Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల్లో రెండోది కూర్మావతారం. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఎన్నో లోతైన విషయాలను వెల్లడిస్తుంది. క్షీరసాగర మథనంలో వాసుకి, మందరం, సముద్రం అనే పదాలు అసాధారణ అర్థాలు కలిగి ఉన్నాయి. వాసుకి అంటే మూలాధారంలోని కుండలినీ సర్పం. ఇది యోగశక్తి, శ్వాసకు సంకేతం. మందరం అంటే నిలువుగా-అడ్డంగా కిందకి-పైకి కదిలేది. ఇది మనం ధ్యానంలో ఉన్నప్పుడు కిందకు-పైకి కదిలే కుండలినీ శక్తికి (ఉచ్ఛ్వాస - నిశ్వాసాలు) ప్రతీక. సముద్రం అంటే భగవత్‌ చింతనం. ఊగిసలాడే మందరానికి కింద ఆధారం లేకపోవడంతో అది సముద్రంలో మునిగి పోతున్నప్పుడు శ్రీహరి కూర్మావతారాన్ని ఎత్తి మునగకుండా ఉంచాడు. ఇందులో రహస్యార్థం ఏమంటే- ధ్యాన ప్రక్రియలో శ్వాసను ఎప్పుడూ ఊర్ధ్వంలోనే (పై మార్గంలో) ఉంచాలని, శ్వాస అవరోధం జరిగితే ఉపాసన-సాధనాలు దెబ్బతిని అనుకున్నది సాధించలేమని కూర్మావతారం తెలియజేస్తుంది. అలాగే నిరుక్త నిఘంటువులో కూర్మం అనే పదానికి ‘భూ సంబంధమైన ఆశ, శోకం, శ్వాస, ఆకలి, దప్పిక, మరణం అనే ఆరు లక్షణాలను కలిగిన షడూర్ముల జీవం’ అనే నిర్వచనం ఉంది. అంటే తాబేలు జీవ ధర్మాలు కలిగిన జీవి అని అర్థం. దీన్నిబట్టి వంశ వృద్ధి జరగాలన్నా, సంస్కారాలను సక్రమంగా నిర్వర్తించాలన్నా ఆరోగ్యంగా ఉండాలని కూర్మం బోధిస్తుంది. మరో కోణంలో చూస్తే సాధన చేసేటప్పుడు దాన్ని సాధించే వరకూ పట్టు విడవకూడదని, ఎంత కష్టమైనా భరించి తీరాలని, అందుకోసం సాధకుడు బలమైన ఆహారంతో శక్తిమంతుడై ఉండాలనే సందేశం కూర్మావతారంలో ఇమిడి ఉంది.
నిశ్శబ్ద మార్గం


ఒక పౌర్ణమి రోజున బుద్ధుడికి జ్ఞానోదయమైంది. ఆ వారమంతా ఆయన మౌనంలోనే ఉన్నారంటారు. ఒక్క మాటైనా మాట్లాడలేదు. పురాణగాథల ప్రకారం స్వర్గంలో దేవతలు భయపడిపోయారట. వాళ్లకు తెలుసు- కొన్ని లక్షల సంవత్సరాలకోసారి ఎవరో బుద్ధుడిలా వికసించడం జరుగుతుందని. ఇప్పుడు ఆయన మౌనంలో ఉన్నాడు.
దేవతలు ఏదైనా మాట్లాడమని ఆయనను కోరారు. అప్పుడాయన- ‘తెలిసినవారికి అర్థమవుతుంది నేనేం చెప్పకపోయినా... తెలియనివారికి నేనేం చెప్పినా బోధపడదు. ఇది అంధుడి ముందు వెలుగును వర్ణించడంలాంటిది. జీవితంలోని అమృతాన్ని రుచిచూడని వారితో నేనేం మాట్లాడినా వ్యర్థం. అందుకే ఈ మౌనం. పవిత్ర గ్రంథాలు ఏనాడో చెప్పాయి- ఎక్కడ మాటలు ఆగిపోతాయో, అక్కడ సత్యం మొదలవుతుంది’ అన్నాడు.

బుద్ధుడి మాటలు కచ్చితంగా నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. ఎందుకంటే ఆయన నిశ్శబ్దానికి ప్రతిరూపం. అదే జీవానికి మూలం, అన్ని రుగ్మతలకూ ఔషధం.
మనుషులు కోపంగా ఉంటే మౌనాన్ని పాటిస్తారు. ముందు అరుస్తారు, తరవాత నిశ్శబ్దం ఆవరిస్తుంది. తెలివైన వారూ చాలా సందర్భాల్లో మౌనంగా ఉండిపోతారు.
మాటల ఉద్దేశం నిశ్శబ్దాన్ని సృష్టించడానికే. మాటలు శబ్దానికి కారణమైతే వారు లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదని అర్థం. ‘శబ్దాలు, మాటలు ఏదైనా వ్యక్తపరచడానికే. అవి అనుబంధోత్పత్తి మాత్రమే. దానికంటూ అస్తిత్వం లేదు. ఆలోచనను వ్యక్తపరచేందుకు వాహకనాళం. ఒక మట్టికుండలాంటిది... మట్టికాదు... ఓంకారం అసలైనది’ అంటారు ఆది శంకరాచార్య మాండూక్యోపనిషత్తులో.
మనసులోని రొద దేని గురించి? ధనం, కీర్తిప్రతిష్ఠలు, సంబంధబాంధవ్యాలు... శబ్దం ఏదో ఒక దాని గురించి. దేని గురించీ కానిది నిశ్శబ్దం. నిశ్శబ్దం మూలం... శబ్దం ఉపరితలం.
మొదటినుంచీ బుద్ధుడిది సంతృప్తికరమైన జీవితం. ఏ సుఖమైనా కావాలనుకుంటే చాలు- ఆయన పాదాల దగ్గరుండేది. వెళ్ళి ప్రపంచాన్ని చూడాలనుకున్నాడు. తనకు తానుగా యథార్థం తెలుసుకోవాలనుకున్నాడు. తన స్థానాన్ని, భార్యను, కొడుకును వదిలిపెట్టాడు. నిశ్శబ్దం ఎంత దృఢంగా ఉంటే లోపలి నుంచి తలెత్తే ప్రశ్నలు అంత శక్తిమంతంగా ఉంటాయి. ఆయనను ఏదీ ఆపలేదు.

