.
అక్కడ సముద్రం మీద ఓడలో వెళుతున్న వారిలో సుప్రియుడు అనబడే ఒక వైశ్యుడు ఉన్నాడు. భక్తికి కులంతో సంబంధం లేదు. రాక్షస దంపతులు సుప్రియుడిని పట్టుకున్నారు. సుప్రియుడికి దాసదాసీజనం ఉన్నారు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన ఒక్కడినీ తీసుకు వెళ్లి కారాగారంలో పెట్టారు. అపుడు ఆయన ఇవన్నీ ఉండడం, పోవడం ఈశ్వరేచ్ఛ. నాకు ఈశ్వరుడు చాలు అన్నాడు. ఆయన కారాగారంలో ఉన్న ధూళినంతా పోగేస్తే ఒక చిన్న శివలింగం అయింది. దానిమీద చుక్క నీరు పోసి పార్థివలింగం చేశాడు. ఆరాధన చేయడం ప్రారంభించాడు. అపురూ రాక్షసులు ఆరాధనకు అడ్డుపడ్డారు. నువ్వు శివారాధన చేయకూడదు, శివ అనే నామం చెప్పినా, శివున్ని ఆరాధన చేసినా, ధ్యానంలో కూర్చున్నా, భగవంతుని స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రం నాకు కలిగినా నీ శిరస్సు త్రుంచేస్తాను అన్నారు. అంటే ఆయన అన్నాడు – ‘నేను ఒక్కనాటికి శివారాధన మానను. నన్ను రక్షించేవాడు శంకరుడు. నా తల త్రుంచడానికి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాని చేతిలో నీ తల త్రుంచబడుతుంది. త్రుంచకలిగిన వాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఆయన పాదములు పట్టుకున్నాను అన్నాడు. అపుడు వెంటనే రాక్షసుడు కత్తినొకదానిని తీసుకుని అపారమయిన ఉగ్రరూపంతో సుప్రియుడి కంఠమును నరికేయ్యబోయాడు. ఆ సమయమునకు సుప్రియుడు ఈశ్వరుని పరమ భక్తితో శరణాగతి చేస్తున్నాడు. రెండు చేతులతో పరమేశ్వరునికి నమస్కారం చేశాడు. అలా చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్న పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు. రుద్రరూపంతో ఆవిర్భవించడం త్రిశూలం పెట్టి దారుకుడిని దెబ్బకొట్టడం వాడు పారిపోవడం ఆయన ఉగ్రమయిన దృష్టికి కొన్ని వందలమంది రాక్షసులు బూడిద కుప్పలై పడిపోవడం ఏకకాలమునందు జరిగిపోయాయి. చిత్రమేమిటంటే ఆ వచ్చిన పరమశివుని అర్థభాగమందు పార్వతీదేవి ఉంది. ఆవిడ గబుక్కున శివుని చేయి పట్టుకుని తనవారిని తాను రక్షించుకునే శక్తి ఇమ్మని దారుకి అడిగింది. ఆమెకు అటువంటి శక్తి కలిగేలా నేను ఆమెకు వరం ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఎమవ్వాలి? ఆవిడ నాకు భక్తురాలు. మీరు నామీద ప్రేమతో ఆమెయందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి’ అంది.
వెంటనే శివుడు శంకరుడు అయిపోయాడు. ఒక నవ్వు నవ్వి ‘పార్వతీ నిజమే. ఆవిడకి నీవు వరం ఇచ్చావు. కానీ వాళ్ళు రాక్షసులు. నేను ఇప్పుడు వీళ్ళని విడిచిపెడితే వీళ్ళు మరల దుర్మార్గపు పనులు చేయడం మొదలుపెడతారు. కాబట్టి వీళ్ళు మరల ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసే నిమిత్తం నేను ఇక్కడే జ్యోతిర్లింగరూపంలో కూర్చుంటాను. నీవు కూడా నీవలన బతుకున్నామని వాళ్లకి గుర్తు ఉండడానికి అమ్మవారి రూపంలో ఇక్కడే కూర్చో. నేను నాగనాథుడు అనే పేరు
తో వేలుస్తున్నాను. ఈశ్వరీ, నువ్వు నాగేశ్వరీ అనే పేరుతో వెలవవలసింది’ అన్నాడు. ఆవిధంగా ఇద్దరూ ఆ తటమునందు జ్యోతిర్లిన్గమై వెలిశారు.
