Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
ు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును.

 

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి

 

చతుర్ద శాద్యాయము పద్నాలుగవ రోజు పారాయణముసమాప్తము.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 
కార్తిక పురాణం - 15 వ భాగం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

కార్తీక పురాణము- పదిహేనవ అధ్యాయము

ఓ జనకమహారాజా! తిరిగి కార్తీక మహాత్మ్యమును జెప్పెదను.భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తీకమాసమందు హరిముందర నాట్యము చేయువాడు విగతపాపుడై హరిమందిరనివాసి యగును. ద్వాదశినాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకుబోయి సుఖించును. కార్తీకమాసమున శుక్ల పక్షమందు సాయంకాలమందు హరిని బూజించువాడు స్వర్గాధిపతియగును. కార్తీకమాసమందు నెల రోజులు నియతుగా విష్ణ్వాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును పొందును. సందేహము లేదు. ఈమాసమందు హరి సన్నిధికిబోయి హరిని దర్శించువాడు విష్ణుసాలోక్యముక్తిని బొందును. కార్తీకమాసమందు విష్ణ్వాలయ దర్శనార్థము వెళ్ళనివాడు రౌరవనరకమును, కాలసూత్ర నరకమును పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక ఆరోజున పూజ చేసిన పుణ్యమునకు అంతములేదు. ద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడిభక్తితో హరిని గంధములతోను, పుష్పములతోను, అక్షతలతోను, దూపముతోను, దీపముోను, ఆజ్యభక్ష్యనైవేద్యములతోను బూజించువాని పుణ్యమునకు మితిలేదు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణ్వాలయమునందుగాని, శివాలయమునందుగాని లక్షదీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవ బృందముచేత కొనియాడబడుచు విష్ణులోకమునకు జేరి సుఖించును. కార్తీకమాసము నెల రోజులు దీపమును బెట్టలేనివాడు శుద్ధద్వాదశినాడును, చతుర్దశినాడును, పూర్ణిమనాడును మూడు రోజులు పెట్టవలెను. కార్తీకమాసమందు దేవసన్నిధిలో ఆవుపాలు పితుకునంత కాలము దీపమునుంచిన యెడల పుణ్యవంతుడగును. కార్తీకమాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగుచేసి వెలిగించి వాడు పాపములేని వాడు అగును. కార్తీకమాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములయిన పాపములను నశింపజేసికొనును. ఈవిషయమందొక పూర్వపు కథ గలదు. విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము. పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టిమొదలు పూజానైవేద్యములు లేక జీర్ణమైన విష్ణ్వాలయమొకటిగలదు. కార్తీకస్నానార్ధము కర్మనిష్ఠుడను నొక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరమునకు వచ్చెను. సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని యెంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకుబోయి నూనెదెచ్చి పండ్రెండు దీపపాత్రలను దెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను. యతీశ్వరుడిట్లు చేయుచుండగా కార్తిక శుద్ధ ద్వాదశినాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము జేసి మెల్లగా దీపముల సన్నిధికి జేరెను. ఎలుక వచ్చినతోడనే జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో గూడియున్న పాత్రను జూసి దాని దగ్గరను జ్వాలతో గూడిన వర్తిని జూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసికొని జ్వాలలేని వర్తిని గూడ గ్రహించెు. అంతలో జ్వాలతో యున్న వర్తి సంపర్కము వలన జ్వాలలేని వర్తియు మండెను. రెండును వెలుగగా వేడిచేత నూనె త్రాగుటకు వీలులేక విడిచెను. కార్తిక శుద్ధ ద్వాదశినాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని యెలుక తిరిగి వెలిగించినది. తరువాత పూర్వ పుణ్యవశము చేత ఆరాత్రియే అచ్చటనే మృతినొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారియాయెను. అంతలోనే యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుని జూచెను. చూచి నీవెవ్వడవు. ఇచ్చటికెందుకు వచ్చితివి అని యడిగెను. ఆమాటవిని ఉద్భూతపురుషుడు తిరిగి యతితో ఇట్లనియె. పాపరహితా! నేను ఎలుకను. గడ్డిలో గింజలను భక్షించుదానను. నిత్యము ఈదేవాలయమందుండు దానను. ఎలుకనై యున్న నాకిపుడు దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇది యే పుణ్యముచేత గలిగినదో నాకు తెలియదు. పూర్వమందు నేనెవ్వడను? ఏమి పాపమును జేసితిని? ఏపాపము చేత ఈమూషకత్వము నాకు ప్రాప్తించినది? ఈవిషయమంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగియున్నారు. మీకు నేను దాసుడను. శిష్యుడను. దయకు పాత్రుడను. ఆమాటవిని యతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భూతపురుషునితో ఇట్లని చెప్పదొడగెను. యతి ఇట్లనెను. ఓయీ! నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు. బ్రాహ్మణుడవు. నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు. బాహ్లికుడను పేరు గలవాడవు. స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును జేయుచు వివేకములేక బ్రాహ్మణులను నిందించెడివాడవు. దేవపూజలను వదలి నిత్యము శ్రాద్ధ భోజనమును దినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రింబగళ్ళు భుజించుచున్నవాడవు. స్నాన సంధ్యావందన తపస్సులను జేయువారిని చూచి నవ్వుచు నిందించువాడవు. నీకు సుందరియైన భార్యయుండెడిది. ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్రస్త్రీని ఇంటివద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దానిచేత అన్నమును బెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు, పాలు, నెయ్యి అమ్ముకొనియు ధనార్జనపరుడవై యుంటివి. ఈప్రకారముగా బహు ద్రవ్యమును సంపాదించి ఆద్రవ్మును భూమియందు ద
ాచి చివర మృతినొందితివి. ఇట్టి పాతకములచేత నరకమనుభవించి తిరిగి భూమియందు మూషకముగా జన్మించి ఈదేవాలయమందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి. దైవవశమువలన ఈదినమందు నాచేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి.గనుక ఆపుణ్యముచేత మూషకత్వము పోయి దివ్య రూపము గలిగినది. ఇక హరభక్తి గలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉందువు. ఈప్రకారముగా యతిచెప్పిన మాటను విని ఉద్భూతపురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞతీసుకొని పాపములను నశింపజేయు సరస్వతీ నదికిబోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ యీ మూడు దినములందు స్నానము చేసి ఆమహిమచేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును జేసి తన్మహిమవలన అంతమందు సాయుజ్యముక్తిబొందెను. కాబట్టి కార్తీకశుద్ధి ద్వాదశినాడు భగవత్పరాణుడై పాపముక్తుడై సాయుజ్యపదము పొందును.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే పంచదశాధ్యాయస్సమాప్తః