ఎటువంటి మనిషైనా జీవితంలో కొన్నిసార్లైనా మౌనంగా ఉండే పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఎందుకంటే మనసులో, హృదయంలో జరుగుతున్నదాన్ని సంపూర్ణంగా ఏ మాటలూ వివరించలేవు. మౌనం శక్తిమంతమైన సందేశాలను అందిస్తుంది. సహనం, మౌనం- రెండూ బలమైన శక్తులు. సహనం మానసికంగాను, మౌనం భావోద్వేగాలపరంగానూ అని అర్థం చేసుకోవాలి. మనిషి తన సహజ స్వభావాన్ని తెలుసుకోవాలి. సహజ లక్షణాలుగా భావించే శాంతి, కరుణ, ప్రేమ, స్నేహం, సంతోషం... ఇవన్నీ నిశ్శబ్దం నుంచి పుట్టేవే. నిశ్శబ్దం బాధను, అపరాధాన్ని, దుఃఖాన్ని మింగేస్తుంది.
వివేకంతో ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరూ కష్టాలసాగరం దాటవచ్చు. సుఖాల తీరం చేరుకోవచ్చు. ఎవరైనా మౌనంగా ఉండిపోయారంటే వారు మాట్లాడలేకపోయారని, ఓడిపోయారని కాదు. అర్థం చేసుకోలేనివారితో వాదించడం ఇష్టంలేక అలా ఉండిపోయారనుకోవాలి.
సత్యాన్వేషణ


సత్యాన్ని తెలుసుకోవడానికి సగుణమా లేక నిర్గుణమా అన్న మీమాంస సదా సాగుతూనే ఉంటుంది. మీమాంస వదిలి సాధనా మార్గంలో పయనిస్తేగాని సత్యదర్శనం కలగదంటారు దార్శనికులు. ఈ భూమి మీద కళ్లు తెరవగానే కనిపించేది వస్తు ప్రపంచం. ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు; జలమయమైన సముద్రం, నదులు, కొలనులు, బావులు; అంబరాన్ని సంబరంగా తాకడానికి చేతులు చాచే వృక్షాలు; వాటిని నడిపించే కనిపించని వాయువు, నేలపై ఉన్నా నింగికి ఎగసిపడే నిప్పు, రగిలే నాల్కలు; కొండలు, కోనలతో నిండిన నేల- పంచభూతాలను మనిషి ఎలా కాదనగలడు? అంపశయ్య పైన ఉన్న భీష్మాచార్యులకు మొదట విశ్వం, తరవాత విష్ణువు కనిపించారు. సర్వ వ్యాపకమైన విష్ణుత్వాన్ని కురుపితామహుడు కృష్ణుడిలోనే చూడగలిగాడు. తెలిసినదాన్నిబట్టి తెలియనిదాన్ని పట్టుకోవడం సులభం. ఉట్టి కొట్టగలిగితే, స్వర్గం ఎక్కగలనన్న ధైర్యం, ఉత్సాహం ముందుకు నడిపిస్తాయి. ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టి, పెరిగి, గిట్టడం ప్రకృతి సహజమైన మార్పు.
విశ్వరహస్యాన్ని తెలుసుకోవడానికి మూడురకాల ప్రామాణికాల్ని విజ్ఞులు నిర్దేశించారు. ప్రత్యక్ష, అనుమాన, శబ్దప్రమాణాలు మూడూ సత్యాన్వేషణకు తగిన ఉపకరణాలు. కళ్లతో చూడాలి, మనసుతో తెలుసుకోవాలి, జ్ఞానసంపదతో కూడిన వేదమంత్రం ఉపాసించాలి. ఈ మూడింటికీ లొంగని మహత్త్వం యోగసమాధిలో హృదయనేత్రానికే అవగతం అవుతుంది. ఎవరికి వారే అనుభవం ద్వారా అనుభూతి చెందినప్పుడే సత్యసాక్షాత్కారం సాధ్యమవుతుందంటారు యోగీ శ్వరులు. చూపు, చూడదగినది, చూడగలవాడు (దృష్టి, దృశ్యం, ద్రష్ట) మూడూ ఒకటి అయితే నిత్యం, నిఖిలమైన సత్యస్వరూపం విశ్వవ్యాప్తమై విష్ణుసహస్ర నామమై ధ్వనిస్తుంది.

జ్ఞానమార్గంలో కొనసాగేవారికి నిర్గుణధ్యానం, కర్మ మార్గంలో పయనించేవారికి సగుణధ్యానం కలిసివస్తాయని, గురువులు శిష్యుల స్థాయినిబట్టి మార్గనిర్దేశం చేసేవారు. నేను సర్వజ్ఞుడిని అన్న అహంకారంతో అగ్నికార్యాలు మానివేసిన జ్ఞానికన్నా నిష్కామకర్మ చేసే యోగి మిన్న- అంటున్నది భగవాన్‌ ఉవాచ. విష్ణు సహస్రనామాలు వల్లెవేస్తూ, పాపపు పనులకు ఒడిగట్టేవాడిని నామాపరాధి అంటున్నది శ్రీభాగవతం. సగుణ, నిర్గుణమనే విభేదం కేవలం తాత్కాలికం. ఏరు దాటడానికి తెప్ప అవసరం. ఏరు దాటాక తెప్పను వదలకపోవడం అవివేకం. ఇహపర సాధన జీవిత పరమార్థం. జ్ఞానం, కర్మ, యోగం, భోగం- అన్నీ సత్యశిఖరానికి చేర్చే సోపానాలు. అంచెలంచెలుగా నిచ్చెనమెట్లు ఎక్కినప్పుడే నింపాదిగా చేరవలసిన చోటుకు చేరుకోవచ్చు. నేలవిడిచి చేసే సాముగరిడీలను నమ్ముకుంటే వైకుంఠపాళి పాము నోట్లో పడ్డ పాచికవలె జారిపడతారు. వైకుంఠానికి బదులు వైతరణికి తరలిపోగలరు. లోకంలో ఒకరి సహాయం లేకుండా జీవించడంగాని, కార్యసిద్ధి పొందడంగాని సాధ్యం కాదు. పొట్టు సాయంలేకుండా బియ్యపు గింజ మొలవదు. తోడూ నీడా లోకసహజమైన జోడుగుర్రాలు. సగుణం కాదని నిర్గుణం కోసం వెంపర్లాడితే గాడితప్పి బండి బోల్తా కొట్టవచ్చు. సాధన, ఉపాసన జోడుగుర్రాల్లాంటివి. ఈ రహస్యం తెలుసుకున్నప్పుడు నాణేనికి బొమ్మ-బొరుసు లాంటివే సగుణ నిర్గుణ సాధనామార్గాలన్న సమరస భావన కలుగుతుంది. సాధన వేగవంతమై యోగం వరిస్తుంది. సచ్చిదానందం అంటే అచ్యుతానంద గోవిందుడేనన్న సత్యం బోధపడుతుంది.
మనసు పోకడలు