ఎవరయినా వారి దర్శనం చేస్తే వారికి జన్మ జన్మలయందు పార్వతీ పరమేశ్వరుల పాదపద్మముల యందు చెక్కుచెదరని భక్తి ప్రపత్తులు కలిగేలా అనుగ్రహిస్తాను అని స్వామి శపథం చేసి చెప్పి నాగనాథుడిగా ఆ తీరమునందు వెలసి ఉన్నాడు. కాబట్టి మనం నాగ నాథ క్షేత్రమునకు తప్పకుండా వెళ్ళాలి. మనస్సును నిగ్రహించి ఈశ్వరుని వైపు పెట్టడం అలవాటు అవడం అనే భక్తి ముహూర్తములవలన రాదు. భక్తిగా ఉండడం ఈశ్వరానుగ్రహం. భక్తి అంటే ఏమిటో సరిగ్గా తెలియడం ఈశ్వరానుగ్రహం. సరిగ్గా తెలిసన భక్తియందు మనస్సు నిలబడడం ఈశ్వరానుగ్రహం. అటువంటి అనుగ్రహమును తన దర్శనమాత్రం చేత ఇచ్చేస్తానన్నాడు నాగనాథుడు.
పూర్వం పెద్దలు మనలను తీర్థయాత్రలు చేయమని ప్రోత్సహించేవారు. తీర్థయాత్ర చేసేముందు వెడుతున్న ఆ క్షేత్రం వైశిష్ట్యం తెలియాలి. తీర్థయాత్రలు చేసినప్పుడు ఆయా క్షేత్రములకు వెళ్లినపుడు వాటిని గురించి తెలుసుకుని ఆయా క్షేత్రములలో ఏ శ్లోకమును చెప్పాలో ఆ శ్లోకమును చెప్పి ఏది మీరు భగవంతుని అడగాలో దానిని అక్కడ అడగాలి. అంతేగానీ వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చాము అనుకోవడం వలన ఉపయోగం లేదు. క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు దానికి తగిన పనిని మీరు చేసి వస్తుండాలి. ఒకవేళ అలా చేయడం తెలియకపోయినా మన అమాయకత్వం చేత ఈశ్వరుడు దానిని పరిపూర్ణం చేస్తూ ఉంటాడు. ఈశ్వరశక్తియందు అదికూడా ఉంటుంది.
Kartika Puranam - 19

కార్తిక పురాణము - పంతొమ్మిదవ అధ్యాయము

జ్ఞాన సిద్ధుడిట్లు స్తుతిజేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతములందు ప్రతిపాదింబపడిన వానిని గాను, గుహ్యమైనవాని గాను, నిశ్చలునిగాను, అద్వితీయునిగాను, దెలిసికొనుచున్నారు. చంద్రసూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీపాదపద్మములము నమస్కరించుచున్నాము. వాక్యములతో జెప్ప శక్యముగాని వాడవు. శివునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడవు. సంసార భయమును దీసివేయు సమర్ధుడవు. జన్మసంసార సముద్రందున్న శివాదులచేత నిత్యు కొనియాడబడువాడవు. చరాచరప్రాణులచే స్తుతింపబడినవాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీవిభూతి విస్తారమే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా! మీరు పరముకంటే పరుడవు. నీవే యీశ్వరుడవు. ఈ చరాచరరూపమైన ప్రపంచమంతయును, దానికి కారణమైన మాయతో కూడా నీయందు తోచుచున్నది. త్రాడు నందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతివలె తోచుచున్నది అనగా లేదని భావము. ఓ కృష్ణా! నీవు ఆదిమధ్యాంతములందు ప్రపంచమందంతటను ఉన్నావు. భక్ష్య, భోజ్య, చోష్య, రూప చతుర్విధాన్నరూపుడవు నీవే. యజ్ఞరూపుడవు నీవే. నీసంబంధియు, పరమ సుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును జూచిన తరువాత ఈజగము వెన్నెలయందు సముద్రమువలె తోచును. ఆనంద సముద్రము నీవే. నీవే ఈశ్వరుడవు. నీవే జ్ఞాన స్వరూపుడవు. సమస్తమునకు నీవే ఆధారము. సమస్త పురాణ సారము నీవే అగుదువు. నీవలననే సమస్తము జనించును. నీయందే లయించును. నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు. ఆత్మ స్వరూపుడవు. అఖిలవంద్యుడవు. మనస్సు