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కార్తిక పురాణం - 16 వ భాగం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు బ్రీతికరమైన ఈకార్తిక వ్రతమును జేయనివాడు కల్పాంతము వరకు నరకమొందును. కార్తికమాసము నెలరోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీకమాసమందు నెలరోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకొనును. వైకుంఠమునకు బోవును. కార్తికమాసమందు పూర్ణిమనాడు సంతానమును గోరి సూర్యునుద్దేశించి స్నానము దానము చేయవలెను. అనగా అట్లు చేసినయెడల సంతానము గలుగునని భావము. కార్తికమాసమందు హరిసన్నిధిలో టెంకాయదానమును దక్షిణతాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు. రోగము ఉండదు. దుర్మరణము ఉండదు. కార్తికమాసమందు పూర్ణిమనాడు హరి ఎదుట స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతియగును. కార్తికమాసమందు హరిసన్నిధిలో స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతి యగును. కార్తికమాసమందు హరిసన్నిధిలోకి స్తంభదీపము అర్పణచేసిన వానికి గలిగెడి పుణ్యమును జెప్పుటకు నాతరముగాదు. కార్తికమాసమందు పూర్ణిమరోజున స్తంభదీపమును జూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్లవలె నశించును. కార్తికమందు స్తంభమును సమర్పించినవాడు నరకమునుండు విడుదలగాడు. స్తంభదీపమును శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను.శిలతోగాని, కర్రతో గాని స్తంభమును జేయించి దేవాలయము ఎదుట పాతిదానిపైన దీపమును బెట్టువాడు హరికి ప్రియుడగును. ఈస్తంభవిషయమై పూర్వకథ గలదు. చెప్పెదను వినుము. మతంగమహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి గలదు. అందొక విష్ణ్వాలయము గలదు. ఆయాలయముచుట్టును వనముండెను. కార్తీకవ్రత పరాయణులై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువును షోడశోపచారములతోను మాసమంతయును బూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి. వ్రతములు చేసిరి. అందులో ఒక ముని యిట్లు పలికెను. మునీశ్వరులారా వినుడు. కార్తికమాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసియగును. కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును బెట్టుదము. ఈదినము కార్తికపూర్ణిమ అయి ఉన్నది. ఈదినము సాయంకాలము స్తంభదీప దానము హరికత్యంత ప్రియము. స్తంభమును జేయించి కార్తికమాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దానియందు దీపమును బెట్టువారి పాపములు నశించి వైకుంఠలోకమును పొందెదరు. వారందరు ఆమాటవిని స్తంభదీపమును సమర్పించుట యందు ప్రయత్నము జేసిరి. ఓరాజా! ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును జూచిరి. కార్తికవ్రత సముత్సాహులైన వారందరు కలసి ఆస్థాణువునందు శాలివ్రీహితిలసమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పికొనుచుండిరి. ఆసమయమున దేవాలయము ఎదుట చట చట అనే శత్బములు గలిగి స్తంభదీపము నశించి అందరు చూచుచుండగనే ఆస్థాణువంతయు పగిలి భూమియందు పడెను. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలెను. అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయమునుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమొంది అయ్యో అయ్యో యని ధ్వనిచేయుచుయొక పురుషునిచూసి ఇట్లనిరి. ఓయీ! నీవెవ్వడవు? ఏ దోషముచేత మొద్దుగా నున్నావు? ఆవిషయమునంతయు త్వరగా చెప్పుము. ఓ బ్రాహ్మణోత్తములారా! నేను పూర్వమందు బ్రాహ్మణుడను. రాజ్యమును పాలించువాడను, ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు గలిగియు దయాశూన్యుడనై దుష్ట వర్తనగల వాడనైతిని. నేను వేదశాస్త్రములను జదువలేదు. హరిచరిత్రను వినలేదు. తీర్థయాత్రకు పోలేదు. స్వల్పమైన దానము చేయలేదు. దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమునందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయ కాములు అగు బ్రాహ్మణులను నాముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండువాడును, వారికెన్నడును ఎదుర్కొని నమస్కారములు చేయలేదు. వారి ఇష్టార్థములను ఇవ్వనూలేదు. సర్వకాలమందు వారెకెన్నడును ఏదానమును యివ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక తప్పనియెడల ధనములేకుండ ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి యుండలేదు. శాస్త్రశ్రవణ సత్స్వభావసంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించు వారు. అప్పుడు సరే యిచ్చెదనని చెప్పుటయే గాని యిచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును బుచ్చుకొని స్వకార్యములను జేసికొనువాడను. మరల వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండెడివాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆదుష్కృత కర్మచేత చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించితిని. తరువాత భూమికి వచ్చి ఏబది రెండువేల మారులు కుక్కగా జన్మించితిని. అనంతరము పదివేల మారులు కాకిగా బుట్టితిని. ఆవల పదివేల మారులు తొండగా జన్మించితిని. పిమ్మట పదివేల మారులు పురుగుగా నుండి మలాశినైయుంటిని. ఆతరువాత కోటి మారులు వృక్షముగా నుంటిని. చివరకు కోటి మారులు స్థాణువుగా కాలము గడుపుచుంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు గాన సర్వభూతదయావంతులగు మీరు చెప్పు
దురు గాక. మీదర్శనము వలన నాకు జాతిస్మృతి గలిగినది. ఓ మునీశ్వరులారా నా పూర్వపాపమిట్టిదని పలికి వాడూరకుండెను. మునీశ్వరులిట్లు విని వారిలో వారు యిట్లు చెప్పుకొనసాగిరి. కార్తికమాసఫలము యథార్థమయినది. ప్రత్యక్ష మోక్షమిచ్చునది. రాతికి కొయ్యకు గూడ మోక్షమిచ్చినది. అందును ఈపూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయును.ఆ పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తిక పూర్ణిమనాడు పరులచే ఉంచబడిన దీపమువలన ఎండిన మొద్దు ముక్తినొందెను. మొద్దయినను కార్తికమాసమందు దేవసన్నిధిలో దీపమును పెట్టినయెడల పాపమునశించి దయాళువయిన దామోదరుని చేత మోక్షమొందించబడినది. ఇట్లు వాదమును జేయి వారితో ఉద్భూతపురుషుడు తిరిగి యిట్లనియె. జ్ఞానవేత్తలయిన మునీశ్వరులారా! దేనిచేత మోక్షము కలుగును? దేనిచేత బద్ధుడగును? దేనిచేత ముక్తుడగును? దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు గలుగును? మోక్షప్రాపకమైన జ్ఞానమెట్లుగలుగును? ఈ సర్వమును నాకు జెప్పుడు. వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీరసమునిని వానికి సమాధానము జెప్పుమని నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షోడశాధ్యాయస్సమాప్తః
కార్తిక పురాణం - 17 వ భాగం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