మనిషి నడతలన్నీ మనసు పోకడలను బట్టే ఉంటాయి. మనో చాంచల్యం మన చర్యల్లో కనిపిస్తుంది. మన చర్యలను బట్టే మనకు గౌరవ మర్యాదలుంటాయి. వైద్యులు వ్యాధి మూలాలను పట్టుకుంటేనే రోగం మందులతో శాంతిస్తుంది. తగిన చికిత్స చెయ్యడానికి వీలవుతుంది. తల్లిదండ్రులు తమ సంతానం గొప్పవాళ్లు కావాలని ఆరాటపడతారు. వారి దృష్టిలో గొప్పదనం అంటే ధనార్జన, హోదా, అధికారం, సాంఘిక గౌరవం. ఇవన్నీ ఉన్నా శీలం లేకపోతే, ఏమీ లేనట్లే. శీలం గలవారినే జ్ఞానం ఆశ్రయించి ఉంటుంది.
జ్ఞానం అంటే కేవలం వివేకంతో కూడిన లోకజ్ఞానం కాదు. పరిణతి చెందిన ఆధ్యాత్మికతనే శుద్ధ జ్ఞానం అంటారు. జ్ఞానానికి శుద్ధత ఏమిటి అనుకోవచ్చు. బంగారాన్ని శుద్ధి చేస్తేనే మేలిమి బంగారం అవుతుంది. జ్ఞానిక్కూడా సందేహాలు ఉంటాయి. జనక మహారాజు వద్దకు శుకమహర్షి వెళ్ళి సందేహాలు తీర్చుకోవడం ఇందుకు ఉదాహరణ. జ్ఞానం ఒక మహా సముద్రం. దాన్ని యథాతథంగా స్వీకరించగల శక్తి అందరికీ ఉండదు. ఒక్క అగస్త్యుడే సముద్రాలను ఆపోశనం పట్టినట్లు చెబుతారు. సముద్ర జలాలను సూర్యుడు ఆవిరిగా మార్చి మేఘాలకు అందిస్తాడు. అప్పుడు వాటిలోని లవణ లక్షణం పోతుంది. మేఘాలు శుద్ధ జలాలను వర్షిస్తాయి. అవే కొండలనుంచి సెలయేళ్లుగా, నదులుగా ప్రవహిస్తాయి. ఆ నీరు ప్రాణదాతగా ప్రకృతికి జీవం ప్రసాదిస్తుంది.

జ్ఞానమూ అంతే. జ్ఞానమూలం పరమాత్మ. ఆయన నుంచి శబ్ద బ్రహ్మంగా వేదాలు మహర్షులు విన్నారు. అవి శ్రుతులయ్యాయి. వాటిని మననం చేసుకుంటూ సుబోధకంగా శిష్య పరంపరకు చెప్పారు. అవే స్మృతులు. అనేక వడపోతల తరవాత జ్ఞానం శుద్ధం, పరిశుద్ధం సుగ్రాహ్యంగా మారి జిజ్ఞాసువులకు అందుబాటులోకి వచ్చింది. 
మనిషి ఇంటిని, ఒంటిని శుభ్రం చేసుకుంటాడే తప్ప మనసులోని మకిలిని వదిలించాలనుకోడు. అసలు సమస్య అంతా మనసుతోనే. దాన్ని శూన్యం చేసుకోవాలంటారు జ్ఞానులు. కొందరు తీవ్రమైన సాధనలు చేసేవారు ‘మనోనాశ్‌’ అనే స్థితికి చేరతారు. ఇది దాదాపు అవధూత స్థితి. భారతీయ ఆధ్యాత్మికత ఆత్మస్వరూపుడైన అంతర్యామికి తొలి తాంబూలం ఇస్తుంది. అంతర్యామి దాసుడే అసలైన భక్తుడు. అంతర్యామి అంటే ఆలయ శిలామూర్తి కాదు. సృష్టిలోని సమస్త ప్రేమ, ఆనందం, అనంతత్వం- ఇవన్నీ కలగలిసిన ఒక దివ్యతేజం. విశ్వంభరగా ఉన్న నిత్య చైతన్యం. దాన్ని దర్శించాలంటే మనం ఆత్మస్థితికి చేరుకోవాలి. మనం మోస్తున్న మనసు, బుద్ధి అనే రెండు బరువుల్ని వదిలించుకోవాలి, లేదా జ్ఞానాగ్నిలో దహనం చెయ్యాలి. అంటే వాటి ప్రమేయం నశించాలి.
‘నేను’కు నిర్వచనాలు మనసు, బుద్ధి. ‘నేను’ నశించాక మిగిలేది అనంతుడు, అజేయుడు, శాశ్వతుడైన బ్రహ్మమే. సృష్టిలో బ్రహ్మం కానిదేదీ లేదంటుంది యోగవాసిష్ఠం. అంటే, మనంకూడా బ్రహ్మస్వరూపులమే. కాని, ఆ జ్ఞానం మనకు లేదు. అలా లేకపోవడమే మాయ. మన జీవితకాల యుద్ధం ఈ మాయతోనే. మాయను జయిస్తే, ప్రపంచమనే మత్తు, భ్రమలోంచి బయటపడితే, ఎదురుగా కనిపించేది అంతర్యామే. ఆ మహా తేజస్సు ఎప్పుడూ, అలాగే, అక్కడే ఉంటోంది. ఎప్పుడు మనం అంతర్యామిని చూడగలుగుతామో అక్కడితో మనం గమ్యం చేరినట్లే. మన జీవనయానం ముగిసినట్లే. ఇవి జరగాలంటే- మనసు పోకడల్ని గమనిస్తూ, మనల్ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. తడబడకుండా, దారి తప్పకుండా...
బంధాలు-బంధనాలు


స్థిరంగా నిలబడి ‘ఒక అడుగు నువ్వువేస్తే నేను ఒక అడుగు వేస్తాను’ అంటే- ఆ బంధం నిలబడదు. బంధాలు పరస్పర అవగాహన, సహకారాలుంటేనే నిలుస్తాయి. ఏ సంబంధం నిలబడాలన్నా ఆదాన ప్రదానాలు ముఖ్యం. అది లోపిస్తే సాంద్రతను కోల్పోతాయి. జీవితంలో సంబంధాలు అసలు ఎందుకు ఏర్పడతాయని ఎవరూ ఆలోచించి ఉండరు. ఒకేలాంటి అభిరుచులవల్లో, ఇరుగు పొరుగువారై ఉండటమో, పిల్లల కారణంగానో అనుకుంటారు. వయసు పెరిగాక, అనుభవం గడించాక అర్థమవుతుంది- సంబంధాలు యాదృచ్ఛికంగా ఏర్పడవని, దానికి ఏదో ఒక కారణం ఉంటుందని.
ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకోవడం కోసం మనుషులు కలుస్తారు. కొన్ని సంబంధాలు అద్భుతంగా ఉంటే, మరికొన్ని ఉన్నట్లు కనిపిస్తాయి. బాధలకు అవే కారణమూ అవుతుంటాయి. ప్రతిదీ ఒక పాఠం నేర్పుతుంది ఎదిగేందుకు. ఒక జీవిగా ఎదగాలంటే అనుభవం అవసరం. జీవితంలో ఎన్నో దశలు... ఎందరో తారసపడుతుంటారు. లక్ష్యం నెరవేరగానే వెళ్ళిపోతారు.