చేతను చూడ శక్యముగాని నీవు మాంసమయములైన నేత్రములకెట్లు గోచరమగుదువు? ఓ కృష్ణా! నీకు నమస్కారము. ఓయీశ్వరా! నీకు నమస్కారము. ఓ నారాయణా! నీకు నమస్కారము. నన్ను ధన్యునిజేయుము. మీదర్శనఫలము విఫలము చేయకుము. ఓ పరమపురుషా! నీకు మాటిమాటికీ నమస్కారము. ఓదేవేశా! నన్ను నిరంతరము పాలించుము. నీకు నమస్కారము. సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మ్రొక్కెదను. ఇందువలన నా జన్మ సఫలమగుగాక. నీకేమియు కొరతపడదు గదా! నీ జ్ఞానానికి లోపము ఉండదు గదా నీవు దాతవు. కృపా సముద్రుడవు. నేను సంసారసముద్రమగ్నుడనై దుఃఖించుచున్నాను. కాబట్టి సంసార సముద్రమునందుబడియున్న నన్ను రక్షించుము. శుద్ధ చరితా, ముకుందా! దుఃఖితుడనగు నన్ను రక్షింపుము. త్రిలోకనాథా నమస్కారము. త్రిలోకవాసీ నమస్కారము. అనంతా, ఆదికారణా, పరమాత్మా నమస్కారము. పరమాత్మరూపుడవు, పరమహంస పతివి, పూర్ణాత్ముడవు. గుణాతీతువు, గురుడవు, కృపావంతుడవు. కృష్ణా నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్ధిని వాసివి, స్వర్గమోక్షప్రదుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధు హృదయ పద్మనివాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవు అయిన ఓ కృష్ణా! నీకు నమస్కారము.

ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా! నీకు నమస్కారము. వైకుంఠనిలయా! వ్యాసాదులచేత కొనియాడబడు పాదములు గల కృష్ణా! నీకు నమస్కారము. విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తియను పడవచేత సంసారసముద్రమును దాటి తేజోమయమైన నీరూపమును బొందుదురు. అనేక బోధలచేతను, తర్కవాక్యములచేతను, పురాణములచేతను, శాస్త్రములచేతను, నీతులచేతను మనుష్యులు నిన్ను చూడలేదు. నీపాదభక్తి యను కాటుకను ధరించి నీరూపమును జూచి దానినే యాత్మగా భావించి తరింతురు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓహరీ! నీకునమస్కారము. నీనామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును. ఆశ్చర్యము. ఒక్కమారు నీనామ సంకీర్తన చేయువాడు నీపదసన్నిధికి చేరును. కేశవా, నారాయణా, గోవిందా, విష్ణూ, జిష్ణూ, మధుసూదనా, దేవా, మహేశా, మహాత్మా, త్రివిక్రమా, నిత్యరూపా, వామనా శ్రీధరా, హషీకేశా, పద్మనాభా, దామోదరా, సంకర్షణా! నీకు వందనములు, ఓ కృపానిధీ! మమ్ములను రక్షించుము. ఇట్లు స్తుతిజేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతోనిట్లనియె. ఓ జ్ఞానసిద్ధా! నీస్తోత్రమునకు సంతోషించితిని. నామనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది. వరమిచ్చెదను. కోరుకొనుము. అని విష్ణువు పల్కెను. జ్ఞానసిద్ధుడిట్లడిగెను. గోవిందా నాయందు దయయున్నయెడల నీస్థానమును యిమ్ము. ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను. భగవంతుడిట్లు చెప్పెను. ఓజ్ఞానసిద్ధా! నీవు కోరినట్లగును. కాని ఇంకొకమాట చెప్పెదను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై యున్నారు. బుద్ధిహీనులయి ఉన్నారు. వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగెడి ఉపాయమును జెప్పెదను వినుము. ఓ మునీంద్రులారా! మీరందరు వినుడు నేజెప్పెడి మాట ప్రాణులకు సుఖదాయకము.