కార్తిక పురాణము - పదిహేడవ అధ్యాయము 

అంగీరసుడిట్లనెను. ఓయీ! కర్మబంధముక్తులు, కార్య కారణములు. స్థూల, సూక్షమములు, ఈజంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన యీవిషయము పూర్వమందు కైలాసపర్తమున పార్వతికి శంకరుడుజెప్పెను. దానిని ఇప్పుడు నీకు నేను జెప్పెదను. ఇతర చింతనుమాని వినుము. నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెడను వినుము. జీవుడనగా వేరెవ్వడును లేడు. నీవే జీవుడవు. నేను యెవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను. ఇందుకు సందేహము లేదు. దేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. ఉద్భూతపురుషుడిట్లడిగెను. మునీశ్వరా! మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు గలుగలేదు. కనుక అహంబ్రహ్మేతి(నేను బ్రహ్మనను) వాక్యార్థమును ఎట్లు తెలిసికొనగలను. ఈవాక్యార్థ బోధకు హేతువయిన పదార్థజ్ఞానము నాకు తెలియలేదు. కాబట్టి విమర్శగా చెప్పగోరెదను.ఆత్మ అంతఃకరణమునకు, తద్వ్యాపారములకు సాక్షియు, చైతన్య రూపియు, ఆనందరూపియు, సత్య స్వరూపమునై ఉన్నది. ఇట్టి ఆత్నము నీవెందుకు తెలుసుకొనుట లేదు. సచ్చిదానంద స్వరూపుడును, బుద్ధికి సాక్షియునయిన వస్తువునే ఆత్మగా తెలిసికొనుము. ఈదేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. దేహము ఘటమువలే రూపము గల్గిన పిండము గనుక ఇది ఆత్మగాదు. ఇదిగాక ఈదేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలనబుట్టినది. గనుక దేహము వికారము కలది ఆత్మగాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలిసికొనుము. అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు, ఆత్మవస్తువులు కావు. దేహేంద్రియాదులన్నియు ఎవరి సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని=ఆత్మయని తెలిసికొనుమని భావము. లోపలికి మలచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుముకు అయస్కాంతమణి వలె తాను వికారిగాక బుద్ధ్యాదులను చలింపజేయునది ఏది కలదో అది నేను=ఆబ్రహ్మనని తెలిసికొనుము. ఎవనియొక్క సాన్నిధ్యమాత్రముచేత జడముైన-కదలికలేని దేహేంద్రియమనః ప్రాణములు జన్మలేని ఆత్మవలె కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆబ్రహ్మను నేను అని తెలిసికొనుము. ఎవ్వడు వికారిగాక సాక్షియై స్వప్నమును, జాగరమును, సుషుప్తిని, వాటియొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలిసికొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలిసికొనుము. ఘటమును ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటముకంటే భిన్నమో అట్లుగానే దేహాదులను బ్రకాశింపజేయు బోధరూపుడైన నేను జాత్మ అని తెలిసికొనుము. ఎవ్వడు సర్వప్రియుడై నీయొక్క పుత్రమిత్ర ప్రియప్రియాది భావములను ద్రష్టగా జూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలిసికొనుము. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని యెరుగుము. సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికారియగుట ఆత్మకే గలవు. దేహేంద్రియ మనః ప్రాణాహంకారములకంటే వేరయిన వాడును ౧. పుట్టుటా=జనిమత్వ, ౨. ఉండుట=అస్తిత్వం, ౩. వృద్ధిగతత్వ=పెరుగుట, ౪. పరిణామత్వ=పరిణామము చెందుట, ౫. కృశించుట, ౬. నశించుట ఈ యారు వికారములు లేనివాడు. వికారములు ఈఆరు భావాలు లేనిది బ్రహ్మ. త్వం పదార్థముు ఇట్లునిశ్చయించుకొని వ్యాపించు స్వభావము చేత సాక్షాద్విధిముఖముగాను తచ్ఛబ్దార్థమునుజ్ దెలిసికొనవలయును.

శ్లో. అతద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విధిముఖేనచ!
వేదాంతానాం ప్రవృత్తిస్స్యాత్ ద్విరాచార్య సుభాషితమ్!!

తచ్ఛబ్దమునకు బ్రహ్మ అర్థము. ఆతచ్ఛబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్ధము. వ్యావృత్తియనగా ఇదిగాది ఇదిగాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదిది బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలిది బ్రహ్మయని భావము. సాక్షాద్విధిముఖమనా సత్యం జ్ఞానమనంతంబ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్యజ్ఞానానంద స్వరూపుడని తెలిసికొనవలును అని భావము. ఆత్మ సంసారలక్షణ విశిష్టముగాదనియు, సత్య స్వరూపనియు, దృష్టిగోచరముగాదనియు, తమస్సుకు పైదనియు అనుపమానందరూపమనియు, సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు, పరిపూర్ణమనియు చెప్పబడును. ఆతద్వ్యావృత్తి రూపముగాను, సాక్షాద్విధిముఖముగాను తెలిసికొనదగిన ఆత్మస్వరూపము ఇదియేనై అర్ధము. వేదములచేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు, సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో వాకే నేనని తెలిసికొనును. మృత్తికాది దృష్టాంతముల చేత ఏక వస్తుజ్ఞానము చేత సర్వవిజ్ఞానము దేనిచే కలుగునని శ్రుతులందు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలిసికొనుము. నేననునదియు బ్రహ్మయనునదియు ఒకే అర్థము కలిగినవి.

వేదములందు ఎవ్వనికి "తదనుప్రవిశ్య" ఇత్యాది వాక్యములచేత జీవాత్మరూపముచేత ప్రాణులందు ప్రవేశమున్ను, ఆజీవులను గురించి నియంతృత్వమున్ను జెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. వేదములందు ఎవ్వనికి కర్మఫలప్రదత్వము, జీవకారణకర్తృత్వము జెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. ఈప్రకారముగా "తత్, త్వం" అను పదములు రెండును నిశ్చయించబడివి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు, అనగా నీవె బ్రహ్మవని భావము చెప్పబడినది. ముందు వాక్యార్థమును జెప్పెదను. వాక్యార్థమనగా తత్త్వం పదములకు ఐక్యము=ఏకత్వము చెప్పబడును. ప్రత్యగాత్మయే అద్వయానందరూప పరమాత్మ. పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈప్రక
ారముగా అన్యోన్యతాదాత్మ్యము ఎప్పుడు అనుభవమున గలుగునో అప్పుడే త్వం పదమునకు అర్ధము తెలియును. బ్రహ్మగాదను భ్రాంతి నశించును. తాదాత్మ్యమనగా అదియే ఇదియని అర్థము అనగా ఐక్యము. తత్త్వమసి అనా తత్, త్వమ్, అసి, ఈవాక్యార్థమునకు తాదాత్మ్యము చెప్పవలెను. అప్పుడు వాచ్యార్థములయిన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ విశిష్టులయి జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములై జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించినయెడల తాదాత్మ్యము సిద్ధించును. ముఖ్యార్థముకు బాధగలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను. ఈలక్షణావృత్తి మూడు విధములు. అందులో యిచ్చటభాగలక్షణను గ్రహించవలెను. అనగా కొంత పదము విడిచి కొంతపదము స్వీకరించుట భాగలక్షణయనబడును. తత్త్వమసియందు సర్వజ్ఞత్వకించిజ్ఞత్వములను వదలి కేవల జ్ఞానాత్మత్వ మాత్రమునే గ్రహించినయెడల అభేదము సంభవించును. తత్=అది, త్వం-నీవు, అసి=అయితివి. అనగా నీవే బ్రహ్మవైతివని భావము. సో యందే వదత్త ఇత్యాది స్థలమందును యిట్లే బోధచేయబడును. తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివైచిన దేవదత్తుడొక్కడే భాసింును. అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదలి కేవల జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాసించును. నేను బ్రహ్మనను వాక్యార్థ బోధ స్థిరపడువరకు శమదమాది సాధనములు చేయుచు శ్రవణమనననిదిధ్యాసలను ఆచరించవలెను. ఎప్పుడు శ్రుతిచేతను, గురుకటాక్షముచేతను తాదాత్మ్యబోధ స్థిరపడునో అప్పుడు సంసారమూలము నశించును. కొంతకాలము మాత్రము ప్రారబ్ధకర్మ అనుభవింపుచుండి ప్రారబ్ధక్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదమొంది నిరతిశయానందముతో ఉండును. కాబట్టి ముందు చిత్త శుద్ధికై కర్మను జేయవలెను. ఆకర్మవిధినంతయు గురువువలన దెలిసికొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగతపాపుడై తరువాత ఆపుణ్యముచేత మంచిజన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞానియై కర్మబంధమును తెంచుకొని మోక్షమొందుదువు. ఇందుకు సందేము లేదు.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే సప్తదశాధ్యాయస్సమాప్తః
కార్తిక పురాణం - 18 వ భాగం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