మహాభారతంలో కురుక్షేత్రానికి ముందు నకులుడు భీష్ముడితో తప్పించలేని ఈ కురుపాండవ ఘర్షణకు అసలైన కారణ మేమిటన్నప్పుడు- ‘అన్యోన్యత లోపిం చడమే. దాని వల్ల అపార్థాలు పెరుగుతాయి’ అంటాడు భీష్ముడు. క్షమాగుణం బలమైన స్థిరమైన బంధాలకు తోడ్పడుతుంది. అన్ని సంప్రదాయాలకు చెందిన సాధువులు నిరంతరం క్షమించే గుణం కలిగి ఉండటమే ప్రేమ అంటారు. అదే బంధాలకు మూలం.
పై కప్పును నిలబెట్టేందుకు ఏర్పరచే నాలుగు స్తంభాలు ఎడంఎడంగానే ఉండాలి స్థిరంగా ఉంచడానికి దగ్గరికొస్తే కప్పు కూలిపోతుంది. స్వేచ్ఛలోనే బంధాలు వికసిస్తాయి. బంధనంలో ముడుచుకుపోతాయి. సంబంధం ఎప్పుడూ ఒక ఒడంబడిక కాదు. అవగాహనతో ఏర్పడేది. అవగాహనకోసం వినాలి. అర్థమయ్యేలా తెలియబరచాలి. ఏ బంధంలోనూ ఆశలన్నీ సంపూర్ణంగా నెరవేరవు.
ఒక సంబంధం తెగిపోయినంత మాత్రాన మరేం జరగదు. ఇతర సంబంధాల విషయాలకు సంబంధించిన బాధ్యత మిగిలే ఉంటుంది. ‘మన చేతుల్లో ఏముంది’, ‘మిగిలిందేమిటి’, ‘సంతోషమే లేదు’ అనుకుంటూ మనిషి తరచూ చలించిపోతుంటాడు. కోల్పోయిన సంబంధాల మీదే దృష్టి నిలిపినప్పుడు కొనసాగాల్సిన సంబంధాలకు న్యాయం చేయడం కష్టమవుతుంది. నిన్నటి బాధల తలపులతో విలువైన వర్తమానాన్ని జారవిడుచుకోకూడదు.
బోధించడమైనా, నేర్చుకోవడమైనా, సంబంధాలను బలపరచుకోవడమైనా- ఎందులోనైనా... శ్రద్ధగా వినేవారే ఇతరులకంటే ముందుంటారు. ఒక మంచిశ్రోత మాట్లాడే మాటల్నే కాదు, మాటలకందని భావాల్నీ గ్రహించగలుగుతాడు. దానికి ‘మనసు’ పెట్టాలి.
ప్రతి పురాణగాథ సంబంధాలకు దర్పణం పడుతుంది. ఈర్ష్యలు, అసూయలు, కోపతాపాలు సంబంధాలను ఎలా నాశనం చేస్తాయో వివరిస్తుంది. బంధాలు బలంగా కొనసాగాలంటే ఇతరులను అర్థం చేసుకుంటే సరిపోదు. నువ్వు అర్థం చేసుకున్నావనే నమ్మకం అవతలివారిలో కలగాలి. అది అవతలివారు తెలుసుకోవాలంటే నువ్వు వారి కోణంలో వ్యక్తపరచగలగాలి. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పడం ఒకటైతే, ‘నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని’ అనేది మరొక విధం.
ఎవరి దృష్టిలో వారు వ్యక్తపరిస్తే అవతలివారి మనసు గెలుచుకోవచ్చు. ఎదుటివారి కోణంలో తెలియజెప్పినప్పుడు వారి హృదయాన్నే గెలవవచ్చు.
  

పంచేంద్రియాల్లో ప్రమాదకరమైంది ఏది?


కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ శక్తినే దైవశక్తి అంటాం. అలాగే కనిపించని ఏదో శక్తి ఈ మనిషి జీవితాన్ని నడిపిస్తోంది. దాన్నే మనసు అంటాం. మనసు ఎక్కడుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మన శరీరంలో రక్తం ప్రవహించినంత కాలం ఆ మనసు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది. మనం ఊపిరి తీస్తున్నంత కాలం, ఆ మనసు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది.
మనసు సముద్రం లాంటిది. సముద్రం అనంతమైనది. అపారమైనది. లోతైనది. సముద్రంలో జలచరాలుంటాయి. జలసంపదలుంటాయి. అమృతం, హాలాహలం అక్కణ్నుంచే పుట్టాయంటాయి పురాణాలు. సముద్రంలోంచి ఉప్పెనలొస్తాయి. సముద్రం అందమైనది. కల్లోలమైనది. చెలియలికట్ట దాటనంతవరకు సముద్రంతో ఏ ప్రమాదం ఉండదు.
మనసూ అంతే! మనసు ప్రపంచాన్ని ఉద్ధరించగలదు. ప్రపంచాన్ని భస్మం చెయ్యగలదు. మనిషిలో సత్వగుణం అమృతం. సత్వగుణం పెంచుకుంటే మనిషి వల్ల సమాజానికెంతో మేలు జరుగుతుంది. తమోగుణం పెరిగితే జరిగేవన్నీ చెడ్డ పనులే!
నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ప్రపంచంలో విషయాలన్నీ మనసును చేరతాయి.
మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలున్నాయి. ప్రపంచంలో ప్రతి దృశ్యాన్నీ కన్ను ఆకర్షిస్తుంది. అందమైన వస్తువులన్నీ సొంతం కావాలనుకుంటుంది. చెవి మంచి, చెడు శబ్దాలను వింటుంది. మంచిని మాత్రమే గ్రహించి, చెడును విడిచిపెట్టగలిగితే మనిషి ఉన్నతుడవుతాడు. ముక్కు సువాసనలే పీలుస్తుంది. దుర్వాసనలను ఎలాగూ పీల్చదు. జిహ్వ రుచులను కోరుతుంది. దీంట్లో తినరానివి తినకూడదని విడనాడితే మనసు నిర్మలమవుతుంది. చర్మం సుఖాన్ని కోరుతుంది. ఇలా పంచేంద్రియాలు మనిషి మనసును, మంచి చెడులవైపు ప్రేరేపిస్తాయి.
పంచేంద్రియాల్లో ప్రమాదకరమైనది నోరు. ఇది రెండు పనులు చేస్తుంది- తింటుంది, మాట్లాడుతుంది. రెండూ మితమైనప్పుడే మనసు సత్వ సంపన్నమవుతుంది. అప్పుడే సమాజ సేవ, ఆధ్యాత్మిక చింతన, అరిషడ్వర్గాల అదుపు పెరిగి మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.

ధర్మరాజు జూదమాడాడు. ఆస్తిపాస్తులను, భార్యను పణంగా పెట్టాడు. పరాజితుడయ్యాడు. అతడిలో తప్పున్నా లోకం అతణ్ని పన్నెత్తు మాటనలేదు. కారణం ఆయన మనసు వెన్న లాంటిది. దానధర్మాలు చేస్తాడు. దైవభక్తి కలవాడు. దుర్యోధనుడు అసూయాపరుడు కావడం, ధర్మవ్యతిరిక్తమైన పనులు చెయ్యడంతో అతడు లోక నిందితుడయ్యాడు. కారణం అతడి మనసు. సకల శాస్త్ర పారంగతుడు, పరాక్రమశాలి, సకల సంపన్నుడు రావణుడు. మనసు చెడ్డతనం వల్ల లోకనిందకు గురయ్యాడు. రాక్షస కులంలో పుట్టినా విభీషణుడు మనసును ధార్మిక చింతన వైపు మళ్ళించడంతో లోకం అతణ్ని మెచ్చుకుంది. అందుకే మనసును అదుపులో ఉంచుకోకపోతే జీవితం కష్టాల కడలి తరంగాల సంక్షుభితం అవుతుంది. మనసును అదుపులో ఉంచుకుంటే ఆనందాల నందనవన సంశోభితమే అవుతుంది!
నేడు గోవర్ధన పూజ
తిరుప్పావై

