Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
కోపం


ఎవరి కోపం వారికే శత్రువు. అది నిప్పులాంటిది. దహించడం దాని గుణం. ఇతరులను దహించాలని తలచేవారు, చివరకు తామే కోపం అనే అగ్నికి ఆహుతి అవుతారు. 
ఆగ్రహంతో ఉన్నవారు నిగ్రహం కోల్పోతారు. కళ్ళకు పొరలు కమ్ముతాయి. తుదకు దేవుణ్నీ లెక్కచేయని పరిస్థితి వస్తుంది!  వృత్రాసుర సంహారం కోసం ఇంద్రుడు ప్రయోగించిన ఆయుధాలన్నీ విఫలమయ్యాయి. దధీచి ప్రసాదించిన వెన్నెముకతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని నిర్మించాడు. దుష్టుడైన వృత్రాసురుణ్ని ఆ ఆయుధంతో సంహరించి, ఇంద్రుడు లోకాల్ని రక్షించాడు. దధీచి కుమారుడు పిప్పలాదుడు పెద్దవాడైన తరవాత తన తండ్రి మరణానికి కారకులైన దేవతలపై కోపించాడు. వారిని సర్వనాశనం చేయ సంకల్పించాడు. తల్లి వద్దని చెప్పినా వినకుండా తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళాడు. అతడు చేసిన తపస్సు ఫలితంగా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకొమ్మన్నాడు. ‘స్వామీ! మీ మూడో కన్ను తెరచి దేవలోకాన్ని తగలబెట్టి, సర్వ నాశనం గావించండి... ఇదే నా కోరిక’ అన్నాడు పిప్పలాదుడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ‘నా కంటి మంటవల్ల దేవతలే కాదు... సర్వప్రకృతీ మాడి మసి అయిపోతుంది’ అని శివుడు ఎంత చెప్పినా పిప్పలాదుడు తన మూర్ఖపు పట్టు వదల్లేదు. దాంతో శివుడు తన మూడో కన్ను కొద్దిగా తెరిచాడు. దాని నుంచి వెలువడిన అగ్ని జ్వాలలు మొదట పిప్పలాదుణ్నే తాకాయి. కొద్ది నిమిషాలైనా ఆ మంటలను తట్టుకోలేక అల్లాడిపోయాడు. ‘పరమేశ్వరా! దేవతల్ని తగలబెట్టమని నిన్ను ప్రార్థిస్తే, తుదకు నా ప్రాణాలకే ఎసరు పెట్టావా, ఇది న్యాయమా?’ అన్నాడు పిప్పలాదుడు శోకిస్తూ. ‘భక్తా! నేను నిన్ను బాధించడంలేదు. నీ కోపమే నిన్ను బాధిస్తున్నది. నువ్వు కోరినట్లు దేవతలను దహించడానికే మూడో కన్ను కొద్దిగా తెరిచాను. కానీ దాని సెగ నీకు తగిలింది. ఎందుకంటే నీ శరీరం దేవతలకు నిలయం. నీ చేతులకు అధిదేవత ఇంద్రుడు. కన్నులకు సూర్యుడు. ముక్కుకు అశ్వనీ   దేవతలు. మనసుకు చంద్రుడు. నీ శరీరమంతటా దేవతలు నెలకొని ఉన్నారు. అందుకే అగ్నిజ్వాలలు నీపై ప్రసరించాయి’ అన్నాడు శివుడు. పిప్పలాదుడు తన తప్పు తెలుసుకొని    ఈశ్వరుణ్ని స్తుతించాడు. శంకరుడు అగ్ని జ్వాలలను పరిహరించాడు. 
క్షమాగుణం అలవరచుకుంటే కోపం శమిస్తుంది. కోపానికి విరుగుడు శాంతి. శాంతి సద్భావనకు దారి తీస్తుంది. ద్రౌపదికి జరిగిన అవమానాలు, అనుభవించిన కష్టాలు ఆమెకు కోపం తెప్పించడం సహజమే! ఆమె ప్రతిజ్ఞలు గొప్ప యుద్ధానికే దారితీశాయి. కాని, చివరకు ఆమె చూపిన ఔదార్యం అప్రతిమానమైనది. ఆమె మాటలు లోకానికి ఒక గుణపాఠం. 
దుర్యోధనుణ్ని సంతోషపెట్టడానికి అశ్వత్థామ నిద్రపోతున్న ద్రౌపదీ పుత్రుల తలలుకోసి చంపాడు. ఈ వార్త తెలిసి ద్రౌపది కుప్పకూలిపోయింది. అర్జునుడు ఆమెను ఓదార్చ ప్రయత్నించాడు. ‘నా గాండీవంతో అశ్వత్థామ తల ఖండించి తెచ్చి, నీ పాదాల చెంత పడవేస్తాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అశ్వత్థామ అర్జునుణ్ని చూడగానే భయంతో పారిపోసాగాడు. అర్జునుడు అశ్వత్థామను పట్టి కట్టి తెచ్చి, ద్రౌపది సమక్షాన నిలిపాడు. సిగ్గుతో తలవంచుకొని నిలబడి ఉన్న అశ్వత్థామతో ద్రౌపది ఇలా అన్నది- ‘దయతో ఉండాల్సిన జాతిలో పుట్టిన నీకు పిల్లల్ని చంపడానికి చేతులెలా వచ్చాయి, వారు నీకేం ద్రోహం చేశారు? నిద్రపోతున్నవారిని, యుద్ధానికి సిద్ధంగాలేనివారిని చంపడం తగునా?’ అని నిలదీసింది. ఆమెకు అశ్వత్థామ తల్లి గుర్తుకు వచ్చింది. 
‘ద్రోణుడితోపాటు చితిలో పడకుండా,    కొడుకును చూసుకుంటూ ఆ తల్లి ఎలాగో     బతుకుతూ ఉంది. నేనెలాగూ పిల్లల్ని పోగొట్టుకొని శోకిస్తూ ఉన్నాను. ఇంకో తల్లికీ నాలాంటి దుస్థితే పట్టాలా? ఆ తల్లి శోకాన్ని పోగొట్టండి’- అని కృష్ణార్జునులతో పలికింది. ద్రౌపది కోపం కరుణగా మారి, దయగా పరిణమించి, తుదకు శాంతిని స్థాపించింది.

#Kopam