కార్తిక పురాణము - పద్దెనిమిదవ అధ్యాయము

ఉద్భూతపురుషుడిట్లనెను. మునీశ్వరా! నేననుగ్రహించబడితిని. నీదర్శనముయొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని. ఓమునివర్యా! నాకు నీవే తండ్రివి. నీవే సోదరుడవు. నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాగ గతి ఎవ్వరయిరి. పాపవంతుడైన నేనెక్కడ. ఇట్టి సద్గతి యెక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ. పుణ్యమైన కార్తీకమాసమెక్కడ? ఈమునీశ్వరులెక్కడ, ఈ విష్ణుసన్నిధి ఎక్కడ. ప్రారబ్ధ సుకృతమున్నయెడల తప్పక ఇట్లు ఫలించునుగదా? నాకెద్దియో పూర్వపుణ్యమున్నది. దానిచే ఇట్లింతయు లభించెను. అయ్యా! నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము. మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు? ఆకర్మలకు ఫలమెట్లు గలుగును? వాటి ఉపదేశమెట్లు, చేయుటకు ముఖ్యకాలమెద్ది? కర్మలెవ్వి? ఏమి కోరి చేయవలెను? ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము. నీవాక్కును వజ్రాయుధముచేత నాపాప పర్వతములు కూలినవి. అంగీరసుడు పల్కెను. ఓయీ! నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెదవినుము. అనిత్యమైన ఈదేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖదుఃఖాది ద్వందములు లేవు. అవి దేహాది ధర్మములైనవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మనుజేయవలెను. దానితో చిత్తశుద్ధిగలిగి తద్ద్వారా జ్ఞానమునుబొంది దానిచేత ఆత్మను యథార్ధముగా తెలిసికొనవలెను. దేహధారియయినవాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలనుభక్తితో విధిగా చేయవలెను. అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయును. వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏకర్మ చెప్పబడినదో విచారించి తెలిసికొని తరువాత చేయవలెను. స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండువలె నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతఃస్నానము వేదోక్తమైయున్నది. నిరంతరము ప్రాతఃస్నానమాచరించలేనివాడు తులా సంక్రాంతి యందుకార్తీకమాసమందును, మకరమాసమందును, (మేష) వైశాఖమందును స్నానము చేయవలెను. ఈమూడు మాసములందును ప్రాతఃకాలమందు స్నానము చేయు వాడు వైకుంఠమునకు బోవును మరియు వానికి ఉత్తమగతి గలుగును. చాతుర్మాస్యాది ;పుణ్యకాలములందును, చంద్రసూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహణకాలమందే స్నానము ముఖ్యము. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది. ౧. స్నానము ౨. సంధ్యాజపము ౩. హోమము ౪. సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానమాచరించనివాడు రౌరవనరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తికమాసము ఈకార్తికము ధర్మార్థకామ మోక్షములనిచ్చును. ఈకార్తికముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన శాస్త్రములేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు. భార్యతో సమానమైన సుఖము లేదు. ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు. నేత్రముతో సమానమైన జ్యోతిస్సులేదు. కేశవునితో సమానమైన దేవుడు లేడు. కార్తికమాసముతో సమానమయిన మాసము లేదు. కర్మ స్వరూపమును దెలిసికొని కార్తికమాసమందు ధర్మములను జేయువాడు కోటి యజ్ఞలమును బొంది వైకుంఠమందుండును.

ఉద్భూతపురుషుడడిగెను. అయ్యా! చాతుర్మాస్య వ్రతని పూర్వము చెప్పియున్నారు. అది పూర్వము ఎవనిచేత చేయబడినది? ఆవ్రతవిధి ఎట్లు? ఆవ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందెడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏలోకమునకు పోవును? ఈ విషయమంతయి సవిస్తారముగా చెప్పుము. అంగీరసుడిట్లు పల్కెను. ఓయీ! నీవు ఈమనుష్యులకు బంధువవు నీ ప్రశ్నలన్నియు లోకోపకారార్థములుగా ఉన్నవి. సమాధానమును జెప్పెదను. సావధానుడవై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో గూడా ఆషాఢ శుక్ల దశమిదినంబున పాలసముద్రమందు నిద్రయను వంకతో శయనించును. తిరిగి కార్తికశుక్ల ద్వాదశిరోజున లేచును. ఇది చాతుర్మాస్యము. అనగా నాలుగు మాసములు చేయువ్రతము. ఈనాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చునవి. అనగా హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును. విష్ణువునకు నిద్ర సుఖమిచ్చునది గనుక యిది పుణ్యకాలము.ఈపుణ్యకాలమందు హరి ధ్యానించువాడు విష్ణులోకమును బొందును. ఈనాలుగు మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములగును. దీనికి కారణమును జెప్పెదను వినుము. ఈవిషయమందు నారదునకు హరిచెప్పినదొక కథయున్నది. పూర్వము కృతయుగమందు వైకుంఠోకంబున హరి లక్ష్మితో గూడ సింహాసనమందు కూర్చుండి సుర కిన్నర ఖేచరోరగగణములచేతను, స్వగణభృత్యుల చేతను సేవింపబడుచుండెను. హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును గూర్చివచ్చెను. నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు గలిగి పద్మపురేకుల వంటి నేత్రములఓ ప్రకాశించెడి విష్ణుమూర్తిని జూచెను. చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదులకు మ్రొక్కెను. హరియు నారదుని జూచి నవ్వుచు తెలియని వానివలె ఇట్లనెను.