దైవానికి శరణాగతి చేయడం సమస్త సాధనాల సారం. అన్ని ధర్మాలను విడిచిపెట్టి భగవంతుణ్ని ఆశ్రయించడమే శరణాగతి. భక్తిలో నిమగ్నమై ప్రాపంచిక విషయాలను మరచి దేవదేవుణ్ని సదా స్మరించడం కీర్తించడం అంత సులువైన సాధన కాదు. ఎనిమిదో శతాబ్దానికి చెందిన వైష్ణవ సంప్రదాయంలోని పన్నెండు మంది విష్ణు భక్తులు నవవిధ భక్తిమార్గాల ద్వారా భక్తితత్వాన్ని ప్రచారం చేశారు. ఆళ్వార్లంటే శ్రీమహావిష్ణువు నిశ్చితంగా ఉన్నాడని నమ్మేవారు. సదా స్మరించడం వల్ల శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని విశ్వసించేవారు. మానవుల హృదయాల్లోని అజ్ఞానాంధకారం దూరం చేసిన దీపం వెలిగించడానికే భూమి మీద వీరు అవతరించారని పెరియాళ్వార్‌(విష్ణుచిత్తుడు) రాసిన తిరుమొళి చెబుతోంది.
పన్నెండుమంది ఆళ్వార్లలో ఆండాళ్‌(గోదాదేవి) మాత్రమే స్త్రీమూర్తి. రామాయణంలో సీతమ్మలా ఆండాళ్‌ అయోనిజ. సీత భూజాత అయితే ఆండాళ్‌ విష్ణుచిత్తుడికి తులసివనంలో... నల సంవత్సరం, కర్కాట మాసం, పుబ్బా నక్షత్రంలో ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున దివ్యమైన రూపంతో అలౌకికమైన శిశువుగా లభించింది. విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులోని రంగమన్నార్‌ (వటపత్రశాయి) ఆలయంలో అర్చకుడు. దంపతులిద్దరూ విష్ణు భక్తులు. శిశువుకు గోదాదేవి అని పేరుపెట్టుకున్నారు. తలిదండ్రుల పెంపకంలో గోదాదేవికి విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడిపై అనురక్తి పెరిగింది. యుక్త వయస్సుకు వచ్చిన తరవాత గోదాదేవి, శ్రీరంగనాథుణ్ని పతిగా పొందాలని తలచింది. పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తను ప్రసాదించమని ధనుర్మాసంలో శ్రీకృష్ణుణ్ని వేడు కుంటూ పాటలు పాడే సంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో పాశురం(గీతం) ఒక్కొక్క రోజు గానం చేయడం సంప్రదాయం. ఈ వ్రతాన్నే గోదాదేవి ఆచరించింది. ఆమె తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుణ్ని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ, ముప్ఫై రోజులు వ్రతం చేసింది.

తొలి పది పాశురాలు తిరుప్పావై ముఖ్యోద్దేశాన్ని తెలియ జేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి... దేశం సుభిక్షంగా ఉంటుందని చెబుతాయి. తరవాతి పందొమ్మిది పాశురాల్లో, గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావాలు రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టిలేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. ఆ గీతాల్లో విష్ణువు అవతారాలను పొగుడుతుంది. పరమాత్ముణ్ని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్‌ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. చివరి పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి.
చివరి రోజు గోదాదేవి సాలంకృత కన్యగా శ్రీరంగనాథుడి గర్భగుడిలోకి ప్రవేశించి, స్వామిని గానంచేస్తూ అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం. ధనుర్మాసంలో గోదాదేవి రచించిన పాశురాలు వైష్ణవ ఆలయాల్లో గానం చేయడం ఆచారం. తిరుమలలో సైతం ఈ నెలరోజులూ సుప్రభాత సేవలో తిరుప్పావై గానం చేస్తారు. ఆధ్యాత్మిక సాహిత్యంలో తిరుప్పావై ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.
Please subscribe
సూర్యుడిలా సాగిపో!


మనిషై జన్మించాక ఉదర పోషణార్థం అహరహం శ్రమించాలి మానవుడు. ఏదీ తనంత తాను చెంతకు రాదు. శోధించి సాధించాలి. కష్టపడి సంపాదించుకోవాలి. దేహదారుఢ్యం, తెలివి, విజ్ఞత, విచక్షణ పెంచుకుని నియమబద్ధంగా పనిచేస్తూ, ధర్మబద్ధంగా బతకాలి. పదిమందినీ బతికించాలి. పరుగెత్తే కాలంతోపాటు పరుగెడుతూ అలసత్వానికి దూరంగా విధ్యుక్త ధర్మాలను నెరవేర్చాలి. అలా చెయ్యకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పరికించి చూస్తే- ప్రకృతిలో పశుపక్ష్యాదులు, జంతుజాలాలు, వివిధ ప్రాణులు ఆహార సముపార్జన కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. పిపీలికాలు, తేనెటీగలు సైతం మనకెన్నో అంశాలు బోధిస్తాయి. శ్రమించి తేనె పెర(దొంతర)లను ఉత్పత్తి చేసే ఈగలను పొగపెట్టి తరిమి పారదోలినా, అవి ఇంకోచోట తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తాయి. ఆహారాన్వేషణలో తమ మార్గానికెవరైనా అవరోధం కలిగించినా, పట్టించుకోక క్షణకాలం ఆగి మళ్ళీ నడక సాగిస్తాయి పిపీలికాలు. వాతావరణాన్ని అనుకూలం చేసుకొని చెట్లు చిగురిస్తాయి, పుష్పాలు వికసిస్తాయి, ఫలాలు పక్వమవుతాయి. మానవ శరీరం ధరించాక కండల్ని కరిగించి కొందరు శ్రమిస్తే- బుద్ధి, విద్య, తెలివి పెట్టుబడిగా ఇంకొందరు శ్రమిస్తారు. ప్రకృతి శక్తులు అననుకూలంగా ఉన్నా, వాటిని సానుకూలం చేసుకొని కర్షక కార్మికులు రాత్రింబవళ్లు కష్ట పడతారు. ఫలితాన్ని తామొక్కరే అనుభవించక పదిమందికీ పంచు తారు. పనిలోనే పరమాత్మను దర్శిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలుగా నిలిచి అంతులేని ఆనందాన్ని పొందు తారు. వారి నిస్వార్థ, నియమబద్ధ జీవితం మనకాదర్శం.