నేను ఆషాఢశుక్ల దశమినాడు లక్ష్మితో గూడ సముద్రమందు నిద్రించెదను. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశినాడు మేల్కొనెదను. కాబట్టి నాకు నిద్రా సుఖము ఇచ్చెడి ఈమాస చతుష్టయమునందు శక్తివంచన చేయక వ్రతాదులనాచరించువారికి పాపములు నశించును. నా సన్నిధియు కల్గును. నాకు నిద్రాసుఖప్రదమైన ఈమాస చతుష్టయమందు వ్రతమాచరించని వాడు నరకమందు పడును. ఓ మునీశ్వరులారా! నా ఆజ్ఞమీద భక్తిమంతులైన మీరు ఇష్టార్థదాయకమయిన ఈవ్రతమును తప్పక చేయండి. ఇంకా అనేకమాటలతో నేమి పనియున్నది? ఎవ్వడు మూఢుడై ఈచా
తుర్మాస్య వ్రతమును జేయడో వాడు బ్రహ్మహత్యఫలమును బొందును. నాకు నిద్రగాని, మాంద్యముగాని, జాడ్యముగాని, దుఃఖముగాని, జన్మజరాదులు గాని, లాభాలాభములు గాని లేవు. అనగా యీనిద్రాదులకు భయపడి నేను సముద్రందు శయనించలేదు. నా భక్తి గల వారెవ్వరో భక్తి లేనివారెవ్వరో పరీక్షించి చూతమని నిద్రయను వంకపెట్టుకుని శయనించెదను. కాబట్టి నా ఆజ్ఞననసరించి నాకిష్టమయిన ఈచాతుర్మాస్య వ్రతమును జేయువారు విగతపాపులగుదురు. నాకు ఇష్టులగుదురు. నీచే చేయబడిన యీ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠింు వారికి నా భక్తి స్థిరమై అంతమందు నాలోకమును జేరి సుఖింతురు. హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమినాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు శయనించెను. అంగీరసుడిట్లు పలికెను. ఓయీ! నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస్య వ్రతము సర్వ ఫలప్రదము అన్ని వ్రతములలోను ఉత్తమోత్తమమైనది. పాపవంతులుగాని, దురాత్ములు గాని, సాధువులు గాని, ఎవరైనను హరిపరాయణులై ఈనాలుగు మాసాలు చాతుర్మాస్య వ్రతమును జేయవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరును ఈ వ్రతమును విష్ణుప్రీతికొరకై జేయవలెను. ఈచాతుర్మాస్యవ్రతమును పునిస్త్రీగాని, విధవ గాని, శ్రమణిగాని, లేక సన్యాసిని గాని తప్పకజేయవలెను. మోహముచేత చాతుర్మాస్య వ్రతమును జేయకుంిన యెడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపములు బొందును. మనోవాక్కాయములను శుద్ధము చేసికొని చాతుర్మాస్యమునందు హరిని బూజించువాడు ధన్యుడగును. చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు కోటి జన్మములందు కల్లుద్రాగువాడు పొందెడి గతిని బొందును. సందేహము లేదు. పరమాత్మతుష్టిై చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు గోహత్య చేసిన వానిఫలమును పొందును. ఈ ప్రకారముగా వీలు చేసికొని ఏవిధముగానైనను చాతుర్మాస్య వ్రతమాచరించు వాడు నూరు యజ్ఞములఫలమొంది అంతమందు విష్ణులోకమును జేరును. జ్ఞానసిద్ధాదులిట్లు హరియొక్క మాలను విని చాతుర్మాస్య వ్రతమును జేసి వైకుంఠలోక నివాసులయిరి.

ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే ఏకోనవింశాధ్యాయస్సమాప్తః