ఓ నారదా! నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా? ఋషుల ధర్మములు బాగుగానున్నవా? ఉప
ద్రవములు లేకున్నవా? మనుష్యులు వారి వారి ధర్ములందున్నారా? ఈవిషయమంతయు ఈసభలో జెప్పుము. నారదుడు ఆమాటను విని ఆనందించి నవ్వుచు హరితోనిట్లనియె. ఓ స్వామీ! నేను భూమినంతయు తిరిగిచూచితిని. వేదత్రయమందు జెప్పబడిన కర్మమార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి. తమ తమ కర్మలను యావత్తు విడిచి యుండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు దెలియకున్నది. కొందరు తినగూడని వస్తువులను తినుచున్నారు. కొందరు వ్రతములను విడిచినారు. కొందరు ఆచారవంతులుగానున్నారు. కొందరు అహంకార వర్జితులుగా నున్నారు. కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు. కొందరు నిందజేయువారుగా నున్నారు. కాబట్టి ఓ దేవా! ఏదయినా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము. నారదుని మాట విని భక్తవత్సలుడు, సమస్త లోక పాలకుడును అయిన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధబ్రాహ్మణ రూపధారియై వేల సంఖ్యగల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా నాటకధారియై పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వతములందును, అరణ్యములందును, ఆశ్రమములందును, సమస్త భూమియందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని జూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను జేసిరి. కొందరు నవ్విరి. కొందరు నమస్కారము చేయరైరి. కొందరు అభిమానవంతులైరి. కొందరు గర్వముతో ఉండిరి. కొందరు కామాంధులై యుండిరి. కొందరాయా క్రియాకలాపములను మానిరి. కొందరు ఏకవ్రతపరాయణులైయుండిరి. కొందరు నిషిద్ధ దినములందు అన్నమును దినువారుగా నుండిరి. కొందరు ఏకాదశ్యు[అవాసమాచరించని వారుగా నుండిరి. కొందరు తినగూడని వస్తువులను దినుచుండిరి. కొందరాచారవంతులుగానుండిరి. కొందరాత్మచింతజేయుచుండిరి. బ్రాహ్మణ రూపధారియైన భగవంతుడు అట్టివారిని జూచి మంచి మార్గమునకు దెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిశారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను. వచ్చి బ్రాహ్మణరూపమును వదలి పూర్వమువలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోను, స్వభక్తులతోను గూడి ప్రకాశించుచుండెను. అచ్చటనుండు జ్ఞానసిద్ధులు మొదలయిన మునులు వైకుంఠమునుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టివాడును అవిసెపువ్వుతో సమానమైన కాంతి గలవాడును, మెరుపువంటి వస్త్రము గలవాడును, కోటి సూర్య ప్రభాభాసమానుడును, మకరకుండల విరాజితుడును, అనేక రత్నగ్రధిత కిరీట ప్రకాశమానుడును, అనేక సూర్య కాంతింతుడును, మనోవాచామగోచరుడును, దేవతాపతియును, స్వయంభువును, ప్రసన్నుడును, అధిపతియును, ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని జూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్యసుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి. వచ్చి హరి పాదములము నమస్కారము చేసి వారిముందర నిలిచి అంజలిబద్ధులై హరిని వక్ష్యమాణరీతిగా స్తుతించిరి.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే అష్టాదశాధ్యాయస్సమాప్తః
కార్తిక పురాణం - 20 వ భాగం

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
కార్తిక పురాణము - ఇరవై అధ్యాయము

జనకమహారాజు మరల ఇట్లడిగెను. మునీంద్రా! సర్వపాపములను నశింపజేయునదియు, సౌభాగ్యప్రదమగు కార్తిక మహాత్మ్యమును మరియు వినవలెనను కోరిక కలదు గాన చెప్పుము. వశిష్టముని పల్కెను. రాజా! వినుము. కార్తిక మహాత్మ్యమును గురించి అగస్త్యమునికిని, అత్రిమహామునితో జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరమయినది దానిని నీకు చెప్పెదను. అత్రిమహాముని ఇట్లు పల్కెను. అగస్త్యమునీంద్రా! లోకత్రయోపకారము కొరకు కార్తిక మహాత్మ్యబోధకరమైన హరికథను జెప్పుదను వినుము. అగస్త్యుడడిగెను. విష్ణ్వంశ సంభూతుడవైన యో అత్రిమునీశ్వరా! సద్ధర్మ శ్రవణమున కార్తికమాసము కీర్తించబడినది. కార్తికమాస ధర్మమును వినగోరితిని గాన చెప్పుము. అత్రిముని ఇట్లు చెప్పెను. ఓ అగస్త్యమునీంద్రా! బాగు బాగు. నీ ప్రశ్న పాపనాశకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము జేసితివి. చెప్పెదను వినుము. కార్తికమాసముతో సమానమైన మాసము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమయిన దేవుడు లేడు. కార్తికమాసమందు స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్ధమును బొందును. విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ఠ, లక్ష్మి, విజ్ఞానము, సర్వత్ర విజయము పొందుదురు. ఈవిషయమును గురించి పూర్వచరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు, సూర్యవంశసంభూతుడు పురంజయుడను ఒకరాజు గలడు. ఆపురంజయుడు కొద్దికాలము ధర్మమార్గమందు ప్రవర్తించి తరుాత ఐశ్వర్యవంతుడై బుద్ధినశించి దుష్ట పరాక్రమయుక్తుడై మహాశూరుడై సత్యమును, శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియును హింసకుడునునై బంగారమును దొంగిలించువారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడియుండెను. రాజు యీప్రకారముగా అధర్మ పరాయణుడు కాగా అతని సామంత రాజులు, కాంభోజ, కురురాజాదులు అనేకమంది సింహబలులతో గూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్యాపట్టణము చుట్టును చెరకు పానకమునకు తేనెటీగలవలె శిబిరాలతో చుట్టుకొనిరి. పురంజయుడు విని శీఘ్రముగా చతురంగబలములతో పట్టణము నుండి బయటకు వచ్చెను. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో, ధ్వజముతో, స్వయం ప్రకాశమానమును, అనేక దిగ్విజయములను జేసినదియు, శస్త్రాస్త్ర పూరితమును, మహాచక్రయుతమును, మంచి గుర్రములతో గూడినదియునైన సూర్యదత్త రథమునెక్కి గజ, రథ, తురగ, పదాతులనెడి, చతురంగబలముతో పురద్వారమునుండి శత్రు సైన్యములో ప్రవేశించి భేరీతూర్య నినాదములను, శంఖ గోముఖ నాదములను ధనుష్టంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడువలె ధ్వనిచేయించెను.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే వింశాధ్యాయస్సమాప్తః
కార్తిక పురాణం - 21 వ భాగం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

కార్తిక పురాణము - ఇరవై ఒకటో అధ్యాయము 

ఇట్లు యుద్ధమునకు పురంజయుని జూచి యుద్ధ ప్రవీణులయిన ఆ రాజులు కోప రక్తాక్షులై శస్త్రములతోను, అస్త్రములతోను, బాణములతోను, వాడియైన గుదియలతోను, ఇనుపకట్ల లాటీ కర్రలతోను, హస్తాయుధములయిన గుదియలతోను, కత్తులతోను, భల్లాతకములతోను, పట్టసములతోను, రోకళ్ళతోను, శూలములతోను, తోమరములతోను, కుంభాయుధములతోను, గొడ్డళ్ళతోను, కర్రలతోను, ఆయుధముల విక్షేపములతోను, యుద్ధము చేసిరి. గుర్రపురౌతులతో గుర్రపు రౌతులు, ఏనుగులు ఏనుగుల తోడను, రథికులతో రథికులు, కాల్బంటులతో కాల్బంటులు, శూరులతో శూరులును, ఆయుధములతో యుద్దమును భటులనన్యోన్యము క్రూరవాక్యములను పలుకుచు చేసిరి. 