కొందరు శరీరాన్ని కష్టపెట్టక కబుర్లతో కాలయాపన చేస్తూ బతికేస్తుంటారు. ఇంకొందరు కాలవిలంబన చేస్తూ నేటి పనిని రేపటికి వాయిదా వేస్తారు. నిత్యశంకితులుగా కొందరు తాము చేసే పనులు ఇతరులను మెప్పిస్తాయో లేదోనన్న ధర్మసంకటంలో పడి అసలు ప్రయత్నమే చెయ్యరు. అటువంటి వాళ్లంతా అభివృద్ధి నిరోధకులే. భవిష్యత్తు తరాలను నడిపించే యువత తమ ఉక్కు కండరాలకు, నరాలకు పని కల్పించక, విజ్ఞతకు పదును పెట్టకపోతే లోకం ఏ దిశగా నడుస్తుంది? నిర్ణయాలు త్రుటికాలం ఆలస్యమైనా మానవ జీవితాలకు పెనుముప్పు తప్పదు.
జనాన్ని రక్షించే లోకబాంధవుడైన సూర్యుడు ఎవరి ప్రమేయం లేకుండానే ఉదయిస్తాడు. ఆరోగ్యాన్ని, ఆహారాన్ని మనకందిస్తూ తన పనిని చేసుకుపోతూ వేళ మించగానే నిష్క్రమిస్తాడు. ప్రచండ తేజంతో వేసవిలో సాగే వేళ, ఆ ఉష్ణ తాపాన్ని తాళలేక మనం నిందిస్తాం. శీతగాలులు ఎముకలు కొరికే వేళ త్వరితంగా వచ్చి నులివేడిమినందిస్తే స్తుతిస్తాం. వీటిని పట్టించుకోడు ప్రభాకరుడు. తన పనిలో తాను సాగిపోతాడు. కార్యసిద్ధికి కర్తవ్యోన్ముఖుడిగా మారిన హనుమ, తన గమనంలో విపత్కర స్థితులను సమర్థంగా ఎదుర్కొని అంతులేని విజయాలను సాధించాడు. గేలిచేసినా లెక్కచెయ్యక వీధి  దీపాల కింద చదివి విద్యావంతులైన వారెందరో. కష్టాల సంద్రాలను ఈది ఎవ్వరినీ లెక్కించక విశ్వ విజేతలైన మానవ శ్రేష్ఠులు ఎందరెందరో. చేసే పనిపట్ల అవగాహన, నిబద్ధత, నిజాయతీ, క్రమశిక్షణ కనబరిస్తే విజయం తథ్యం. పని ఎలాంటిదైనా, ఎంతటిదైనా దీక్ష, పట్టుదల ముఖ్యం. ఆటంకం కలిగించే పరిస్థితులను, వ్యక్తులను లెక్కించక, వారి వ్యాఖ్యలకు తల వంచక ధైర్యంగా, స్థైర్యంతో ముందుకు సాగడమే మనిషి కర్తవ్యం.
గోపాలక విద్య


శ్రీకృష్ణుడు మురళీధరుడు. ఆయన నాద వినోదుడు. శ్రావ్యమైన మురళీ నాదంతో జీవరాశులన్నింటినీ మైమరపించి మురిపించాడు. ఆ మురళి వల్లే ఆయన పురాణపురుషుడైనాడని రాగ గోవిందంలో మీరాబాయి కీర్తించింది. వెదురుతో చేసిన పిల్లనగ్రోవిది ఎంత అదృష్టమో కదా... ఆయన అధరాలను తాకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆస్వాదించి రాగాలను సృజిస్తోందని మీరాబాయి గానం చేసింది. అథర్వణ వేదానికి సంబంధించిన కృష్ణోపనిషత్తులో మురళిని గురించిన వివరాలు ఉన్నాయి. ఇది అత్యంత ప్రాచీనమైన వాద్యమని, దీని నుంచి వెలువడే రాగాలను పంచ భూతాలు తమలో లీనం చేసుకొంటాయని కృష్ణోపనిషత్తు చెబుతోంది. ఆదిమజాతి మానవులు సాధు జీవాలను మచ్చిక చేసుకోవడానికి తమ నోటితో రాగయుక్తమైన ధ్వనులు సృజించి వాటికి ఆనందం చేకూర్చేవారట. ఆ తరవాత వెదురు బొంగు నుంచి పిల్లనగ్రోవిని తయారుచేసి రాగ ధ్వనులతో వాటి చెవులకు ఇంపు చేకూర్చేవారని నీలకంఠ శాస్త్రి రాసిన పుస్తకం వేదకాలం నాటి భారతీయ సంస్కృతిని చాటుతోంది.
శ్రీకృష్ణుడు ఆలమందల పోషణలో భాగంగా వేణువును ఊదుతూ వాటిని రంజింప జేసేవాడు. అవి మోరలెత్తి ఆ వేణుగానాన్ని వింటూ ఆహారాన్ని నెమరు వేసుకొంటూ ఆనందాన్ని వ్యక్తం చేసేవి. అథర్వణ వేద విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆవులు సైతం తొమ్మిది రకాల భావావేశపూరిత అనుభూతులకు లోనవుతాయని ఒకటో శతాబ్దానికి చెందిన పలకాప్యుడు, ఆ తరవాతి తరం నాటి శాలిహోత్రుడు పేర్కొన్నారు. నింపాదిగా కూర్చుని ఆహారాన్ని నెమరు వేసుకుంటూ నిమీలిత నేత్రాలతో ఆవు ఉంటే సాంత్వనంతో నిమ్మళంగా ఉన్నదని గుర్తు. ఆవు చెవులు నిటారుగా ఉంటూ రెప్పలార్చకుండా ఉంటే వ్యాకులతతో కూడిన ఒత్తిడిలో ఉన్నట్లు భావిస్తారు. కళ్లు మాటిమాటికీ మూసుకొంటూ కళ్లలో తెలుపు భాగం ఎక్కువగా కనిపిస్తే అది భయంతో శరీరంలో ఎక్కడో నొప్పిని అనుభవిస్తున్నట్లుగా సంకేతం. కళ్లు మూసుకుని నిద్రిస్తున్నట్లుగా ఉంటే ఆవు సేదతీరుతున్నట్లు గోపాలకులు గమనిస్తారు. నడకలో విశ్వాసం, ధైర్యం కనపడితే పశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకొంటారు. అవి తలను నేలవైపు దించి అడుగులు వేస్తుంటే సౌఖ్యంగా లేనట్లు భావిస్తారు. అలా వాటి అవస్థలను గుర్తెరిగి మురళిని శ్రీకృష్ణుడు ఊదేవాడట. ఆలమందలు అలా ఊరట చెందేవి.