ఓ అగస్త్య మునీంద్రా! అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలపరచికట్టికొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడువందల బాణముల వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును, ధ్వజమును, రథమును నరికినవి. తరువాత కాంభోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి అయిదు బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను జంపెను. తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వాలే విక్రమించి భుజాస్ఫాలనము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంభోజుని హృదయమందు కొట్టెను. పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వాలే పోయి కాంభోజ రాజు హృదయమును భేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు.
సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంభోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనుస్సునందు గూర్చి పురంజయునితో యిట్లనియె.

క్షత్రియా! వినుము. నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మునందాసక్తి గలవాడను కాను. ఇట్లు పలికి కాంభోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారధిని, ఛత్రమును వాని ధనుస్సును త్రుంచినవి. పురంజయుడు మరియొక ధనుస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో గూడిన బాణములను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంభోజునితో ఇట్లనియెను. రాజా! శూరుడువౌదువు గాని యుద్ధమందు ధైర్యముతో నుండుము. నాచేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు. నీవంటి నీచులకు ప్రతిదాన విధి తెలియునా? నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువదింటిని ఇచ్చుచున్నాను.
ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంభోజుని కవచమును ద్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి.
అప్పుడు భయంకరమయిన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులూడి పాదములు మొండెములై మేడలు విరిగి భూమియందు పడిరి.

అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి. గుర్రముల తోకలు తెగినవి. కాల్బంటులు హతులైరి. రథములు చక్రములతో సహా చూర్ణములాయెను. కొందరు తొడలు తెగి నేలబడిరి. కొందరు కంఠములు తెగి కూలిరి. బాణముల చేత శరీరమంతయు గాయములు పడినయొకభటుడు ధనుస్సును ధరించి నారి బిగించి అన్య భటునితో యిట్లనియె. తిరుగు వెనుకను తిరుగు, నాముందుండు ఉండుము. నీ వీపును నాకు చూపకుము. నీవు శూరుడవు కదా, ఇట్లు చేయవచ్చునా? ఓ మునీ ఇట్టి నిష్ఠురములగు మాటలను విని ప్రతి భటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకార ధ్వని జేయుచు సింహగర్జనములను చేయుచు బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించెను. ఆకాశమందుండి చూచెడి దేవతలు బాణములు తూణీరములనుండి తీయుటను, అనుసంధించి వేయుటను గుర్తించ లేరైరి. బహునేర్పుతో బాణములను వేయుచుండిరి. ఆయుద్ధమందు సూదిదూరు సందులేకుండా బాణవర్షము కురిసెను. ఇట్లన్యోన్యము శూరులను, భటులను బంగారపు కట్లతో గూడినవియు, స్వయముగా వాడియైనవియు, సానపెట్టబడినవియు, స్వనామ చిహ్నితములు అయిన అర్థ చంద్ర బాణములతోను, ఇనుప నారాచములతోను, ఇనుప అలుగులు గల బాణములతోను, ఖడ్గములతోను, పట్టసములతోను, ఈటెలతోను కొట్టుకొనిరి. గుర్రపురౌతులు కొందరిని చంపిరి. గుర్రపు రౌతులను ఏనుగు బంట్లు చంపిరి. రధికులు కాల్బంట్లను జంపిరి. కాల్బంట్లు రథికులను జంపిరి. ఇట్లు తొడలు, భుజములు, శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తురుతో యొకనది ప్రవహించెను. ఆకాశమందు మేఘాచ్చాదితలైన అప్సర స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడునావాడు, వీడు నావాడని పలుకుచుండగా శూరహతులయిన శూరులు యుద్ధమందు మృతినొంది దివ్యాంబరధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు బోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుబడుచుండిరి. యుద్దమందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకుని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వాప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు బోవుదురు. కాంభోజుడు మొదలగు రణకోవిదులైన శూరులచేతను, ఇతర రాజుల చేతను, సుభటులచేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికి ఒళ్ళు గగుర్పొడిచినది. ఇట్టి యుద్దమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను. రాజులును యుద్ధభూమిని వదలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటియందుండిరి. యుద్ధభూమి భూతప్రేత పిశాచ భే
తాళములతోడను, నక్కలతోడను, రాబందులతోను, గద్దలతోను, మాంసాశనులతోను, బ్రకాశించుచుండెను. కాంభోజరాజునకు పదమూడు అక్షౌహిణీళ సేన యున్నది. మూడు అక్షౌహిణీలసేన హతమైనది. పురంజయుడు తానూ యుద్ధమందోడుటకును, తన రాజ్యము శతృరాజుల చేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమియు తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు పలికెను. ఓ రాజా! శత్రుబృందముతో సహా వీరసేన మహారాజును జయించ గోరితినేని విష్ణుమూర్తి సేవ జేయుము. ఇప్పుడు కార్తికపూర్ణిమ, నిండు పూర్ణిమ, కృత్తికా నక్షత్రముతో కూడినది. కాబట్టి యిది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజింపుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరిముందు గోవిందా, నారాయణా మొదలయిన నామములను పాడుచు నాట్యమును జేయుము. సుశీలుడిట్లు చెప్పెను. కార్తిక వ్రతమాచరించితివేని హరి తన భక్తులను ఆపత్తులు లేక రక్షించుట కొరకు తన వేయి అరలు గల విష్ణు చక్రము పంపును. కార్తిక మాసమందు చేసిన పుణ్య మహిమను జెప్పుటకెవ్వని తరమౌను? నీ అధర్మ వర్తనము వలన అపజయము కలిగినది. ఇకముందు సత్ధర్మపరుడవు గమ్ము. అట్లయిన కొనియాడదగిన వాడగుదువు. ఓ రాజా! కార్తిక వ్రతమాచరింపుము. హరి భక్తుడవు కమ్ము. కార్తిక వ్రతము వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము కలుగును. నామాట నమ్ముము. త్వరగా చేయుము. 
ఇతి స్కాంద పురాణే కార్తికమహాత్మ్యే ఏక వింశాధ్యాయః సమాప్తః
కార్తీక పురాణం - 22
22వ అధ్యాయము - పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట

మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను.
పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని గానముచేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయముకాగానే నదికిపోయి, స్నానమాచరించి తన గృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు - మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి "రాజా! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడాదీసుకొని, యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును", అని దీవించి అదృశ్యుడయ్యెను. "ఈతడెవరో మహాను భావునివలె నున్నాదు, అని, ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక, శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా!

ఆ యుద్దములో కా౦భోజాది భూపాలురు ఓడిపోయి "పురంజయా రక్షింపుము రక్షింపు"మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా! విషం త్రాగినాను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా 'శ్రీ హరి' అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా!

హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులును పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడు౦డును. సంసారసాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు, భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదలనొసంగి కాపాడుచుండెను.

శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి యింట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ యిల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీకమహాత్మ్య మందలి ద్వావి౦శోధ్యాయము - ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము
కార్తిక పురాణం - 23 వ భాగం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

అగస్త్య ముని పల్కెను. అత్రి మునీంద్రా! పురంజయుడు యుద్దమందు జయమొందిన తర్వాత ఏమి చేసెనో నాకు దెలియజెప్పుము. అత్రి పల్కెను. శత్రు బాధారహితమైన అయోధ్యా పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును, సూర్యుడు వలె చూడ శక్యముగాని వాడును, శత్రువులను శిక్షించు వాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామక్రోధలోభ మోహ మద మాత్సర్యములను జయించిన వాడును, కార్తిక వ్రతము చేత పాపములన్నియు నశింపజేసి కొనిన వాడై యుండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లారాధింతును? ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును? ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి యిట్లనియె. ఓ పురంజయా! శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించి యున్నాడు. కాబట్టి సంసారచ్చేదమును జేయువాడగు శ్రీరంగ నిలయుని సేవిన్చుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణమును విడిచి తన చతురంగ బలములతోను అనేక క్షేత్రములను తీర్థములను జూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను. కార్తికమాసమంతయు అచ్చట ఉంది కావేరీ మధ్యము, నివాసముగా గలవాడిన శేష శాయియయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తిక వ్రతమును శాస్త్రోక్తముగా జేసెను. కృష్ణా, కృష్ణాయని గానము చేయుచు గోవిందా, వాసుదేవా యని నిరంతరమూ కీర్తించుచు, విష్ణు పూజా పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషశాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను జూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్యా పట్టణమును జూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోను, పుష్టితోను గూడిన జనులు గలిగినదియు, దృఢముగా నున్న యంత్రములు గడియలు గలిగినదియు అగడ్తలు గలిగినదియు, గుర్రములతోను, ఏనుగులతోను, రథములతోను నిండియున్నదియు, గృహ గోపురముల వెంట వీధులు గలిగినదియు, అనేక వర్ణములు గల పతాకములు గలదియు, వాయువుచేత చలింప జేయబడుచున్న పతాకములు గలదియు, అనేక భటులు కలదియు అనేక దేశ వాసులతో గూడినదై యుండెను. అచ్చట స్త్రీలు సుందరులును, హంసల వలే, ఏనుగుల వలె నడుచు వారును, చెవుల వరకునుండు విశాల నేత్రములు గలవారును, గొప్ప పిరుదులు గలవారును, సన్నని నడుము గలవారును, బలిసిలావుగా వున్న కుచములు గలవారును, మంచి వస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితలుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు, నృత్యమందు నిపుణులును, సౌందర్యముతోను, లావణ్యముతోను గూడియున్న వారును, నిత్యమానంద యుక్తులు, మదోన్మత్తులును సమస్త స్త్రీ గుణ భూషితలై చూచుటలోను, మాట్లాడుట లోను బహు నేర్పరులై సభలలోను రాజమార్గముల లోను రచ్చలలోను ఆటలాడుచుండువారి యుండిరి. అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితలై పాతివ్రత్య పరాయణలై యుండిరి. ఓ అగస్త్య మునీంద్రా అచ్చటి మనుజులందరు తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును జూచి సంతోషించెను. "యధారాజా తథా ప్రజా" అను న్యాయమును బట్టి రాజు న్యాయ వర్తనుడైన ప్రజలును న్యాయమందే యుందురు గదా! పురజనులందరును రాజు వచ్చుటను విని వేలవేలు గూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును బ్రవేశించి తన యింటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మ యుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములననుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమమవలంబించి కార్తి వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దానిచేత వైకుంఠ లోక వాసియై సుఖముగా నుండెను. అగస్త్య మునీంద్రా! కార్తిక వ్రతము మహా మహిమ గలది. ఈ కార్తిక ధర్మము హరికి ప్రియకరము. కార్తిక వ్రతమును జేయువాడు పరమ పదమును బొందును. అవశమై చేసినను ఉత్తమగతి పొందును. సమస్త సౌఖ్యములను యిచ్చునదియు, కలికల్మష నాశకారియు నైన కార్తిక వ్రతమును జేయని మనుష్యుడు దుఃఖమును బొందును. హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసికొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును. ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మాహాత్మ్యే త్రయోవింశాధ్యాయ సమాప్తః!!
కార్తీక పురాణం     24 వ రోజు

       అంబరీషుని ద్వాదశి వ్రతము

         అత్రి మహాముని మరల అగస్త్యునితో " ఓ కుంభ సంభవా! కార్తీక వ్రత ప్రభావము ఏంత చదివినను,విన్నను తనివి తీరదు. నాకు తెలిసి నంత వరకు చెప్పెదను వినుము  గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందు వలనను, సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు చేయటము వలన ఏంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజ తత్వమును తెలియచేసే ఈ కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్దలతో దాన ధర్మములు చేయు వారికీని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్మ్య ఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు.

       ఆ ద్వాదశి వ్రతము చేయు విధాన ఏటువంట్టిదో చెప్పెదను వినుము.కార్తీక శుద్ధ దశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోప వాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింప వలయును.

         దీనికొక యితిహాసము కలదు. దానిని కూడా వివరించెదను. సావదనుడవై అలకింపుము అని యిట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను ఒక రాజు కలడు. అతడు పరమ భగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడి వాడు. ఒక ద్వాదశి నాడు, ద్వాదశి ఘడియలు స్వల్ప ముగా నుండెను అందుచే ఆ రోజు తొందరగానే వ్రతమును ముగించి బ్రాహ్మణా సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున అచటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణము చేయవలయును గాన, తొందరగా స్నానమునకై రమ్మన మని కోరెను. దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకు వెళ్ళెను.

       అంబరీషుడు ఏంత సేపు వేచి యున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుకొనెను."ఇంటి కొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని . ఆ ముని నదికి స్నానముకు వెళ్లి యింత వరకు రాలేదు. బ్రాహ్మణునకు అధిత్య మిత్తునని మాట యిచ్చి భోజనం పెట్టక పోవుట మహా పాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశి ఘడియలు దాటి పొవును వ్రత భంగమగును. ఈ ముని మహా కోప స్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణా భోజనం అతిక్రమించ రాదు. ద్వాదశి ఘడియలు మించిపో కూడదు. ఘడియలు దాటి పోయిన పిదప భుజించిన యెడల, హరి భక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పల మగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు,భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును. అదియుగాక, యీ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసినా పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు.

        అని అలోచించి  బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహా విష్ణువే పోగోట్ట గలడు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని, సర్వజ్ఞులైన కొందరు పండీతులను రప్పిచి వారితో యిట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున ఏకాదశి యగుటం జేసి నేను కటిక ఉపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా  మాత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది.

       ఇంతలో  నా యింటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అంధుల కాయన అంగీకరించి నదికి స్నానార్ధమై వెళ్లి ఇంత వరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటి పోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా? లేక, వ్రత భంగమును సమ్మతించి ముని వచ్చే వరకూ వేచి యుండ వలెనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుప వలసినదిగా కోరెను.

       అంతట ఆ ధర్మ జ్ఞులైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసికొని, దీర్ఘముగా అలోచించి ఓ మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భకు హరములందు జటరాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్ని దేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగా వించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణ వాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ- దప్పిక కలుగును. ఆ తాపము చల్లార్చవలెనన్న అన్నము,నీరు పుచ్చుకొని శాంత పరచ వలెను. శరీరమునకు శక్తి కలుగ చేయువాడు అగ్ని దేవుడు, దేవతలందరి కంటే అధికుడై దేవ పూజ్యుడైనాడు. ఆ అగ్ని దేవున్ని అందరు సదా పూజింప వలెను. గృహస్తు యింటికి వచ్చిన అతిధి కదా ఏ జాతి వాడైనాను భోజనం పెడుదునని చెప్పివానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేద వేదాంగ విద్య విశారదుడును, మహా త ప శ్శాలియును సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహా మునిని భోజనమునకు పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా పాపమూ కలుగును. అందువలన అయుః క్షీణము కలుగును.దుర్వాసున్నీ అవమాన మొనరించిన పాపము సంప్రాప్త మగను అని వివరించారు పండితులు.

చతుర్వింశ అధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.
కార్తిక పురాణం - 25 వ భాగం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

బ్రాహ్మణులిట్లు చెప్పిరి. అంబరీష మహారాజా! నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరితాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వ పాతకము వలన సంభవించినది. ఈవిషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము గాము. పారణను ఆపితిమా హరిభక్తికి లోపము కలుగును. పారణ చేయించితిమా దూర్వాసుడు శాపమిచ్చును. కనుక ఎట్లైనను కీడు రాక తప్పదు. అందులకు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను. ఓ బ్రాహ్మణులారా! హరిభక్తిని విడుచుటకంటే బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది. నేనిపుడు కొంచెము జలము చేత పారణ చేసెదను. ఈ జల పానము భక్షణమగును. అది భక్షణమగునని పెద్దలు చెప్పియున్నారు. ఇచ్చట సృత్యర్థబోధక ప్రమాణము "కర్తుంసాధ్యం యదానాలం ద్వాదశ్యద్భిస్తు పారయేత్! కృతాపః ప్రాశనా త్పశ్చాద్భుంజీత్యేత్యపరేజగురితి!!" కాబట్టి జల పారణము చేత ద్వాదశ్యతిక్రమణ దోషము రాదు. బ్రాహ్మణ తిరస్కారమున్నూ ఉండదు. ఇట్లు చేసిన యెడల దుర్వాసుడు శపించడు. నా జన్మాంతర పాతకము నశించును. రాజిట్లు నిశ్చయించి జలముచేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించు వాడు వలె అంబరీష మహారాజును జూచి చెవులకు వినశక్యము గాని కఠినమైన వాక్యములను ఈవిధముగా పల్కెను. ఒరాజా! అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగ కారిణియైన దుర్భుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించిన వాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించిన వాడు అందరికంటే అధముడు. వాడు ఆశుద్ధములో ఉండు పురుగు వలె మలాశియగును. ఆత్మార్థము వంట చేసికొన్న వాడు పాపమును భుజించును. అతిథి కొరకై వండించి తానే భుజించిన వాడు పాపముల పరంపరను భుజించుచున్న వాడగును. అగ్ని పక్వమైనది గాని, పక్వము గానిది గాని, ఆకు గాని, పుష్పము గాని, ఫలము గాని, పాలు గాని, అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడనయిన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడవై అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడవగుదువు? ఓరి మందుడా! ఎప్పుడైననూ బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా? నీకు హరి దేవుడెట్లగును? అతనియందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును, హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడనైన నన్ను వదిలి భుజించితివి గాని బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారము తోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని గూడ తిరస్కరించినవాడవైతివి. రాజా! ఇప్పడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరీ! నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకొని ధర్మ మార్గమునను నశింపజేయుచున్నావు. ఓరీ పాపాత్మా! ఈ భూమియందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్నాశ్రయించ వత్తురు. నీవు దుర్మార్గుడవు. గనుక వారిని బాధించెదవు. నీవు ధర్మ కంటకుడఅగుదవు.

దూర్వాసుడు ఇట్లు పలుకగా విని అంబరీషుడు నమస్కరించి ఇట్లని ప్రార్థించెను. అయ్యా! నేను పాపుడను. పాపకర్ముడను. పాప మానసుడను. నిన్ను శరణు వేడెదను. నన్ను రక్షించుమని కోరెను. నేను ధర్మ మార్గమును దెలియక పాపమను బురదయందు పది దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను రక్షించుము. నేను క్షత్రియుడను. పాపములను జేసితిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు. కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు. మీవంటి మహా బుద్ధిమంతులు దయావంతులై మావంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించవలయును. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమ కాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి యిట్లనియె. రాజా! నేను దయ గలవాడను గాను. నాకు శాంతి లేదు. ఓర్పు లేనివారికి ఆలయమైతిని. గనుక దుర్వాసుడు శాంతి లేనివాడని తెలిసికొనుము. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన యెడల శాంతులగుదురు. గానీ నేను కోపితుడనైతినేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించు వాడను గాను. ఇట్లని పలికి అంబరీషునుద్దేశించి శాపమిచ్చెను. ౧. మత్స్యము ౨. కూర్మము ౩. వరాహము 4. వామనుడు ౫. వికృత ముఖుడు ౬. బ్రాహ్మణుడై క్రూరుడు ౭. క్షత్రియుడై జ్ఞాన శూన్యుడు ౮. క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు ౯. దురాచారుడు - పాషండ మార్గవేడియు, 10. బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నేను శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటె ముందు చేస్తినను గర్వముతో నున్న నీకు ఈ పదిజన్మలూ వచ్చును.అనగా పదింటియందును గర్వమును పొందదగినది ఒక్కటియూ లేదు. కనుక గర్వించిన వానికి గర్వ భంగకరములైన జన్మలను యిచ్చితిననెను. ఇట్లు పది శాపములు ఇచ్చి నన్ను అవమాన పరచిన వానికి ఇంకా శాపమివ్వలయునని తలంచి దుర్వాసుడు నోరు తెరుచునంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్
యుడును, భక్తి ప్రియుడును, శరణాగత వత్సలుడునగు హరి తన భక్తుని కాపాడు తలంపుతోను, బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేయవలయునను తలంపుతోనూ దుర్వాసుడు ఇచ్చిన పది శాపములనూ తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలయునని తలంచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము కోటి సూర్య కాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరుగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో మునివెంట బడెను. ముని ఆత్మ రక్షణమునకై భూమినంతయు తిరిగెను. దుర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింప బడెను గానీ చక్ర భయము చేత మునిని రక్షించు వాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులును, వసిస్టాది మునీశ్వరులు, బ్రహ్మాది దేవతలు, దుర్వాసుని రక్షింపలేరైరి. ఇట్లు తపస్సు చేసుకొను మునీశ్వరుని అతి కోపముచేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానము చేయుట చేత దుర్వాసునకు ప్రాణ సంకటము తటస్థించెను.
ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే పంచవింశాధ్యాయ సమాప్తః!!