సంగీతం తీయని మాటకన్న మధురమైందని సామవేదం చెబుతోంది. గోపాలుడికి పశుపోషణతోపాటు వాటి నైజం బాగా తెలుసునని శ్రీకృష్ణోపనిషత్తు వివరిస్తోంది. ఆహారంతో పాటు శ్రావ్యమైన సంగీతాన్ని ఆవులు ఆస్వాదిస్తాయని నందుడు శ్రీకృష్ణుడికి చెప్పాడంటారు. ఆలమందల అలవాట్లను క్షుణ్నంగా పరిశీలించి వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వేణునాదాన్నే ఎన్నుకున్నాడు మాధవుడు. ఉదయమే ఆవుల పొదుగులు పాలతో నిండి ఉన్నప్పుడు భైరవి రాగాన్ని మధురంగా పిల్లన గ్రోవిపై ఊదేవాడు. ఈ రాగాన్ని వింటూ ఆవులు కడివెడు పాలు ఇచ్చేవట. భైరవి రాగాన్ని వినగానే గోప బాలకులందరూ చద్ది అన్నాలు కట్టుకొని పశువులను వెంటపెట్టుకొని అడవి వైపు వెళ్ళేవారట. పచ్చిక బయళ్లలో మేసి మధ్యాహ్నం ఆవులు తీరికగా కూర్చున్నవేళ మధ్యమావతి పలికించాలంటారు. రాత్రి పశువులు నిద్రించేవేళ హిందోళం చాలా మంచి రాగమని చెబుతారు. శ్రీకృష్ణుడికి, ఆయన వెంట తిరిగే గోప బాలురకు తెలిసిన ఈ విద్యను గోపాలక విద్య అంటారు. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఈ గోపాలక విద్యను పాండవులలో అందరికన్నా చిన్నవాడైన సహదేవుడికి అందించాడని భారతం చెబుతోంది.
వసంత పంచమి

సకల సంపదలకు ఆధారం విద్య. వాక్కు, బుద్ధి, మేధ, ధారణ, శ్రద్ధ, ప్రతిభ, స్ఫురణ వంటి మనోమయమైన అంశాలన్నీ విద్యాపరంగా కీలకమైనవి. లౌకిక విద్యలకు, పారమార్థిక విద్యకు అధినేత్రి- సరస్వతి. జ్ఞానయుతమైన విద్యల సమాహార రూపమే ‘సరస్వతి’ అని వేదం ప్రతిపాదించింది. సర్వత్రా వ్యాపించిన శక్తితత్త్వానికి సరస్వతి అని పేరు. మానవ దేహంలో ‘సోహం’ అనే ప్రాణవాయువు సంచార ప్రక్రియను సరస్వతిగా యోగశాస్త్రంలో వ్యవహరిస్తారు. సమస్త సృష్టిలో తేజరిల్లే జీవకళకి ప్రతిరూపంగా శారదను, శబ్ద బ్రహ్మమయ సప్తస్వర నాదానురక్తికి సంకేతంగా బ్రహ్మరూపాన్ని దేవీభాగవతం దర్శించింది.

ప్రణోదేవీ సరస్వతీ- అంటూ రుగ్వేదం వాణీ వైభవాన్ని కీర్తించింది. సరస్వతీ శాస్త్రమయీ- అని లలితా సహస్రనామావళి స్తుతించింది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి- అనే నాలుగు రూపాల సమష్టి రూపం శ్రీ భారతి. సత్వగుణ శోభితంగా విలసిల్లే సరస్వతిని ప్రకృతిలో ఉత్పాదక శక్తికి ప్రతిఫలనంగా ‘శారదా తంత్రం’ పేర్కొంది. మాఘ శుద్ధ పంచమినాడు అఖిల విద్యా  వరదాయినిగా, జ్ఞానవల్లీ సముల్లాసినిగా సరస్వతి అభివ్యక్తమైందని బ్రహ్మాండ పురాణం ప్రస్తావించింది. బ్రహ్మ సృజించిన జగత్తు ఓ సందర్భంలో పూర్తిగా నిస్తేజంగా, నిశ్శబ్దంగా మారిందంటారు. సృష్టి స్తంభించిపోవడంతో దేవతలు కలవరపడ్డారు. బ్రహ్మను శరణువేడారు. అప్పుడు విరించి, తన దివ్య కమండలంలోని పవిత్ర జలాన్ని భూమిపై చిలకరించాడంటారు. మంత్రపూరితమైన జలం నుంచి బ్రాహ్మీశక్తి ఉద్భవించిందంటారు. రెండు చేతులతో వీణను మోగిస్తూ, మరో రెండు చేతుల్లో అక్షరమాలిక పుస్తకాన్ని ధరించి శ్రీవిద్య అవతరించింది. ప్రణవ బ్రహ్మాత్మకంగా, విజ్ఞాన ఘనరూపిణిగా శ్రీమాత ఆవిష్కారమై లోకాలన్నింటా జ్ఞానదీప్తుల్ని ప్రసరింపజేసింది. సృష్టి నిర్మాణం, నిర్వహణా శక్తులన్నింటిలో సర్వోత్కృష్టమైన మూలకారక శక్తి మహాసరస్వతి అని జగద్గురు ఆదిశంకరులు సౌందర్యలహరిలో శ్లాఘించారు. చంద్రమౌళిగా ఈశ్వరుడు, చంద్రకళాధరిగా సరస్వతి వర్ధిల్లుతూ, ఇద్దరూ చంద్రుణ్ని సిగపువ్వుగా అలంకరించుకున్నారు. మహేశ్వరుడి స్త్రీ రూపమే మహాసరస్వతి అని, ఈశ్వరానుగ్రహం ఉపాసనా సంప్రదాయంలో సరస్వతిగా ఆకృతి దాల్చిందని శివమహిమ్న స్తోత్రంలో పుష్పదంతుడు వెల్లడించాడు.
సూర్య జయంతి

పుణ్యప్రదమైన మాఘమాస సప్తమిని సూర్య జయంతిగా జరుపుకోవడం ఆచారం. సూర్య జయంతి నాడు అర్కపత్రాలు (జిల్లేడు ఆకులు) రేగు ఆకులు శరీరంపై పలుచోట్ల ఉంచుకుని స్నానం చేయడం వల్ల సప్తవిధ పాపాలు హరించుకు పోతాయని శాస్త్ర కథనం. రథసప్తమినాడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడి జీవిత విశేషాలు విన్నా చదివినా మంగళకరమని పెద్దలు చెబుతారు.

పుట్టిన తరువాత గొప్ప పనుల్ని చేసి కొంతమంది ప్రసిద్ధికెక్కుతారు. అద్భుతాల్ని ఆవిష్కరించడానికే కొంతమంది జన్మిస్తారు. సూర్యభగవానుడి జననం అలాంటిదే. కశ్యప మహర్షికి పదముగ్గురు భార్యలు. వారిలో దితి అదితి దనువు అనే ముగ్గురు భార్యలు ప్రధానమైనవారు. దితికి దైత్యులు దనువుకు దానవులు (దైత్యులు దానవులు ఇద్దరూ రాక్షసులే అయినప్పటికీ స్వభావం పరంగా దైత్యుల కన్నా దానవులకు కోపం ఎక్కువ) జన్మించారు. అదితికి సత్వగుణ ప్రధానులైన దేవతలు పుట్టారు.యజ్ఞంలో అర్పించే హవిస్సును స్వీకరించే బాధ్యతను బ్రహ్మదేవుడు దేవతలకు మాత్రమే అప్పజెప్పాడు. చెడు ప్రవర్తన కలిగిన రాక్షసులు హవిర్భాగాలను బలవంతంగా గ్రహించడం మొదలుపెట్టారు. ప్రశ్నించిన దేవతలపై రాక్షసులు ఎదురు దాడి చేసేవారు.తన బిడ్డలకు జరుగుతున్న అవమానాలకు అదితి బాధపడింది. ఒకరోజు ఆకాశంలో ప్రకాశిస్తున్న రవి బింబాన్ని చూస్తూ అనేకరకాలుగా ప్రస్తుతించింది. ఆమె ప్రార్థనలకు సంతోషించిన దివాకరుడు ప్రత్యక్షమయ్యాడు. అదితి ఆనందించి దేవతలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు చెప్పింది. భాస్కరుణ్ని తనకు పుత్రుడిగా జన్మించి శత్రునాశనం చేయమని వేడుకుంది. ప్రభాకరుడు ప్రశాంతచిత్తుడై వరమిచ్చాడు. సూర్యుడి అనుగ్రహం పొందిన సంతోషంతో అదితి అనేక విధాలైన వ్రతాల్ని చేస్తూ ఉపవాసాలు ఆచరించింది. గర్భవతి అయిన అదితి శరీరం ఉపవాసాల కారణంగా క్షీణించింది. కశ్యప మహర్షి తన భార్య పరిస్థితికి కలత చెందాడు. అదితి దగ్గరికొచ్చి కోపంగా ఇలా ఉపవాసాలుంటూ అండాన్ని చంపేస్తావా ఏమిటి అని ప్రశ్నించాడు. రాక్షసుల్ని సంహరించే సంతానాన్ని పొందడానికి ఈవిధంగా చేస్తున్నానని అదితి ఉద్రేకంతో సమాధానమిచ్చింది. కశ్యపుడికీ అదితికీమధ్య వివాదం జరగగా ఆవేదనతో అదితి పిండాన్ని విడిచిపెట్టింది. అందులో నుంచి గొప్ప కాంతి కలిగిన శిశువు బయటికొచ్చాడు. ఆ సమయంలో ఆకాశవాణి ఈ పిల్లవాడు మార్తాండుడుగా ప్రసిద్ధుడవుతాడని పలికింది.కొంతకాలం తర్వాత మార్తాండుడు దేవతలతో కలిసి రాక్షస సంహారం చేసి ప్రాణులన్నిటికీ సంతోషం కలిగించాడు. లోకకల్యాణ కారకమైన ఆ రోజు సూర్య జయంతిగా ప్రశస్తికెక్కింది
గౌరవ మర్యాదలు

ప్రతి మనిషీ గౌరవం కోరుకుంటాడు. మర్యాద మన్ననలు పొందాలనుకుంటాడు. గుర్తింపు లభించగానే ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మెప్పులు, అభినందనలు అందగానే మనసు సంతోషంతో నిండిపోతుంది. అందరూ మెచ్చే ఘనకార్యాలు చేసేందుకు మనసు పురి విప్పుతుంది.

రావాల్సిన సమయంలో గుర్తింపు రాకపోతే జీవనోత్సాహంపై నైరాశ్యపు నీడలు కమ్ముకుంటాయి. అడుగులు ముందుకు వెయ్యడం ఆగిపోతుంది. ఇది మనసు నైజం. అందుచేత దాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. కోరిక నెరవేరలేదని వ్యక్తి మీద లేదా వ్యవస్థ పైనా మనసు అలకబూనుతుంది. అలా చేయడమూ ప్రతీకారం తీర్చుకోవడమే అవుతుంది. అది ప్రాకృతిక ప్రామాణిక సూత్రాలతో కూడిన ధార్మిక (సాధికారిక) జీవన విధానానికి విరుద్ధం.

చప్పట్లు, బహుమానాలు, పథకాలు, పురస్కారాలు ఎదుగుదలను కాంక్షించే ఉత్ప్రేరకాలు. అవి కృషిని కీర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి. మరొకరికి స్ఫూర్తినిస్తాయి. అవి రానంత మాత్రాన కుంగిపోకూడదు.

ఒక చిరునవ్వు, చిన్న పలకరింపు- గౌరవించడం కిందకే వస్తాయి. అవి మనుషుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి. ఒక మహాసభలో ఎందరో మహానుభావులున్న వేదిక మీంచి ఎవరో మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం మీ చెవులకు మధురమైన సంగీతంలా వినిపిస్తుంది. ఆ క్షణాల్లో అమితానందం సొంతమవుతుంది.

రక్త సంబంధీకులు, బంధువులు, ఆత్మీయులు శుభకార్యాల పేరిట మీ ఇంటికి వస్తే, ఇంటిల్లపాదీ ఎదురెళ్ళి ఘన స్వాగతం పలుకుతారు. అది సామూహిక మర్యాద. కొందరు చెమ్మగిల్లిన కళ్లతో హృదయాల్ని తాకుతారు. అది ఆత్మలు పెనవేసుకున్న ఆలింగనం. నేలపై కూర్చున్నవాళ్లు సైతం లేచి నిలబడినప్పుడే వచ్చిన అతిథికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు. ఇదంతా భారతీయ సంప్రదాయంలో ఇప్పటికీ సజీవంగా ఉంది.

ఒక్కోసారి ఎవరి బలం వారికి తెలియదు. అలాంటి సమయాల్లో ప్రాజ్ఞులు, అనుభవజ్ఞులు ముందుకు వచ్చి ‘మనిషి’ అనేవాడు ఎంతటి శక్తిమంతుడో తెలపాలి. అసాధ్యాల్ని సుసాధ్యం చేసే అసామాన్యుడు అని అతడికి ఎరుక చెయ్యాలి.

శ్రీరాముడు సీతమ్మను వెతికే ఘట్టంలో హనుమంతుడి బలం అతడికే తెలియదు. ఆ విషయాన్ని అతడికి ఇతరులు గుర్తుచేశారు. అతణ్ని గొప్పగా పొగిడారు. అది విన్న ఆంజనేయుడిలోని అంతఃచైతన్యం జాగృతమై అతణ్ని ఘనుణ్ని చేసింది. ఊరూరా దేవుణ్ని చేసింది.

‘మనం ధర్మాన్ని కాపాడితే అదే ధర్మం మనల్ని రక్షిస్తుంది’ అని శాస్త్రం చెబుతోంది. ధర్మాన్ని కాపాడటం అనేక రూపాల్లో జరుగుతుంది. అంతరించిపోతున్న కళను కాపాడటం, ఆ కళాకారుల్ని గౌరవించడం అంటే, ఒక విధంగా ధర్మాన్ని కాపాడటమే అవుతుంది. కళల్ని నమ్ముకుని కొంతమంది పేద కళాకారులు అరకొర జీవనం సాగిస్తూంటారు. వారి ముఖాల మీదే రంగులు ఉంటాయి గానీ తెరవెనక వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకుని ఉంటాయి. కాలే కడుపులతో కళను బతికిస్తున్నది వాళ్లే. ఆ కళాపోషణ ఉపరితలం మీంచి చూస్తే కేవలం జీవనభృతి కోసం అన్నట్లుగా అగుపడుతుంది గానీ- ఒక గొప్ప సాంస్కృతిక సంపదను ముందుతరాలకు అందించే సాధికారిక ప్రక్రియగా భావించాలి. అటువంటి కళాకారుల్ని తప్పకుండా గౌరవించాలి